మోకాళ్లనొప్పులు రావడానికి గల కారణాలు

 మోకాళ్లనొప్పులు రావడానికి గల కారణాలను విశ్లేషిద్దాం. చాలాకాలం ఉపయోగించిన యంత్రాలకు అరుగు, తరుగులు ఎలా వుంటాయో, ఎక్కువకాలం పాటు పని చేసిన మోకాళ్లకు అదేవిధంగా అరుగు తరుగులు ఉంటాయి. అంటే సాధారణంగా ఇది వృద్ధాప్యంలో వచ్చే సమస్య. ఇక గాయాలవల్ల, అధిక బరువు, ఎముకలలో అసమతుల్యత వల్ల వచ్చే మోకాళ్లనొప్పులు... మరో రకం అన్నమాట.

ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే శరీరం తన రోగనిరోధక శక్తిని తానే ధ్వంసం చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇంకోరకం. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇందుకు ఉదాహరణ. తరచు ఆర్థోస్కోపీ చేయించవలసి రావడం వల్ల అంటే ఆపరేషన్లు చేయించుకోవలసి రావడం వల్ల కూడా కీళ్లనొప్పులు రావచ్చు.


కీళ్లనొప్పులు పుట్టుకతోనే వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అంటారు. ఎముకలలో కణుతులు, ఎముకల వ్యాధుల వల్ల కూడా మోకాళ్లనొప్పులు రావచ్చు. ఇటీవల పరిశోధనల్లో వెలుగు చూసిన విషయం ఏమిటంటే 25 ఏళ్లు పైబడిన యువతీయువకులు కూడా మోకాళ్లనొప్పుల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలా నొప్పులు మొదలైన ఐదారేళ్లలోనే వారి మోకాలి జాయింట్లను ఎక్స్‌రే తీయిస్తే మనం స్పష్టంగా చూడగలిగేంత తేడాను గమనించవచ్చు. తొడకండరాలు బలహీనంగా ఉండటం, శరీర నిర్మాణంలో అవకతవకలు, స్థూలకాయం, ఉరుకులు పరుగుల జీవితం, సరైన పాదరక్షలు ధరించకపోవడం, ఎక్కువ సేపు కూర్చోవటం లేదా నిల్చోవడం, మెట్లు ఎక్కువగా ఎక్కడం కూడా మోకాళ్ల నొప్పులకు కారణాలుగా మారుతున్నాయి. ఇక మీ విషయానికి వద్దాం. మీరు ఉండవలసిన దానికన్నా దాదాపు ఏడెనిమిది కిలోలు ఎక్కువ బరువున్నారు. డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మోకాళ్లనొప్పుల నుంచి బయట పడవచ్చు.వాటితోబాటు రోజుకు నాలుగైదు కిలోమీటర్ల దూరం సైక్లింగ్ చేయడం, కనీసం అరగంటసేపు స్విమ్మింగ్ చేయడం వల్ల మోకాళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.


మోకాళ్లనొప్పులను నివారించడానికి... ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయటం, శారీరక బరువు పెరగకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవటం, స్పోర్ట్స్ ఫుట్‌వేర్ ధరించటం, నొప్పికి కారణమయ్యే పనులు అంటే నేలమీద కూర్చోవటం, ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించడం వంటి వాటికి దూరంగా ఉండాలి. అల్ట్రాసోనిక్ వేవ్స్, మసాజ్ అందరికీ అన్ని సమయాలలోనూ ఉపకరించకపోవచ్చు. అందువల్ల డాక్టర్ సలహాపై మాత్రమే చేయించుకోవాలి. బ్రేసెస్, నీ ప్యాడ్స్ నీ క్యాప్స్ ధరించడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. కొన్ని రకాల మందులు వాడటం ద్వారా అరిగిపోయిన జాయింట్లను తిరిగి చైతన్యవంతం చేయవచ్చు. వీటన్నింటి వల్లా లాభం లేకపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకోవలసి ఉంటుంది. జాయింట్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ అంటే మోకాలిచిప్పల మార్పిడి శస్త్రచికిత్స కాస్తంత ఖరీదైనప్పటికీ చాలా కాలంపాటు మోకాళ్లనొప్పులనుంచి ఉపశమనం లభిస్తుంది.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top