OG Movie Review:OG సినిమా ఎలా ఉంది.. పవన్ హిట్ కొట్టినట్టేనా.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి, దీపావళి, దసరా పండగలు ఒకేసారి వచ్చినంత హడావుడి OG ప్రీమియర్ షోలతో నెలకొంది. OG ఫీవర్ రెండు రాష్ట్రాల్లో అలుముకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జపాన్ కత్తి కటనాతో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని, ఈ సినిమాతో 1000 కోట్ల వసూళ్లు సాధిస్తాడని ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. మరి, ఈ అంచనాలను OG అందుకుందా? గత చిత్రం హరి హర వీరమల్లుతో నిరాశపరిచిన పవన్ ఈ సినిమాతో తన సత్తా చాటాడా? OG రివ్యూ ద్వారా తెలుసుకుందాం...
కథ:
1940లలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ప్రారంభమవుతుంది. యాకూజా గ్యాంగ్ 100 మంది సమురాయ్‌లపై దాడి చేసి 99 మందిని చంపగా, ఒక సమురాయ్, ఓజాస్ గంభీర, తప్పించుకుంటాడు. యానిమేటెడ్ ప్రోలాగ్‌తో (వాయిస్ ఓవర్ నరేషన్) సినిమా ఆరంభమవుతుంది. 17 ఏళ్ల ఓజాస్ గంభీర ఇండియాకు వచ్చే ఓడలో దాక్కుంటాడు. అక్కడ గోల్డ్ స్మగ్లర్ సత్య దాదాతో పరిచయం ఏర్పడుతుంది. ఓజాస్ ఒక సంఘటనలో సత్య దాదాకు సహాయం చేయడంతో ముంబైకి చేరుకుంటాడు. అక్కడ ఓజాస్ సహకారంతో పోర్ట్ ఏర్పాటు కావడంతో కథ మొదలవుతుంది.
సినిమా మొదలైన మొదటి అరగంట వరకు పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉండదు. యంగ్ ఓజాస్ పాత్రలో నటించిన కుర్రాడు బాగానే చేశాడు. అటు తర్వాత పవన్ ఎంట్రీ... కటనా కత్తితో బీభత్సమైన ఎలివేషన్స్‌తో వచ్చే ఈ ఎంట్రీ సీన్ 10 KGF సినిమాల స్థాయిలో ఉందని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్స్‌కు ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో, దర్శకుడు సుజీత్ ఈ సన్నివేశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. అక్కడ నుండి అర్జున్ దాస్ వాయిస్‌తో కథ మళ్లీ మొదలవుతుంది.
ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్) పోర్ట్‌కు వచ్చిన 100 మందిని చంపడం, అర్జున్ దాస్‌తో అతని వైరం, RDX స్మగ్లింగ్ ప్రయత్నాలు, సత్య దాదా కొడుకు వెంకట్‌ను చంపడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ఈ సమయంలో OG ఎక్కడున్నాడు? అతని పెళ్లి ఎప్పుడైంది? పవన్ కూతురు, అతని జీవితం, ఓమీ (ఇమ్రాన్ హష్మీ)తో శత్రుత్వం ఏమిటి? అనేవి కథలో కీలక అంశాలు. సత్య దాదాపై చెన్నైలో జరిగిన దాడి, అక్కడి సంఘటనల నేపథ్యంలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఫైట్ సీన్స్‌లో పవన్ అదరగొట్టాడు.
సెకండ్ హాఫ్‌లో పవన్ కూతురు ఏమైంది, RDX కంటైనర్ కోసం విలన్ గ్యాంగ్ ప్రయత్నాలు, హీరో-విలన్ మధ్య పోరాటం, జపాన్ నుండి వచ్చిన యాకూజా గ్యాంగ్ లీడర్ ఎలివేషన్స్‌తో పార్ట్ 2కి లీడ్ ఏర్పడుతుంది. ఎండ్ టైటిల్స్ తర్వాత "OG అంటే ఎవరు నాన్నా?" అని అడగడంతో సినిమా ముగుస్తుంది. క్లైమాక్స్ ఫైట్ బాగా సాగినా, ఆకట్టుకుంది. ప్రభాస్ సాహోతో ఒక చిన్న లింక్ కూడా ఉంది, అది సినిమాలో చూసి ఆనందించండి.
పవన్ కళ్యాణ్ పాత్ర:
OG సినిమాకు ప్రాణం పవన్ కళ్యాణ్. ఇది పవన్ వన్ మ్యాన్ షో. ఫ్యాన్స్ అతన్ని ఎలా చూడాలనుకుంటారో అలాగే చూపించాడు దర్శకుడు సుజీత్. పవన్ స్టైల్, ఫైట్స్ ఫ్యాన్స్‌తో పాటు అందరినీ ఆకట్టుకునేలా రూపొందించారు. అయితే, మొదటి 30 నిమిషాలు పవన్ లేకపోవడం ఫ్యాన్స్‌కు కొంత నిరాశ కలిగించవచ్చు. యంగ్ ఓజాస్ పాత్రలో కొత్త నటుడిని తీసుకోవడం కొంత నిరాశ కలిగించింది. అకిరా ఈ పాత్ర చేసి ఉంటే ఇంకా బాగుండేదేమో. పోర్ట్‌లో జరిగే ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించాయి. పవన్ తన స్టైల్, గ్రేస్‌తో అదరగొట్టాడు.
థమన్ సంగీతం:
థమన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. తన సాధారణ శైలికి భిన్నంగా, ఈ చిత్రానికి అద్భుతమైన BGM అందించాడు. ఇటీవలి తెలుగు సినిమాల్లో OG BGM నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అయితే, కమల్ హాసన్ విక్రమ్ సినిమా BGM నుండి స్ఫూర్తి పొందినట్లు కనిపిస్తుంది.
హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్:
ప్రియాంక పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. పవన్ భార్యగా, డాక్టర్‌గా కొన్ని సీన్స్‌లో కనిపిస్తుంది. ఆమె పాత్ర చిన్నదైనా, ఉన్నంతలో ఆకట్టుకుంది.
ఇమ్రాన్ హష్మీ:
ఇమ్రాన్ హష్మీ తన పాత్రకు న్యాయం చేశాడు. అయితే, డబ్బింగ్ కొంత సెట్ కాలేదనిపిస్తుంది.
శ్రియారెడ్డి:
సినిమా ప్రారంభం నుండి శ్రియారెడ్డి పాత్ర హైలైట్ అయింది. సలార్‌లో హై డోస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆమె ఇందులోనూ మంచి పాత్ర పోషించింది.
జపాన్ బ్యాక్‌డ్రాప్:
సినిమాలో జపాన్ ప్రభావం గురించి దర్శకుడు ఎక్కువగా చెప్పినప్పటికీ, అది పెద్దగా కనిపించదు. ప్రారంభంలో స్వల్పంగా టచ్ చేశారు, అంతే. జపాన్ నేపథ్యం లేకపోయినా కథలో పెద్ద తేడా ఉండేది కాదు. పవన్ ఇమేజ్, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో కటనా కత్తిని జోడించినట్లు అనిపిస్తుంది.
టెక్నికల్ అంశాలు:
కెమెరా వర్క్, సినిమాటోగ్రఫీ 1980ల నేపథ్యాన్ని అద్భుతంగా చూపించాయి. ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. DVV దానయ్య నిర్మాణ విలువలు స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్ వల్ల ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో ఖర్చు పెరిగింది.
హైలైట్స్:
పవన్ కళ్యాణ్‌గా ఓజాస్ గంభీర
థమన్ సంగీతం
సుజీత్ దర్శకత్వం
యాక్షన్ సన్నివేశాలు
జానీ సినిమా BGMని ఒక సన్నివేశంలో ఉపయోగించడం
మైనస్ పాయింట్స్:
హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉండటం
సెకండ్ హాఫ్ కొంత స్లోగా సాగడం
రేటింగ్: 3.5/5
ఫైనల్ గా: OG అదిరింది! ఫ్యాన్స్ కోసం మాత్రమే కాదు, అందరికీ నచ్చే పవర్ ప్యాక్డ్ పవన్ కళ్యాణ్ మూవీ!


