Tomato Perugu Pachadi :"టమాటా పెరుగు పచ్చడి" రుచిగా ఇలా చేసి చూడండి రైస్ చపాతీలో సూపర్.. మనం రోజూ ఆహారంలో పెరుగును తీసుకుంటాం. పెరుగు మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని అందరికీ తెలుసు. ఇది జీర్ణ శక్తిని మెరుగుపరచడం, ఎముకలను బలోపేతం చేయడం, జుట్టు మరియు చర్మ సంరక్షణలో సహాయపడటంతో పాటు, మెదడు మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అంతేకాకుండా, బరువు తగ్గడంలో మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. సాధారణంగా పెరుగును నేరుగా లేదా మజ్జిగ, లస్సీ వంటి రూపాల్లో తీసుకుంటాం. అలాగే, వివిధ రకాల కూరలు, పచ్చళ్ల తయారీలో కూడా పెరుగును ఉపయోగిస్తాం.
అలాంటి పచ్చళ్లలో టమాటా పెరుగు పచ్చడి ఒకటి. ఈ టమాటా పెరుగు పచ్చడిని ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటా పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:
తరిగిన టమాటాలు – 250 గ్రాములు
పచ్చి మిరపకాయలు – 10
పెరుగు – అర కప్పు
చింతపండు – 10 గ్రాములు
వెల్లుల్లి రెబ్బలు – 5
జీలకర్ర – 1½ టేబుల్ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
శనగపప్పు – ½ టీ స్పూన్
ఎండు మిర్చి – 2
కరివేపాకు – 1 రెబ్బ
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి సరిపడా
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
టమాటా పెరుగు పచ్చడి తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగిన తర్వాత పచ్చి మిరపకాయలను వేసి వేయించాలి.మిరపకాయలు వేగిన తర్వాత, తరిగిన టమాటాలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు వేసి బాగా కలపాలి.
మూత పెట్టి, మధ్యస్థ మంటపై టమాటాలను పూర్తిగా ఉడికించాలి. టమాటాలలోని నీరు పూర్తిగా ఆవిరైపోయే వరకు వేయించి, స్టవ్ ఆపేయాలి.ఉడికిన టమాటా మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకుని, అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన కొత్తిమీర వేసి, మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా మిక్సీలో పట్టుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పెరుగు వేసి బాగా కలపాలి.ఇప్పుడు ఒక చిన్న కళాయిలో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత ఆవాలు, మిగిలిన జీలకర్ర (½ టేబుల్ స్పూన్), ఎండు మిర్చి, శనగపప్పు, కరివేపాకు వేసి తాళింపు చేయాలి.
తాళింపు వేగిన తర్వాత, దానిని పెరుగు కలిపిన టమాటా మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇలా చేయడం ద్వారా రుచికరమైన టమాటా పెరుగు పచ్చడి సిద్ధమవుతుంది. ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, దోశ, ఊతప్పం, ఉప్మా వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.