Instant Garelu:పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు క్రిస్పీ గారెలు ఇలా చేయండి..గారెలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కానీ, మినపప్పు నానబెట్టి, రుబ్బి, వండటం చాలా సమయం తీసుకుంటుంది. అందుకే చాలామంది గారెలను బయట టిఫిన్ సెంటర్లలో కొనుగోలు చేస్తారు. అయితే, ఇప్పుడు మీరు రవ్వతో కేవలం 10 నిమిషాల్లో క్రిస్పీ గారెలు (Instant Garelu) సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీతో మీరు తక్కువ సమయంలో రుచికరమైన గారెలను ఆస్వాదించవచ్చు.
రవ్వ గారెలకు కావలసిన పదార్థాలు
ఉప్మా రవ్వ: 1 కప్పు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా
పచ్చిమిర్చి తరుగు: 2 టీస్పూన్లు
అల్లం తరుగు: 1 టీస్పూను
కొత్తిమీర తరుగు: 3 టీస్పూన్లు
నీరు: సరిపడా
వంట సోడా: చిటికెడు
రవ్వ గారెల తయారీ విధానం
ఒక కళాయిలో నీరు పోసి, స్టవ్ మీద మీడియం మంట ఉంచండి. నీటిలో అల్లం తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి బాగా కలపండి.నీరు మరిగిన తర్వాత, రవ్వను నెమ్మదిగా వేస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. రవ్వ మెత్తగా, గట్టిగా అయ్యే వరకు ఉడికించండి.
రవ్వ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమం గోరువెచ్చగా చల్లారే వరకు వేచి ఉండండి.ఒక కళాయిలో డీప్ ఫ్రైకి నూనె పోసి, మీడియం మంటపై వేడి చేయండి.చల్లారిన రవ్వ మిశ్రమం నుండి కొంత తీసుకొని, గారెల ఆకారంలో ఒత్తండి. మధ్యలో రంధ్రం చేసి, వేడి నూనెలో వేయండి.
గారెలు రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. అన్ని గారెలను ఇలా తయారు చేసుకోండి.
గారెల మిశ్రమంలో చిటికెడు వంట సోడా తప్పనిసరిగా వేయండి. ఇది గారెలను క్రిస్పీగా మారుస్తుంది. ఈ రవ్వ గారెలను టమాటో చట్నీ లేదా అల్లం చట్నీతో సర్వ్ చేస్తే అద్భుతమైన రుచి వస్తుంది. అలాగే, ఈ మిశ్రమంతో పెరుగు వడలు కూడా తయారు చేసుకోవచ్చు.
టిఫిన్‌కి త్వరగా గారెలు కావాలనుకుంటే, ఈ ఇన్‌స్టెంట్ రవ్వ గారెల రెసిపీ ఉత్తమ ఎంపిక. పప్పు నానబెట్టే ఇబ్బంది లేకుండా, కేవలం అరగంటలో రుచికరమైన, క్రిస్పీ గారెలు సిద్ధం!


