ఉడకబెట్టిన గుడ్డుతో టేస్టీ ఎగ్ మసాలా కర్రీ.. అన్నంలోకి అద్భుతమైన కాంబినేషన్!

Egg Masala Curry
మొన్న రాత్రి వంట చేద్దామని ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే అందులో కూరగాయలు ఏమీ లేవు. కేవలం కొన్ని గుడ్లు మాత్రమే ఉన్నాయి. రోజూ చేసుకునే ఆమ్లెట్, గుడ్డు పోరుటు తిని బాగా బోర్ కొట్టేసింది కదా అని.. కొంచెం కొత్తగా, స్పైసీగా ఏమైనా చేద్దామనిపించింది. వెంటనే గుడ్లు ఉడకబెట్టి, దాబా స్టైల్ లో ఒక అదిరిపోయే 'ఎగ్ మసాలా కర్రీ' (Egg Masala Curry) చేశాను.

నిజం చెప్తున్నాను.. నేను చేసిన ఆ కూర చూసి మా ఇంట్లో వాళ్ళు ఆశ్చర్యపోయారు. వేడి వేడి అన్నంలో ఈ మసాలా గ్రేవీ కలుపుకుని తింటుంటే.. ఆ రుచే వేరబ్బా అనిపించింది. కేవలం అన్నంలోకే కాదు చపాతీ, రోటీల్లోకి కూడా ఇది సూపర్ కాంబినేషన్. నేను చేసిన ఈ సింపుల్ అండ్ స్పైసీ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో మీతో కూడా పంచుకుంటున్నాను. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి!

దీనికోసం నేను వాడిన పదార్థాలు ఇవే:
ఉడకబెట్టిన గుడ్లు - 4
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు - 2 (మిక్సీ పట్టి ప్యూరీ చేసుకోవాలి)
పచ్చిమిర్చి - 2 (నిలువుగా చీల్చినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
కారం - 1 1/2 స్పూన్
పసుపు - పావు స్పూన్
ధనియాల పొడి - 1 స్పూన్
జీలకర్ర పొడి - అర స్పూన్
గరం మసాలా - అర స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా (గార్నిష్ కోసం)
నా స్టైల్ తయారీ విధానం:
ముందుగా ఉడకబెట్టిన గుడ్లకు పొట్టు తీసి, చాకుతో చిన్న గాట్లు పెట్టుకున్నాను (ఇలా చేస్తే మసాలా గుడ్డు లోపలికి బాగా వెళుతుంది). ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, కొద్దిగా నూనె వేసి అందులో చిటికెడు పసుపు, కొంచెం కారం వేసి ఈ గుడ్లను దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాను.

ఇప్పుడు అదే పాన్‌లో మరో రెండు స్పూన్ల నూనె వేసి.. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాను.

ఉల్లిపాయలు వేగాక, అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా ఫ్రై చేశాను.

ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. టమాటా పచ్చివాసన పోతేనే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది.

ఇప్పుడు మంట సిమ్ లో పెట్టి.. ఇందులో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను.

మసాలాలు మాడిపోకుండా ఉండటానికి అర గ్లాసు నీళ్లు పోసి గ్రేవీని ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చాను.

గ్రేవీ కాస్త చిక్కబడుతున్న సమయంలో.. మనం ముందుగా వేయించి పెట్టుకున్న గుడ్లను అందులో వేసి, మూత పెట్టి సిమ్ లో మరో 5 నిమిషాలు ఉడికించాను. ఇలా చేయడం వల్ల గ్రేవీలోని మసాలాలన్నీ గుడ్డుకు బాగా పడతాయి.

చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆపేసుకుంటే చాలు.. గుమగుమలాడే 'ఎగ్ మసాలా కర్రీ' రెడీ!

చూశారుగా ఎంత సింపుల్ గా అయిపోయిందో! ఇంటికొచ్చిన చుట్టాలకు మటన్, చికెన్ బదులు ఇలా వెరైటీగా ఎగ్ మసాలా కర్రీ చేసి పెట్టండి.. రెసిపీ అడిగి మరీ తెలుసుకుంటారు. 

మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top