Ninne Pelladatha:‘నిన్నే పెళ్ళాడతా’ సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు.. ఫ్యామిలీ సినిమాలకు ఉన్న క్రేజ్ ఎప్పటికీ ప్రత్యేకం. ఏ సీజన్‌లోనైనా ఇలాంటి చిత్రాలకు భారీ ఆదరణ ఉంటుంది. అనేక దర్శకులకు స్టార్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టినవి ఫ్యామిలీ సినిమాలే. ఈ జాబితాలో దర్శకుడు కృష్ణవంశీ కూడా ఒకరు.
తన తొలి చిత్రం ‘గులాబీ’తో మంచి పేరు సంపాదించినప్పటికీ, ఆయనకు నిజమైన గుర్తింపు తెచ్చిన సినిమా ‘నిన్నే పెళ్ళాడతా’. ఈ చిత్రం విడుదలై 29 ఏళ్లు పూర్తవ్వడానికి ఇంకా కొన్ని రోజులే ఉన్న సందర్భంగా, ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం:
మొదట కృష్ణవంశీ, నాగార్జునతో ‘సముద్రం’ అనే సినిమా చేయాలని ప్లాన్ చేశారు. ఆ కథను నాగార్జునకు వినిపించారు, కానీ అది ఆయనకు నచ్చలేదు. అయినప్పటికీ, కృష్ణవంశీతో కలిసి పనిచేయాలనే ఆసక్తి నాగార్జునలో ఉంది.
‘గులాబీ’ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ, రెండో భాగంలో ‘హింస ఎక్కువగా ఉంది’ అనే విమర్శలు వచ్చాయి. అంతేకాక, కృష్ణవంశీ దర్శకత్వాన్ని రాంగోపాల్ వర్మతో పోల్చడం చాలామంది చేశారు. ఇది కృష్ణవంశీకి నచ్చలేదు. రాంగోపాల్ వర్మ శిష్యుడిగా కాకుండా, తన స్వంత గుర్తింపుతో ప్రసిద్ధి చెందాలని ఆయన కోరుకున్నారు. అందుకే వర్మ శైలికి భిన్నమైన జోనర్‌లో సినిమా చేయాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో ‘హమ్ ఆప్కే హై కౌన్’ (తెలుగులో ‘ప్రేమాలయం’), ‘దిల్వాలే దుల్హనియా లేజాయెంగే’ వంటి హిందీ ఫ్యామిలీ హిట్ సినిమాలను చూసి, కృష్ణవంశీ ఫ్యామిలీ డ్రామా చేయాలని నిశ్చయించారు. ఈ జోనర్‌లో రాంగోపాల్ వర్మ పోటీ ఇవ్వలేడని ఆయన నమ్మకం. వెంటనే ‘నిన్నే పెళ్ళాడతా’ కథపై పని ప్రారంభించారు.
ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో ‘రాముడొచ్చాడు’ షూటింగ్‌లో నాగార్జున బిజీగా ఉండగా, కృష్ణవంశీ ఆయనను కలిశారు. అప్పుడు నాగ్, కేవలం 15 నిమిషాలు మాత్రమే ఇస్తానని, ‘కథ ఆసక్తికరంగా ఉంటే పూర్తిగా వింటాను, లేకపోతే సమయం వృథా చేయొద్దు’ అని స్పష్టంగా చెప్పారు.
కృష్ణవంశీ కథ చెప్పడం ప్రారంభించగా, కేవలం 3 నిమిషాల్లోనే నాగార్జున కథకు కనెక్ట్ అయ్యి, ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. అలా అనుకోకుండానే 45 నిమిషాలు కథ చెప్పి, పూర్తి స్క్రిప్ట్‌తో రమ్మని నాగ్ సూచించారు.
కథ చెప్పేటప్పుడు కృష్ణవంశీ ‘శీను పండు’ అనే టైటిల్‌తో ప్రెజెంట్ చేశారు. 15 రోజుల్లో పూర్తి కథ సిద్ధం చేసి నాగార్జునకు వినిపించారు. అప్పుడు నాగ్ ‘నిన్నే పెళ్ళాడతా’ టైటిల్ సూచించేలా కొన్ని రిఫరెన్స్‌లు ఇచ్చారు. అలా ఆ టైటిల్ ఖరారైంది.
కథ నచ్చడంతో నాగార్జున కొంతమంది నిర్మాతలకు సలహా ఇచ్చారు, కానీ వారు ఆసక్తి చూపలేదు. దీంతో నాగార్జున స్వయంగా నిర్మాతగా మారి, అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై సినిమాను ప్రారంభించారు. నెల రోజుల్లో షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే, క్లైమాక్స్‌పై నాగ్ సందేహం వ్యక్తం చేసి, మొదట ప్లాన్ చేసిన శీను-పండు సూసైడ్ కామెడీ సీన్‌ను మార్చి, సీరియస్ ఎమోషనల్ క్లైమాక్స్‌గా మార్చారు.
హీరోయిన్ పాత్ర కోసం కృష్ణవంశీ 65 మంది అమ్మాయిలను ఆడిషన్ చేశారు. మొదట మీనాను ఎంచుకోవాలనుకున్నారు, కానీ ‘కూలీ నంబర్ 1’ చూసిన తర్వాత, టబు నాగార్జున పక్కన ఫ్రెష్ లుక్‌తో సరిపోతుందని భావించి ఆమెను ఎంపిక చేశారు.
ఈ సినిమాతో సందీప్ చౌతా సంగీత దర్శకుడిగా తొలిసారి పరిచయమయ్యారు. ‘నిన్నే పెళ్ళాడతా’ పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ‘యేటో వెళ్ళిపోయింది మనసు’, ‘నిన్నే పెళ్ళాడేస్తాను’ వంటి పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో నీలిచి ఉన్నాయి.
ఈ చిత్రంలో వైవిఎస్ చౌదరి, ఆయన భార్య గీత డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. షూటింగ్ సమయంలోనే వారి వివాహం జరిగింది.
మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో హీరోయిన్ టబును ఏడిపించే చిన్న పాత్రలో కనిపించారు.
1996 అక్టోబర్ 4న ‘నిన్నే పెళ్ళాడతా’ విడుదలైంది. మొదట్లో పెద్దగా హైప్ లేకపోయినా, సానుకూల మౌత్ టాక్‌తో సాయంత్రం షోల నుంచి థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. రోజువారీగా థియేటర్ల సంఖ్య పెరిగింది.
మొత్తం 39 కేంద్రాల్లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడి, ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించింది.
రూ. 2 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద రూ. 12.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి, అప్పటి ఇండస్ట్రీ హిట్ ‘పెదరాయుడు’ రికార్డును బద్దలు కొట్టి, కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఈ సినిమాకు నాగార్జునకు తెలుగు కేటగిరీలో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌కు నేషనల్ అవార్డు లభించడం విశేషం.


