ఆహారం, నీరు, ఆక్సిజన్ మన శరీరానికి ఎంత ముఖ్యమో... నిద్ర కూడా అంతే అవసరం. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి కారణంగా చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ, రోజంతా యాక్టివ్‌గా ఉండాలన్నా, మానసిక ప్రశాంతత కలగాలన్నా సరైన నిద్ర తప్పనిసరి.
నిద్ర సమయంలోనే మన శరీరం దెబ్బతిన్న కణజాలాలను మరమ్మత్తు చేసుకుంటుంది, కొత్త కణాలు వృద్ధి చెందుతాయి, శరీర ఎదుగుదల బాగుంటుంది. అంతేకాదు, జీవక్రియలు క్రమబద్ధీకరించబడటానికి, శరీరానికి అవసరమైన శక్తి లభించడానికి నిద్ర చాలా అవసరం.
ఒకవేళ నిద్ర సరిపోకపోతే? ఊబకాయం, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది.
అయితే, అందరికీ ఒకే రకమైన నిద్ర అవసరం లేదు. వయసును బట్టి నిద్రపోయే సమయం మారుతుంటుంది. మరి మీ వయసు ప్రకారం మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలో ఇక్కడ చూసి తెలుసుకోండి!
చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ నిర్దేశిత నిద్ర సమయాలు ఉన్నాయి. నిపుణుల ప్రకారం ఆ వివరాలు ఇలా ఉన్నాయి:
పుట్టిన చిన్నారి నుంచి 3 నెలల వయసు వరకు: అప్పుడే పుట్టిన శిశువులకు ఎక్కువ నిద్ర అవసరం. వీరు రోజుకు 14 నుండి 17 గంటలు నిద్రపోవాలి.
4 నెలల నుంచి 11 నెలల పిల్లలు: ఈ వయసు వారు రోజుకు 12 నుండి 15 గంటలు నిద్రపోవడం మంచిది.
1 సంవత్సరం నుండి 2 ఏళ్ల లోపు పిల్లలు: వీరికి రోజుకు 11 నుండి 14 గంటల నిద్ర అవసరం.
3 నుండి 5 సంవత్సరాల పిల్లలు: ఈ వయసు పిల్లలకు రోజుకు 10 నుండి 13 గంటల నిద్ర కావాలి.
6 నుండి 13 ఏళ్ల వయసు పిల్లలు: స్కూలుకు వెళ్లే ఈ పిల్లల ఆరోగ్యానికి రోజుకు 9 నుండి 11 గంటల నిద్ర చాలా మంచిది.
18 నుండి 25 ఏళ్ల వయసు వారు: యువతీ యువకులు రోజుకు 7 నుండి 9 గంటల నిద్ర పోతే సరిపోతుంది.
26 నుండి 64 ఏళ్ల వయసు ఉన్నవారు: ఉద్యోగ, కుటుంబ బాధ్యతల్లో ఉండే ఈ వయసు వారు కూడా రోజుకు 7 నుండి 9 గంటలు నిద్రపోవడం అవసరం.
65 ఏళ్లు పైబడిన వృద్ధులు: వయసు పైబడిన వారు రోజుకి 7 నుండి 8 గంటల నిద్ర పోతే ఆరోగ్యంగా ఉంటారు.
ముఖ్య గమనిక: నిద్ర అనేది కేవలం సమయం (Hours) మాత్రమే కాదు, అది నాణ్యమైన నిద్ర (Quality Sleep) అయి ఉండాలి. రాత్రిపూట ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
కాబట్టి, ఇకపై ఆలస్యం చేయకుండా మీ వయసుకు తగ్గట్టుగా నిద్రపోతూ... మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు 'telugulifestyle' బాధ్యత వహించదని గమనించగలరు.

