
వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెద్దవారే కాదు, యువతను సైతం కంటి సమస్యలు వేధిస్తున్నాయి. అలాంటి వారు తమ ఆహారంలో గోజీ బెర్రీలను చేర్చుకుంటే చాలా మంచిది.
‘డ్రైడ్ గోజీ బెర్రీస్’ అని ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తే, ఇవి సులభంగా దొరుకుతాయి. డ్రై ఫ్రూట్స్ లాగానే వీటి ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. క్వాలిటీ బట్టి కిలో రూ.1500 వరకు ఉండొచ్చు. లైసియం చినెన్స్, లైసియం బార్బరమ్ అనే రెండు రకాల మొక్కలకు ఈ పండ్లు కాస్తాయి. వీటిని ఎండబెట్టి డబ్బాల్లో నిల్వ చేస్తారు.
చైనీయులు గోజీ బెర్రీలను స్నాక్స్‌గా లేదా సూప్‌లో వేసుకుని తింటారు. అరటిపండు తిన్నట్లుగా, వీటిని తినగానే తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి శరీరానికి జియాక్సంతిన్‌ను అందిస్తాయి. టిబెట్, చైనాలో ఈ పండ్లు ఎక్కువగా పండుతాయి. అందుకే వీటిని హిమాలయన్ గోజీ, టిబెటన్ గోజీ అని కూడా అంటారు.
రోజుకు 10 ఎండు గోజీ బెర్రీలు తింటే కంటి సమస్యలు తగ్గుతాయని చైనీయులు చెబుతారు. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం కూడా గోజీ బెర్రీల ప్రయోజనాలను వివరించింది.
నియమితంగా ఎండు గోజీ బెర్రీలు తినడం వల్ల కంటి చూపు లోపాలు, కళ్లలో మచ్చలు, ఇతర దృష్టి సమస్యలు రాకుండా నివారించవచ్చు. గోజీ బెర్రీలలోని లుటీన్, జియాక్సంతిన్‌లు హానికరమైన నీలి కాంతిని ఫిల్టర్ చేసి, యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. అంతేకాకుండా, క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయని అధ్యయనంలో తెలిపారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.