ఉపవాస రోజులైనా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా 'సగ్గుబియ్యం ఉప్మా' చాలా మంచి ఛాయిస్. ఇది తింటే లైట్‌గా ఉండటమే కాకుండా రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంచుతుంది.
చాలామందికి సగ్గుబియ్యం ఉప్మా చేసేటప్పుడు ముద్దగా అయిపోతుంటుంది. అలా కాకుండా, రెస్టారెంట్ స్టైల్‌లో పొడిపొడిగా, ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో చూద్దాం.
కావలసిన పదార్థాలు:
సగ్గుబియ్యం: 1 కప్పు
వేరుశనగ పప్పు (పల్లీలు): అర కప్పు
నూనె లేదా నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 1 స్పూన్
ఆవాలు: అర స్పూన్
పచ్చిమిర్చి: 3 (సన్నగా కట్ చేసినవి)
బంగాళదుంప: 1 చిన్నది (చిన్న ముక్కలుగా కట్ చేసింది)
కరివేపాకు: ఒక రెమ్మ
నిమ్మరసం: 1 స్పూన్
కొత్తిమీర: కొద్దిగా
ఉప్పు: రుచికి సరిపడా
స్టెప్ 1: సగ్గుబియ్యం నానబెట్టడం ముందుగా సగ్గుబియ్యాన్ని రెండు సార్లు శుభ్రంగా కడిగి.. అవి మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసి (ఎక్కువ నీళ్లు పోయకూడదు) కనీసం 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి.
ఇలా చేయడం వల్ల సగ్గుబియ్యం లోపలి వరకు సాఫ్ట్‌గా అవుతాయి. ఉప్మా చేసే ముందు నీళ్లు ఏమైనా ఉంటే పూర్తిగా వడకట్టేయాలి.
స్టెప్ 2: పల్లీల పొడి సిద్ధం చేయడం స్టవ్ మీద పాన్ పెట్టి పల్లీలను నూనె లేకుండా దోరగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత పొట్టు తీసి, మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా (బరకగా) గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3: పోపు వేయడం ఇప్పుడు పాన్‌లో రెండు చెంచాల నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి, మూత పెట్టి బంగాళదుంప ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
స్టెప్ 4: ఉప్మా మిక్సింగ్ బంగాళదుంప ముక్కలు ఉడికిన తర్వాత.. మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పాన్ లో వేయాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల పొడిని కూడా వేసి అంతా బాగా కలిసేలా నిదానంగా కలుపుకోవాలి.
స్టెప్ 5: మగ్గించడం మంటను పూర్తిగా సిమ్‌లో ఉంచి, మూత పెట్టి 3 నుండి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. సగ్గుబియ్యం తెల్లగా కాకుండా కాస్త ట్రాన్స్‌పరెంట్ (గాజులా) మారే వరకు ఉంచాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసి, పైనుంచి నిమ్మరసం, కొత్తిమీర చల్లుకుని కలుపుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఉప్మా రెడీ!
ముఖ్యమైన టిప్: సగ్గుబియ్యం ఉప్మా పొడిపొడిగా రావాలంటే వాటిని నానబెట్టేటప్పుడు నీళ్లు ఎక్కువ అవ్వకూడదు. సగ్గుబియ్యం మునిగే లెవెల్ వరకు నీళ్లు పోస్తే సరిపోతుంది. అలాగే ఉప్మా చేసేటప్పుడు ఎక్కువ సేపు గరిటెతో తిప్పకూడదు, అలా చేస్తే ముద్దగా అయిపోయే అవకాశం ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

