Pista Benefits: రోజుకు ఎన్ని పిస్తా పప్పులు తినాలో తెలుసా? లిమిట్ దాటితే డేంజరే..డ్రై ఫ్రూట్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి బాదం, జీడిపప్పు. కానీ, వాటికి ఏమాత్రం తీసిపోని పోషకాల నిధి 'పిస్తా'.
అద్భుతమైన రుచితో పాటు ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులకు ఇది కేరాఫ్ అడ్రస్. అయితే, అమృతం లాంటి పిస్తా కూడా అతిగా తింటే అనర్థాలు తప్పవని మీకు తెలుసా? అసలు రోజుకు ఎన్ని తినాలి? ఎవరు వీటికి దూరంగా ఉండాలి? పూర్తి వివరాలు చూద్దాం..
పిస్తా.. ఓ పోషకాల గని!
పిస్తా పప్పులలో విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కేవలం ఒక గుప్పెడు పిస్తా పప్పుల ద్వారా మన శరీరానికి దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. రోజువారీ స్నాక్స్‌కు బదులుగా పిస్తాను డైట్‌లో చేర్చుకుంటే శరీరంలో అద్భుతమైన సానుకూల మార్పులు వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆరోగ్యానికి ఏయే విధాలుగా మేలు చేస్తుందంటే..
మెదడుకు, గుండెకు రక్షణ కవచం: ఇతర నట్స్‌తో పోలిస్తే పిస్తాలో 'విటమిన్ బి6' అత్యధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ఇవి రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.
కంటి వెలుగు.. గాఢ నిద్ర: పిస్తా పప్పులలో ఉండే 'మెలటోనిన్' నిద్ర నాణ్యతను అద్భుతంగా పెంచుతుంది. ఇందులోని విటమిన్ బి6 నిద్రకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. అలాగే వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడి, కళ్లు ప్రకాశవంతంగా మారుతాయి.
వీరు పిస్తాకు దూరంగా ఉండటమే మేలు!
పిస్తా పప్పులు అందరికీ మేలు చేయవు. ఈ కింది సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది:
నట్స్ అలర్జీ ఉన్నవారు పొరపాటున కూడా వీటిని ముట్టకూడదు.
మూత్రపిండాల్లో రాళ్లు (Kidney Stones) ఉన్న రోగులు పిస్తాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారికి ఇవి త్వరగా జీర్ణం కావు.
పిస్తా పప్పులు శరీరంలో వేడిని (ఉష్ణోగ్రతను) పెంచుతాయి. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని చాలా పరిమితంగానే తీసుకోవాలి.
రోజుకు అసలు ఎన్ని తినాలి?
ఆరోగ్యకరమైన వయోజనులు రోజుకు సుమారు 49 పిస్తా పప్పులు (దాదాపు ఒక ఔన్సు) వరకు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు. అయితే మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా పెరగాలనుకుంటున్నారా అనే దానిపై ఈ సంఖ్య ఆధారపడి ఉంటుంది.
గమనిక: పరిమితి దాటి అతిగా తింటే మాత్రం బరువు పెరగడం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తప్పవు. కాబట్టి, మితంగా తిని ఆరోగ్యంగా ఉందాం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

