Chole Masala Curry:రైస్ రోటి పూరి బిరియాని దేంట్లోకైనా రుచిగా ఉండే "చోలే మసాలా కర్రీ".. తెల్ల శనగలు, ఇవి పంజాబీలో చోలే అని పిలవబడతాయి, మన ఆహారంలో ముఖ్యమైన భాగం. ఈ శనగలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తాయి.
వృక్ష సంబంధమైన ఆహారాల్లో అత్యధిక ప్రోటీన్లు కలిగిన వాటిలో ఇవి ఒకటి. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంతో పాటు బరువు తగ్గించడంలోనూ ఇవి సహాయపడతాయి. ఫోలిక్ యాసిడ్, ఫైబర్, మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి, జీర్ణ శక్తి, ఎముకల బలాన్ని పెంచడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
అలాగే, రక్తపోటు, హార్మోన్ల అసమతుల్యతను తగ్గించడంలో కూడా ఇవి సహాయకరం. ఇన్ని ప్రయోజనాలు కలిగిన తెల్ల శనగలను ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ శనగలతో రకరకాల వంటకాలను తయారు చేస్తాం, వాటిలో చోలే మసాలా కూర ఒకటి. ఈ రుచికరమైన చోలే మసాలా కూరను ఎలా తయారు చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
చోలే మసాలా కూర తయారీకి కావలసిన పదార్థాలు:
6 నుండి 7 గంటలు నానబెట్టిన తెల్ల శనగలు – 1 కప్పు
తరిగిన ఉల్లిపాయలు – 2
తరిగిన టమాటాలు – 2
తరిగిన పచ్చిమిర్చి – 3
పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
గరం మసాలా – 1 టీ స్పూన్
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
చోలే మసాలా – 1 టీ స్పూన్
జీలకర్ర – 1 టీ స్పూన్
కారం – 1 టేబుల్ స్పూన్
పసుపు – ½ టీ స్పూన్
నూనె – 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – 1 రెబ్బ
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
నీళ్లు – 1½ గ్లాస్
మసాలా దినుసులు:
బిర్యానీ ఆకు – 1
దాల్చిన చెక్క – 2 (చిన్నవి)
యాలకులు – 3
లవంగాలు – 5
చోలే మసాలా కూర తయారీ విధానం:
నానబెట్టిన తెల్ల శనగలను కుక్కర్‌లో వేసి, నీళ్లు పోసి మూత పెట్టి, మధ్యస్థ మంటపై 5 విజిల్స్ వ చ్చే వరకు ఉడికించాలి. ఒక మిక్సీ జార్‌లో తరిగిన ఉల్లిపాయలు, టమాటాలు, బిర్యానీ ఆకు తప్ప మిగిలిన మసాలా దినుసులను వేసి మెత్తగా మిక్సీ చేయాలి.
ఒక కళాయిలో నూనె వేడి చేసి, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి వేగించాలి. ఇవి వేగిన తరువాత, మిక్సీలో మెత్తగా చేసిన ఉల్లిపాయ-టమాటా మిశ్రమాన్ని వేసి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.
తరువాత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, చోలే మసాలా, పెరుగు వేసి కలిపి 5 నిమిషాలు వేయించాలి. 5 నిమిషాల తరువాత, ఉడికించిన శనగలను నీళ్లతో సహా వేసి, కలిపి 10 నిమిషాలు ఉడికించాలి.
చివరగా, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇలా తయారు చేసిన చోలే మసాలా కూర ఎంతో రుచికరంగా ఉంటుంది. దీనిని జీరా రైస్, చపాతీ, పుల్కాతో కలిపి తింటే అద్భుతమైన రుచితో పాటు శనగలలోని పోషకాలు శరీరానికి అందుతాయి.