Sweet Corn Paratha:ఎప్పుడూ ఒకేలాంటి ఇడ్లీ, దోశ, పూరీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి కాస్త వెరైటీగా, ఎంతో రుచిగా ఉండే 'స్వీట్ కార్న్ పరోటా' (Sweet Corn Paratha) ట్రై చేయండి.
మైదాతో కాకుండా ఆరోగ్యానికి మేలు చేసే గోధుమ పిండితో దీన్ని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్ కైనా, ఉదయం వేడి వేడి బ్రేక్ ఫాస్ట్ కైనా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్!
మరి ఈ కమ్మని పరోటాను ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.
పిండి కోసం:
గోధుమ పిండి: 2 కప్పులు
నూనె: 2 టీస్పూన్లు (పిండిలో కలపడానికి)
ఉప్పు: తగినంత
నీళ్లు: పిండి కలపడానికి సరిపడా
నెయ్యి లేదా నూనె: పరోటాలు కాల్చడానికి
స్టఫింగ్ కోసం:
స్వీట్ కార్న్ (మొక్కజొన్న గింజలు): 1 కప్పు
పచ్చిమిర్చి: 3
కొత్తిమీర తరుగు: కొద్దిగా
వాము: 1/4 టీస్పూన్
ఆల్లం: అర అంగుళం ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 3
ఉల్లిపాయ ముక్కలు: 2 టీస్పూన్లు
నూనె: 2 టీస్పూన్లు (వేయించడానికి)
జీలకర్ర: 1/2 టీస్పూన్
ఇంగువ: చిటికెడు
నిమ్మరసం: 1 టీస్పూన్
ముందుగా ఒక గిన్నెలో గోధుమ పిండి, కొద్దిగా నూనె, ఉప్పు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. దీన్ని సమానంగా బాల్స్ లా చేసి, పైన తడి క్లాత్ కప్పి కనీసం 30 నిమిషాల పాటు నాననివ్వాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. అందులో స్వీట్ కార్న్ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, వాము వేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేడి చేయండి. అందులో జీలకర్ర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు దోరగా వేయించాలి.
ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ వేసి బాగా కలపాలి. అందులోని తడి అంతా పోయి ముద్దలా అయ్యే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక కొద్దిగా నిమ్మరసం కలుపుకోండి.
నానబెట్టుకున్న గోధుమ పిండి ముద్దను తీసుకుని కొద్దిగా పల్చగా ఒత్తుకోవాలి. మధ్యలో స్వీట్ కార్న్ స్టఫింగ్ పెట్టి అంచులు పూర్తిగా మూసేయాలి.
ఇప్పుడు పొడి గోధుమ పిండి చల్లుకుంటూ అప్పడాల కర్రతో నెమ్మదిగా అన్ని వైపులా సమానంగా ఒత్తుకోవాలి. ఇలా చేస్తే లోపలి స్టఫింగ్ బయటకు రాకుండా, పరోటాలు పగలకుండా వస్తాయి.
స్టవ్ మీద పెనం బాగా వేడెక్కిన తర్వాత పరోటా వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కాలుతున్నప్పుడు పైన కొద్దిగా నూనె లేదా నెయ్యి రాస్తే పరోటా మరింత రుచిగా, సాఫ్ట్ గా వస్తుంది.
అంతే.. వేడి వేడి స్వీట్ కార్న్ పరోటా రెడీ! దీన్ని పెరుగు రైతాతో గానీ, మీకు నచ్చిన ఏదైనా చట్నీతో గానీ సర్వ్ చేస్తే ఇంట్లో వాళ్లంతా ఎంతో ఇష్టంగా తింటారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

