Maha Shivaratri 2026:మహా శివరాత్రి 2026: గుడికి వెళ్లే సమయం లేదా? ఇంట్లోనే 10 నిమిషాల్లో ఇలా పూజ చేసుకోండి!
Maha Shivaratri 2026: హిందువులకు అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ మహా శివరాత్రి. మాఘ మాసంలో వచ్చే ఈ పర్వదినం కోసం శివయ్య భక్తులు ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. 2026 ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మహా శివరాత్రి రాబోతోంది. ఈ రోజున ఉపవాసం, జాగరణతో పాటు శివారాధన చేస్తే మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి.
అయితే, రద్దీ కారణంగా గుడికి వెళ్లలేకపోయినా, సమయం తక్కువగా ఉన్నా.. ఇంట్లోనే భక్తిశ్రద్ధలతో కేవలం 10 నిమిషాల్లో శివయ్యను ఎలా పూజించుకోవాలో, కావాల్సిన వస్తులేంటో ఇక్కడ చూడండి.
పూజకు సిద్ధం చేసుకోవాల్సిన పదార్థాలు (Pooja Samagri)
శివుడు అభిషేక ప్రియుడు. కాబట్టి ఈ కింది ద్రవ్యాలను సిద్ధం చేసుకోండి:
అభిషేకం కోసం: నీళ్లు, పాలు, పెరుగు, తేనె, లేత కొబ్బరి నీళ్లు, పంచామృతం, సువాసన నూనెలు.
అలంకరణకు: విభూతి (భస్మం), చందనం, పసుపు (హల్దీ).
పూజకు: బిల్వ పత్రాలు (మారేడు ఆకులు - గమనిక: 3 ఆకులు కలిగిన దళాన్నే వాడాలి, చినిగినవి వాడకూడదు), పూలు (తామర, గన్నేరు లేదా ఉమ్మెత్త పూలు శ్రేష్టం).
నైవేద్యం: అరటిపండ్లు, ఇతర పండ్లు లేదా ఇంట్లో చేసిన ప్రసాదం.
ఇతరాలు: దీపం, నెయ్యి, అగరబత్తులు.
సింపుల్ శివ పూజా విధానం (10 నిమిషాల ప్రక్రియ)
ఉదయాన్నే లేదా లింగోద్భవ కాలంలో స్నానం ఆచరించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి పూజకు ఉపక్రమించాలి.
1. దీపారాధన
ముందుగా దేవుడి గదిలో దీపాన్ని వెలిగించి ఈ శ్లోకం చదవండి:
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః మాంశ్చ దేహిమే సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కా
2. ఆచమనము (శుద్ధి)
చేతిలో నీళ్లు తీసుకుని ఈ నామాలను స్మరిస్తూ తీర్థం స్వీకరించండి లేదా శివలింగంపై నీళ్లు చల్లుతూ శుద్ధి చేయండి:
ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః... (మొదలైన విష్ణు నామాలు స్మరించుకోవాలి)
3. గణపతి ప్రార్థన
ఏ పూజకైనా తొలి పూజ గణపయ్యదే. విఘ్నాలు కలగకుండా ప్రార్థించండి:
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే
4. సంకల్పం
మీ మనసులోని కోరికను తలుచుకుని, మీ కుటుంబ క్షేమం కోసం ఇలా సంకల్పం చెప్పుకోండి:
"మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం.. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృధ్యర్ధం.. శివ పూజాం కరిష్యే"
5. శివ లింగాభిషేకం (ప్రధాన ఘట్టం)
"ఓం నమః శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ.. ముందుగా నీళ్లతో, తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేయండి. చివరగా శుద్ధ జలంతో కడిగి తుడవండి.
6. అలంకరణ & అర్చన
శివలింగానికి గంధం రాసి, విభూతిని దిద్దండి. అనంతరం మారేడు దళాలు (బిల్వ పత్రాలు), పూలతో శివుడిని అర్చించండి.
వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం
7. ధూపం & నైవేద్యం
అగరబత్తులు వెలిగించి ధూపం చూపించండి. అరటిపండ్లు లేదా నైవేద్యాన్ని సమర్పించండి.
నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు శివేప్సితం వరం దేహి పరత్ర చ పరాం గతిమ్
8. నీరాజనం (హారతి)
కర్పూర హారతి వెలిగించి శివయ్యకు చూపించండి.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం
9. క్షమాపణ ప్రార్థన (ముగింపు)
తెలిసీ తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే మన్నించమని కోరుకుంటూ పూజను ముగించండి.
మంత్ర క్రియాహీనం భక్తిహీనం సదాశివ యత్పూజితం మాయాదేవ పరిపూర్ణం తదస్తుతే
చివరగా: శివుడు ఆడంబరాలకు కాదు, ఆత్మీయతకు లొంగుతాడు. నిష్ఠగా "ఓం నమః శివాయ" అని స్మరిస్తూ చేసే చిన్న పూజ అయినా ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని మీకు తప్పక ఇస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.


