‘జాలి’వుడ్‌గా మారిన ‘బాలీవుడ్’

‘‘ఇలా అయితే మేం నెత్తిన చెంగేసుకోవాల్సిందే. బడా డెరైక్టర్లే మా బతుకులను నడివీధికి తీసుకొస్తుంటే.. ఇక మా బాధ ఎవరికి చెప్పుకోవాలి..’’ అని బాలీవుడ్ పంపిణీదారులు వాపోతున్నారు. ఈ ఏడాది అత్యంత క్రేజ్ మధ్య విడుదలైన ‘పెద్ద’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం చాలామందిని షాక్‌కు గురి చేసింది. ఈ సినిమాల వల్ల ఎక్కువగా నష్టపోయింది పంపిణీదారులే. దాంతో వారు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మణిరత్నం, సంజయ్‌లీలా భన్సాలీ, విపుల్ షా, ప్రియదర్శన్, కునాల్ కోహ్లి, అనీజ్ బజ్మీ, అనురాగ్ బసు లాంటి దర్శకులు ఫ్లాప్ సినిమాలు ఇవ్వడం ట్రేడ్ వర్గాలను షేక్ చేసింది. పైగా అవన్నీ సూపర్‌స్టార్లు నటించిన భారీ బడ్జెట్ చిత్రాలు కావడం విశేషం.


అభిషేక్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్యరాయ్, ప్రియమణి.. ఇలా మల్టీస్టారర్‌తో... ప్రముఖ దర్శకుడు మణిరత్నం దాదాపు 100 కోట్లతో ‘రావణ్’ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు, తమిళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేశారు. కానీ ఈ చిత్రం బాలీవుడ్‌లో వసూలు చేసింది కేవలం 29.50 కోట్ల రూపాయల గ్రాస్ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రకంగా ‘రావణ్’ రూపంలో భారీ షాక్ అందుకుంది ట్రేడ్. ఆ గాయం నుంచి తేరుకునేలోపే... ‘గుజారిష్’ రూపంలో మరో బలమైన దెబ్బ తగిలింది బాలీవుడ్‌కి. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ జంటగా ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి అయిన బడ్జెట్ 67 కోట్లు అని వినికిడి. కానీ వసూలు చేసింది మాత్రం 21 కోట్లు.

అలాగే అనురాగ్ బసు దర్శకత్వంలో హృతిక్ నటించిన ‘కైట్స్’ కూడా పరాజయాన్ని చవి చూసింది. అనిల్‌కపూర్, సంజయ్‌దత్, అక్షయ్‌ఖన్నా, సునీల్‌శెట్టి.. ఇలా భారీ తారాగణంతో అనీజ్ బజ్మి దర్శకత్వంలో దాదాపు 35 కోట్ల రూపాయలతో రూపొందిన ‘నో ప్రాబ్లమ్’ 27 కోట్లు మాత్రమే వసూలు చేసి పంపిణీదారుల జేబులకు చిల్లుపెట్టింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నటించిన ‘ఆక్రోష్’ది కూడా ఇదే తంతు. ఈ వరుస పరాజయాల కారణంగా బాలీవుడ్ పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు తయారైంది.
  
అక్షయ్‌కుమార్, ఐశ్వర్యరాయ్ జంటగా 2010లో విడుదలైన మరో క్రేజీ చిత్రం ‘యాక్షన్ రీప్లే’. విపుల్ షా దర్శకత్వంలో దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వసూలు చేసింది 22 కోట్ల 50 లక్షలట. అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, దీపికా పదుకొనే జంటగా రూపొందిన పీరియాడిక్ ఫిల్మ్ ‘ఖేలే హమ్ జీ జాన్ సే’. ఈ సినిమాకైన ఖర్చు 35 కోట్లు. కానీ కలెక్షన్స్ మాత్రం నామమాత్రంగానే విదిలించాయి.

ఇంకా బాలీవుడ్‌ని నష్టాల్లో ముంచిన చిత్రాలు చాలానే ఉన్నాయి. కానీ ఇక్కడ పేర్కొన్న ఏడు సినిమాలూ క్రేజీ ప్రాజెక్టులు కావడంతో ప్రముఖంగా వాటిని పేర్కొనడం జరిగింది. ఈ చిత్ర పరాజయాలకు ఓ కారణం ‘భారీ బడ్జెట్’ అని పరిశీలకులు అంటున్నారు. మన టాలీవుడ్ పరిస్థితి కంటే... బాలీవుడ్ పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తీస్‌మార్ ఖాన్’ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఆ సినిమాకు వినిపిస్తున్న టాక్ వింటుంటే... అది హిట్టో ఫట్టో అర్థం కావడం లేదు. పైన పేర్కొన్న సినిమాల సరసన కనీసం ఆ సినిమా అయినా చేరకుండా ఉండాలని ఆశిద్దాం...!

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top