Chikkudukaya Vepudu:"చిక్కుడుకాయ వేపుడు".. పోషకాలేమి పోకుండా కమ్మని రుచిగా చేయాలంటే ఇలా చేయండి.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయలలో చిక్కుడు కాయలు ఒక ముఖ్యమైనవి. చాలా కాలం నుండి మనం చిక్కుడు కాయలను ఆహారంగా ఉపయోగిస్తున్నాం. ఈ కాయలు శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మానసిక ఒత్తిడి, నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. చిక్కుడు కాయలలో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి,
ఇవి మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తహీనతను తగ్గించడంలోనూ ఇవి ఉపయోగకరం. చిక్కుడు కాయలతో వేపుడు చేసుకుంటే అది రుచికరంగా ఉంటుంది. ఈ వేపుడును ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిక్కుడు కాయ వేపుడు తయారీకి కావలసిన పదార్థాలు:
చిక్కుడు కాయలు – అర కిలో
నూనె – 1 టేబుల్ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
మినపప్పు – అర టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
జీలకర్ర – అర టీ స్పూన్
ఎండు మిరపకాయలు – 2
తరిగిన ఉల్లిపాయ – 1
పసుపు – అర టీ స్పూన్
కారం – 1 టీ స్పూన్
ధనియాల పొడి – అర టీ స్పూన్
పుట్నాల పొడి – 1 టీ స్పూన్
ఎండు కొబ్బరి పొడి – అర టీ స్పూన్
కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 8
ఉప్పు – రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా చిక్కుడు కాయలను చిన్న ముక్కలుగా తరిగి, శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి.ఒక గిన్నెలో తరిగిన చిక్కుడు కాయలు, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి.
ఒక ప్లేట్‌లో కారం, ధనియాల పొడి, పుట్నాల పొడి, ఎండు కొబ్బరి పొడి, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలను వేసి, అన్నీ బాగా కలిసేలా చేత్తో కలపాలి.
ఒక కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించాలి.ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత, ఉడికించిన చిక్కుడు కాయలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
మధ్యస్థ మంటపై చిక్కుడు కాయలను వేయించాలి. కాయలు పూర్తిగా ఉడికిన తర్వాత, ముందుగా సిద్ధం చేసిన మసాలా మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.చిన్న మంటపై 5 నిమిషాలు వేయించి, స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ విధంగా తయారైన చిక్కుడు కాయ వేపుడు రుచికరంగా ఉంటుంది. దీన్ని నేరుగా లేదా పప్పు, రసం, చారుతో కలిపి తింటే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.