Kothimeera Pacchimirchi Pachadi :వేడి వేడి అన్నంలోకి 'కొత్తిమీర-పచ్చిమిర్చి పచ్చడి'.. కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి అమృతమే!
కూరల్లో కేవలం గార్నిష్ కోసం వాడే కొత్తిమీర.. పచ్చడిగా మారితే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! ఆంధ్రా స్టైల్‌లో చేసే రోటి పచ్చళ్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.
అందులోనూ 'కొత్తిమీర-పచ్చిమిర్చి చట్నీ' చేసుకుని, వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తింటే ఆ కిక్కే వేరు. ఇది అన్నంలోకే కాదు.. ఇడ్లీ, దోశ, రొట్టెల్లోకి కూడా అదిరిపోతుంది.
రుచితో పాటు కొత్తిమీరలో ఐరన్, విటమిన్ ఎ, సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, జీర్ణశక్తిని పెంచుతుంది. మరి ఇన్ని లాభాలున్న ఈ టేస్టీ పచ్చడిని ఈజీగా ఎలా చేయాలో చూద్దామా..
కావాల్సిన పదార్థాలు:
కొత్తిమీర - 2 కట్టలు, పచ్చిమిర్చి - 10, టమాటాలు - 2, ఉల్లిపాయ - 1 (పెద్ద ముక్కలు), చింతపండు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
వేయించుకోవడానికి: వేరుశనగ గుళ్లు, పచ్చి శనగపప్పు, ధనియాలు, నువ్వులు, మినపగుండ్లు, జీలకర్ర (అన్నీ తలా ఒక టేబుల్ స్పూన్), ఆవాలు - అర స్పూన్, మెంతులు - పావు స్పూన్.
తాలింపు కోసం: ఆవాలు, జీలకర్ర, మినపపప్పు, పచ్చి శనగపప్పు (అర స్పూన్ చొప్పున), కరివేపాకు - 1 రెమ్మ, ఎండుమిర్చి - 1, నూనె - 1 స్పూన్, ఇంగువ - చిటికెడు.
తయారీ విధానం (స్టెప్ బై స్టెప్):
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్‌లో నూనె వేడిచేయాలి. అందులో వేరుశనగలు, పచ్చిశనగ పప్పు, మినపగుండ్లు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, పచ్చిమిర్చి, నువ్వులు వేసి సన్నటి మంటపై రంగు మారే వరకు వేయించి పక్కన ప్లేట్‌లోకి తీసుకోవాలి.
అదే పాన్‌లో మరో స్పూన్ నూనె వేసి కట్ చేసిన టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసి మూతపెట్టి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత శుభ్రంగా కడిగిన కొత్తిమీరను కూడా అందులో వేసి బాగా దగ్గరపడే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి.
ముందుగా వేయించి పెట్టుకున్న పప్పు దినుసులు, మిర్చి మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన టమాటా-కొత్తిమీర మిశ్రమం, తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా (రోట్లో దంచినట్లుగా) గ్రైండ్ చేసుకోవాలి.
గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని, అందులో పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గరిటెతో లేదా చేత్తో కాస్త స్మాష్ చేస్తూ కలపాలి. (పచ్చడి తింటున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే భలే రుచిగా ఉంటుంది).
చివరగా ఒక చిన్న కడాయిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపపప్పు వేయించాలి. అవి చిటపటలాడాక ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి. ఈ తాలింపును నేరుగా పచ్చడిలో కలిపేసుకుంటే.. ఘుమఘుమలాడే కొత్తిమీర పచ్చడి రెడీ!

