తలస్నానం చేయగానే జుట్టు ఆరబెట్టుకోవడానికి వెంటనే హెయిర్ డ్రయ్యర్లు వాడుతున్నారా? అయితే మీకు జుట్టు రాలడం, చుండ్రు లాంటి సమస్యలు తప్పవు. కానీ, ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్, హీట్ స్టైలింగ్ టూల్స్ లేని ఆ కాలంలో.. మన అమ్మమ్మలు, నానమ్మల జుట్టు ఎంతో నల్లగా, ఒత్తుగా ఉండేది.
దానికి కారణం.. తలస్నానం తర్వాత జుట్టుకు 'సాంబ్రాణి ధూపం' (Sambrani Dhoop) వేసుకోవడమే! ఇది కేవలం జుట్టును ఆరబెట్టడానికి మాత్రమే కాదు, దీని వెనుక గొప్ప సైన్స్, ఆయుర్వేదం దాగి ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
చుండ్రు, హెయిర్ ఫాల్‌కు చెక్:
సాంబ్రాణి ధూపంలో మనం వేప, తులసి, గుగ్గిలం లాంటి మూలికలు వాడతాం. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మాడుకు పుష్కలంగా అందుతాయి. ఈ సుగంధ భరితమైన పొగ తగలగానే తలలోని మురికి, బ్యాక్టీరియా నశించిపోయి చుండ్రు మాయం అవుతుంది.
అంతేకాదు, ఆ పొగలోని మృదువైన వేడి వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడి, హెయిర్ ఫాల్ తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇది ఒక నేచురల్ కండిషనర్‌లా పనిచేస్తుంది.
ఆయుర్వేదం ఏం చెబుతోంది?
తలస్నానం చేసిన వెంటనే సాంబ్రాణి వేసుకోవడం వల్ల శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలు బ్యాలెన్స్ అవుతాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా వాత దోషం వల్లే వచ్చే ఒత్తిడి, ఆందోళనలను ఈ ధూపం కంట్రోల్ చేస్తుంది. నరాలను ప్రశాంతపరిచి, నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది.
సరైన పద్ధతిలో ఎలా వేసుకోవాలి?
ముందుగా సహజమైన సాంబ్రాణి లేదా లోబాన్ కప్స్ (Loban cups) వెలిగించి స్టాండ్‌లో ఉంచాలి. ఈ ప్రక్రియను బాల్కనీ లేదా ఓపెన్ గార్డెన్ లాంటి గాలి బాగా ఆడే ప్రదేశంలోనే చేయాలి.
తడి జుట్టుతో, పొగ వస్తున్న స్టాండ్‌కు కనీసం 15 నుంచి 25 సెంటీమీటర్ల దూరంలో ఉండి ఆరబెట్టుకోవాలి.
పొగ జుట్టుకు బాగా పట్టిన తర్వాత, కుదుళ్ల నుంచి చివర్ల వరకు దువ్వెనతో దువ్వుకోవాలి. ఇలా చేస్తే సహజ నూనెలు జుట్టు అంతటా వ్యాపించి మరింత మృదువుగా మారుతుంది.
గమనిక: అతిగా వాడితే అనర్థమే! సాంబ్రాణి జుట్టుకు ఎంతో మంచిదే అయినా.. దీన్ని రోజూ వాడకూడదు. ఎందుకంటే పొగను మరీ ఎక్కువగా పీల్చడం ఊపిరితిత్తులకు మంచిది కాదు. అందుకే మన పూర్వీకులు దీన్ని వారానికి ఒకసారి లేదా నెలకు రెండుసార్లు మాత్రమే వేసుకునేవారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

