Semiya Bisibelabath: లంచ్ లోకి అతిసులభంగా చేసుకొనే బిసిబెళబాత్.. సాధారణంగా సేమియా అంటేనే పాయసం గుర్తొస్తుంది. ఎందుకంటే సేమియా పాయసం అంటే అందరీకి ఇష్టం కనుక. సేమియా పాయసం లేనిదే ఏ పండుగ, శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. సేమియాతో వివిధ రకాల వంటలు చేస్తారు. అయితే ఇప్పుడు సేమ్యాతో బిసిబెళబాత్ ఎలా తయారుచేయాలో చూద్దాం.
కావలసిన పదార్దాలు
సేమియా - 200 గ్రా.
కందిపప్పు - 100 గ్రా.
మునగకాడలు - 2
వంకాయ ముక్కలు - 50 గ్రా.
ఉల్లి తరుగు - 50 గ్రా.
క్యారట్ తరుగు - 50 గ్రా.
టొమాటో తరుగు - 50 గ్రా.
పచ్చిమిర్చి తరుగు - 4
ఆవాలు - స్పూను
జీలకర్ర - స్పూను
ఇంగువ - చిటికెడు
చింతపండురసం - అర కప్పు
ఎండుమిర్చి - 2, లవంగాలు - 3
పసుపు - పావు టీ స్పూను
దాల్చినచెక్క - చిన్నముక్క
కరివేపాకు - ఒక రెమ్మ
కొత్తిమీర - చిన్న కట్ట
నూనె - గరిటెడు,
ఉప్పు - తగినంత
కారం - అర టీస్పూను
సాంబారు పొడి - స్పూను
తయారి విధానం
మూడు కప్పుల నీటిలో ఒక టీ స్పూను నూనె వేసి సేమియాను ఉడికించాలి. ఉడికించిన సేమ్యాను చల్లని నీటితో బాగా కడిగి నీటిని వడకట్టి పక్కన పెట్టాలి. కందిపప్పును కుక్కర్ లో పెట్టి మెత్తగా ఉడికించుకోవాలి. పొయ్యి వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగాక ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలు వచ్చాక లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేగించాలి.
తర్వాత మునగ, వంకాయ,ఉల్లిపాయ,క్యారట్, టమోటా ముక్కలను వేసి కొంచెం నీరు పోసి ఉడికించాలి. ఆ ముక్కలు కొంచెం మెత్తబడ్డాక చింతపండురసం, సాంబారు పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ఉడికించిన కందిపప్పు, కొంచెం నీరు పోసి పది నిముషాలు ఉడికించాలి. చివరగా ఉడికించి ఉంచుకున్న సేమియను కలిపి రెండు నిముషాలు అయ్యాక కొత్తిమీర వేసి దించాలి.