Hair Care Tips:ఒకసారి దువ్వెన మార్చి ఉపయోగించండి, జుట్టు రాలడం సులభంగా తగ్గిపోతుంది...జుట్టు రాలకుండా నివారించేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ఆయిల్స్, కండీషనర్స్, షాంపూలు వాడుతుంటారు. ఇవి కొంత వరకు పని చేసినప్పటికీ, వాటిలోని కెమికల్స్ వల్ల కొన్ని సమయాల్లో దుష్ప్రభావాలు తప్పవు.
అయినప్పటికీ, తప్పనిసరి పరిస్థితుల్లో వీటిని ఉపయోగించాల్సి వచ్చినా, కొన్ని అలవాట్లను అవలంబిస్తే జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటి సలహా ఏంటంటే, దువ్వెనను మార్చడం. అంటే, రోజూ వాడే ప్లాస్టిక్ దువ్వెనకు బదులుగా చెక్క దువ్వెనను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ దువ్వెనకు, చెక్క దువ్వెనకు తేడా ఏంటి, ఇది జుట్టు రాలే సమస్యతో ఎలా సంబంధం కలిగి ఉందో ఇప్పుడు చూద్దాం.
జుట్టు రాలే సమస్యను ఎలా నివారించాలో తెలియక ఆలోచిస్తున్నారా? అయితే, ఒక్క సాధారణ మార్పుతో జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే, ప్లాస్టిక్ దువ్వెనను విడిచిపెట్టి, చెక్కతో తయారైన దువ్వెనను వాడడం. ఈ చిన్న మార్పుతో ఊహించని సానుకూల ఫలితాలు పొందవచ్చని అంటున్నారు.
ఈ మార్పు చిన్న విషయంలా అనిపించినప్పటికీ, క్రమంగా జుట్టు రాలడం తగ్గిపోతుంది. ప్లాస్టిక్ దువ్వెనలతో పోలిస్తే, చెక్క దువ్వెనలు తల స్కాల్ప్‌ను సున్నితంగా ఉంచుతాయి. దీనివల్ల జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు, జుట్టులో సహజంగా ఉండే నూనెలను జుట్టు అంతటా సమానంగా పంచడంలో సహాయపడతాయి. ఇది జుట్టుకు మెరుపును, బలాన్ని ఇస్తుంది.
ప్లాస్టిక్ దువ్వెనతో జుట్టును దువ్వినప్పుడు వెంట్రుకలు చిక్కుకోవడం వల్ల కొన్ని రాలిపోతాయి, మరికొన్ని మెలికలు తిరిగి చిట్లిపోతాయి. కానీ చెక్క దువ్వెనతో ఈ సమస్యలు ఉండవు. ఇది సున్నితంగా జుట్టును దువ్వడానికి సహాయపడుతుంది, అధిక ఒత్తిడి లేకుండా సులభంగా కోంబింగ్ చేయవచ్చు. దీనివల్ల జుట్టు చివర్లు చిట్లడం, రింగులు తిరగడం వంటివి తగ్గుతాయి.
చలికాలంలో జుట్టు తేమ కారణంగా అతుక్కుపోయినట్లు అనిపిస్తుంది. అలాంటి సమయంలో చెక్క దువ్వెన వాడితే చిక్కులు సులభంగా వదిలిపోతాయి, జుట్టు మృదువుగా మారుతుంది. అదే సమయంలో స్కాల్ప్‌లోని సహజ నూనెలు జుట్టు అంతటా సమానంగా చేరుతాయి, ఇది ప్లాస్టిక్ దువ్వెనతో సాధ్యం కాకపోవచ్చు.
స్కాల్ప్‌లో సహజ నూనెలు తగ్గిపోతే, జుట్టు పొడిబారి, కుదుళ్లు బలహీనమై రాలిపోతాయి. ప్లాస్టిక్ దువ్వెన వాడడం వల్ల తేమ తొలగిపోయే అవకాశం ఉంది. కానీ చెక్క దువ్వెన ఈ తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. దీనివల్ల జుట్టు దృఢంగా, మృదువుగా ఉంటుంది. అంతేకాదు, చెక్క దువ్వెన వాడటం వల్ల స్కాల్ప్‌కు మసాజ్ చేసినట్లు అవుతుంది, రక్త ప్రసరణ మెరుగవుతుంది. రక్త సరఫరా మెరుగైనప్పుడు జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, జుట్టుకు అవసరమైన పోషకాలు సరిగ్గా అందుతాయి.
రింగుల జుట్టు లేదా ఎక్కువ జుట్టు ఉన్నవారికి, సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారికి, డాండ్రఫ్ లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి చెక్క దువ్వెన ఎంతో మేలు చేస్తుంది. ఇవి చర్మ ఉపద్రవాన్ని తగ్గిస్తాయి. పైగా, వేప లేదా శాండిల్ వుడ్‌తో తయారైన చెక్క దువ్వెనలు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి అలెర్జీలు, ఫంగస్ సమస్యల నుంచి కాపాడతాయి. రెగ్యులర్‌గా చెక్క దువ్వెన వాడితే డాండ్రఫ్, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
చెక్క దువ్వెనను ఎంచుకునేటప్పుడు అది వేప కలపతో తయారైందా లేదా అని చూడాలి, ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. వెదురుతో తయారైన దువ్వెనలు జుట్టులో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. ఇక చెక్క దువ్వెనను రెగ్యులర్‌గా శుభ్రం చేయడం ముఖ్యం. నీటితో కడగాల్సిన అవసరం లేకపోయినా, సాఫ్ట్ బ్రష్ లేదా గుడ్డతో శుభ్రం చేయాలి. ఎక్కువ సమయం నీటిలో నానబెట్టడం లేదా తరచూ తడి చేయడం మానుకోవాలి.
ఈ చిన్న మార్పుతో జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు, ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టును పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.