ఆయుర్వేదంలో నడుమునొప్పికి చక్కని పరిష్కారం

ఇటీవలి కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరిలో కనిపిస్తున్న సమస్య నడుము నొప్పి. ఈ సమస్యకు చాలా మంది ఏవో తెలిసిన నొప్పి నివారణ మాత్రలు వేసేసుకుని కాలం వెళ్లదీస్తుంటారు. నిజానికి ఈ మాత్రల వల్ల లభించేది తాత్కాలిక ఉపశమనమే. కానీ సరియైన చికిత్స తీసుకోకపోవడం వల్ల సమస్య మరింత జటిలంగా మారుతుంది. ఈ సమస్యకు సర్జరీ తప్ప మరో పరిష్కారమే లేదని భావిస్తుంటారు. కానీ ఆయుర్వేదంలో నడుమునొప్పికి చక్కని పరిష్కారం ఉంది. 

మన శరీరం బరువును మోసే ఒక కీలక అవయవం నడుము. నడుము దగ్గర ప్రధానంగా 5 కశేరుకాలు ఉంటాయి. ఇవి ఒకదాని మీద ఒకటిగా, డిస్కుల సహాయంతో అమరి ఉంటాయి. కశేరుకాల మధ్యగా, మెదడు నుంచి వచ్చే నరాల తంతి (స్పైనల్ కార్డ్) ప్రయాణిస్తూ, శరీరంలోని వివిధ భాగాలకు నాడీ తంతువులను పంపుతూ ఉంటుంది. ఈ అమరికలో మృదులాస్థి (డిస్కు) భూమిక చాలా కీలకమైనది. ఇది శరీర కదలికలను సులభ తరం చేయడమే కాకుండా, కదలికల్లో వెన్నుపాముమీద ఒత్తిడి పడకుండా కూడా కాపాడుతుంది. మృదులాస్థి లోపల చిక్కని ద్రవం ఉంటూ దానిని ఆవరించి ఒక మృదువైన అస్థి నిర్మితమై ఉంటుంది.
ఇవీ కారణాలు
ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, ఎక్కువ బరువులు మోయడం, స్థూలకాయం, వాహనాలు ఎక్కువగా నడపడం, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు, కొన్ని వంశానుగత కారణాల వంటివి నడుము నొప్పికి కారణమవుతూ ఉంటాయి. ఇవే కాకుండా దెబ్బలు తగలడం లేదా రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం జరిగినపుడు కూడా నడుము నొప్పి రావచ్చు. నడుము చుట్టూ ఉండే మాంస పేశీల మీద ఒత్తిడి పడటం, లేదా నడుముకు కవచంలా ఉండే కండరాలు బెణకడం వల్ల కూడా నడుము నొప్పి రావచ్చు. కొంత మందికి రెండు వారాలు దాటినా నొప్పి తగ్గదు పైగా, ఏ కాస్త పనిచేసినా నొప్పి పెరుగుతూ అది తొండకండరాల నుంచి పాదం దాకా పాకుతుంది. ఈ నొప్పికి మృదులాస్థి దెబ్బతినడమే కారణంగా అర్థం చేసుకోవచ్చు.


లక్షణాలు
- దీర్ఘకాలం పాటు నడుము నొప్పి ఉండటం.

- కాసేపు పనిచేయగానేనొప్పి తీవ్రం కావడం.

- నడుం నొప్పి కొన్నిసార్లు నడుము నుంచి పిరుదులు, తొడకండరాల మీదుగా అరికాలుకు పాకడం.

- సూదులు గుచ్చినట్లుగా నొప్పి.

- కొన్నిసార్లు నొప్పితో మంట, తిమ్మిర్లు, స్పర్శ కోల్పోవడం.

- ఉదయాన లేవగానే నడుం నొప్పి తీవ్రంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నివారణా మార్గాలు
వెన్ను నొప్పి అనిపించగానే కొందరు ఏవో మాత్రలు వేసుకుంటారు. వీటి వల్ల తాత్కాలికంగా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందే తప్ప నొప్పి పూర్తిగా పోదు. ఈ మాత్రల వల్ల ఆ భాగం మొద్దుబారిపోయి నొప్పి తెలియకుండా పోతుంది. కానీ, రోగి ఆ నొప్పి పూర్తిగా పోయిందని తమ రోజు వారి విధుల్ని యథావిథిగా కొనసాగిస్తారు. నడుము నొప్పి ఉపశమనం కోసం కొందరు లుంబార్ బెల్ట్ వాడటం,ఫిజియోథెరపీకి వెళ్లడం చేస్తారు. కాకపోతే ఈ విధానాలను దీర్ఘకాలికంగా అనుసరించినప్పుడు మాత్రమే ప్రయోజనం ఉంటుంది. నిజానికి సమస్య అంతగా విషమించక ముందే ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే, వెన్ను నొప్పి శస్త్రచికిత్స అవసరం లేకుండానే తొలగిపోయే అవకాశం ఉంది.

ఆయుర్వేద చికిత్స

నడుము నొప్పి నివారణకు ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉంటాయి. ఈ విధానంతో మృదులాస్థిలో ఏర్పడిన వాపును తగ్గించి, వెన్ను భాగాన్ని తిరిగి శక్తివంతం చేసే అవకాశాలు ఉన్నాయి.

స్నేహకర్మ: ఈ చికిత్సా విధానంతో వెన్నెముకలో ఉండే కశేరుకాల మధ్య స్థిరత్వం పెరిగి, వాటి కదలికలు సులువవుతాయి.

స్వేదకర్మ: ఈ విధానంతో గట్టిపడి, అతుక్కుపోయిన కీళ్లు మృదువుగా మారి, అనుకున్న వైపు వంగే వెసులుబాటు ఏర్పడుతుంది.


కటివస్తి: నడుము నొప్పి చికిత్సలో కటివస్తి ఎంతో కీలకమైనది. అరిగిపోయిన మృదులాస్థికి అవసరమైన రక్తసరఫరాను అందించి నొప్పి తగ్గించడానికి ఇది తోడ్పడుతుంది.

సర్వాంగ ధార: ఈ విధానంలో నరాల మీద ఒత్తిడి కారణంగా దెబ్బ తిన్న భాగాన్ని చక్కబరిచి నొప్పి తగ్గించడం సాధ్యమవుతుంది.

వస్తికర్మ: ఇది వాతాన్ని సమతుల్యం చేసే ప్రక్రియ. అలా వాతం ఆ స్థితికి రాగానే నడుములోని దెబ్బ తిన్న భాగం చక్కబడుతుంది.

ఆయుర్వేదంలో మౌలికంగా నొప్పి రావడం వెనుకున్న మూల కారణాలను గుర్తించి చికిత్స చేయడం ఉంటుంది. అందుకే పలు దశల్లో ఉన్న నడుము నొప్పిని సమర్ధవంతంగా తగ్గించే అవకాశం ఉంది. చికిత్స తరువాత యోగాసనాల ద్వారా నడుము తిరిగి శక్తివంతంగా మారుతుంది.


ఈ మందులు అవగాహన కోసమే, డాక్టర్ సలహా తో నే వాడాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top