Tomato Drumstick Curry:సులువైన పద్దతిలో "ములక్కాడ టమాట కర్రీ" ఇలా చేయండి

Tomato Drumstick Curry:సులువైన పద్దతిలో "ములక్కాడ టమాట కర్రీ" ఇలా చేయండి.. మనం మునక్కాయలతో రకరకాల వంటకాలు తయారు చేస్తుంటాం. మునక్కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. 

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, ఎముకలను బలోపేతం చేయడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో మరియు పేగు కదలికలను మెరుగుపరచి మలబద్ధకాన్ని తగ్గించడంలో మునక్కాయలు గొప్పగా సహాయపడతాయి. 

అలాగే, రక్త శుద్ధికి కూడా ఇవి ఉపయోగపడతాయి. సాధారణంగా మనం మునక్కాయలను సాంబార్, పప్పు చారు వంటి వంటకాల్లో ఉపయోగిస్తాం. టమాట మునక్కాయ కూర కూడా చాలా మంది ఇష్టపడే వంటకం. 

అయితే, ఈ కూరను సరిగ్గా తయారు చేయడం కొందరికి కష్టంగా ఉంటుంది. అలాంటి వారు కింది విధానాన్ని అనుసరిస్తే, రుచికరమైన టమాట మునక్కాయ మసాలా కూర సులభంగా తయారవుతుంది. ఈ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

టమాట మునక్కాయ మసాలా కూరకు కావలసిన పదార్థాలు:
మునక్కాయలు – 2 (ముక్కలుగా తరిగినవి)
టమాటాలు – అర కిలో (తరిగినవి)
ఉల్లిపాయ – 1 (తరిగినది)
పచ్చిమిర్చి – 2 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి ముక్కలు – 1 టేబుల్ స్పూన్
లవంగాలు – 2
దాల్చినచెక్క – 1 చిన్న ముక్క
గరం మసాలా – 1 టేబుల్ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – అర టీ స్పూన్
కరివేపాకు – 1 రెబ్బ
నీళ్లు – 1 గ్లాసు
కొత్తిమీర – కొద్దిగా (తరిగినది)

టమాట మునక్కాయ మసాలా కూర తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో నువ్వులు, ధనియాలు, ఎండు కొబ్బరి ముక్కలు, లవంగాలు, దాల్చినచెక్క వేసి స్వల్పంగా వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తని పొడిగా చేయాలి.

ఒక కళాయిలో నూనె వేసి కాగాక, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసి, చిన్న మంటపై 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తర్వాత తరిగిన టమాటాలు వేసి, మూత పెట్టి టమాటాలు మెత్తగా ఉడికే వరకు ఉంచాలి.

టమాటాలు ఉడికిన తర్వాత, ముందుగా తయారు చేసిన మసాలా పొడి, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఒక గ్లాసు నీళ్లు పోసి బాగా కలపాలి. మూత పెట్టి 10 నిమిషాలు మెత్తగా ఉడికించాలి.
చివరగా, కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయాలి.

ఇలా తయారైన టమాట మునక్కాయ మసాలా కూర రుచికరంగా ఉంటుంది. దీన్ని అన్నం లేదా చపాతీతో తింటే చాలా బాగుంటుంది. ఈ కూరలో టమాటాలు, మునక్కాయల్లోని పోషకాలు మనకు అందడమే కాక, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top