Potato Curry:బంగాళదుంపల (Potato) కూర అంటే ఇష్టపడని వారు బహుశా ఉండరు! చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా వేడి వేడి పూరీ లేదా చపాతీలోకి కమ్మని ఆలూ కర్రీ పడితే ఆ మజాయే వేరు.
అయితే ప్రతిసారీ ఒకేలా కాకుండా, అచ్చం బయట రెస్టారెంట్లు, ధాబాల్లో దొరికే రుచితో 'ధాబా స్టైల్ ఆలూ కర్రీ'ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీ దోసెల్లోకి కూడా అదిరిపోతుంది!
ఉడికించిన బంగాళదుంపలు: 3
నూనె: 4 టేబుల్ స్పూన్లు
కచ్చాపచ్చాగా దంచిన ధనియాలు: 1 టీస్పూన్
వాము: పావు టీస్పూన్
జీలకర్ర: 1 టీస్పూన్
సోంపు: 1 టీస్పూన్
ఇంగువ: 2 చిటికెలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు: 1 కప్పు
సన్నగా తరిగిన టమాటాలు: 1 కప్పు
పచ్చిమిర్చి ముక్కలు: 1 టేబుల్ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: 1/2 టీస్పూన్
కారం: 1.25 టీస్పూన్
ఆమ్చూర్ పౌడర్: 1/2 టీస్పూన్ (పులుపు కోసం)
పసుపు: 1/4 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్లు: 400 ml
కొత్తిమీర: కొద్దిగా
కసూరి మేతి: 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి.
నూనె వేడెక్కాక అందులో జీలకర్ర, దంచిన ధనియాలు, సోంపు, వాము, ఇంగువ వేసి కమ్మని వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి.
ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి.
ఆ తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసి.. టమాటాలు గుజ్జులా, మెత్తగా అయ్యే వరకు మగ్గనివ్వాలి.
ఇప్పుడు గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి మసాలాలన్నీ నూనెలో కలిసేలా ఒక నిమిషం పాటు బాగా వేయించాలి.
మసాలాలు వేగిన తర్వాత, ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను చేత్తో కొద్దిగా మెదిపి (మరీ పేస్ట్ లా కాకుండా ముక్కలు తగిలేలా) పాన్ లో వేసి కలపాలి.
దీనిలో 400 ml నీళ్లు పోసి బాగా కలిపి, మూతపెట్టి రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి.
చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, చేత్తో నలిపిన కసూరి మేతి చల్లుకుని.. నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అంతే! గుమగుమలాడే 'ధాబా స్టైల్ ఆలూ కర్రీ' రెడీ. ఈ వీకెండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వేడి వేడి పూరీలతో ఈ కర్రీని ట్రై చేసి చూడండి, మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు!

