అలకనంద నది వెంట ఉన్న పుణ్యక్షేత్రాలు(పంచ ప్రయాగలు)

అలకనంద నది బదరీనాథ్‌కు ఉత్తరంగా సుమారు 40 కి.మీ. అవతల హిమాలయ కొండల మధ్య పుట్టి దేవప్రయాగ అనే వూరి వరకూ ‘అలకనంద’ అనే పేరుతోనే ప్రవహిస్తుంది. అయితే బద్రినాథ్‌కు చాలా దూరంలో గంగానది గంగోత్రి అనే చోట నేలమీదకు దిగి, అక్కడ నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగివస్తుంది. అలాగే కేదార్‌నాథ్ దగ్గర భిలాంగన, మందాకిని అనే నదులు జన్మించాయి. అందులో భిలాంగన నది ముందుకు సాగివచ్చి తిహారి అనే టోట భాగీరథి నదిలో కలిసి పోతుంది. అక్కడినుంచి అది భాగీరథి అనే పేరుతో ముందుకు సాగిపోతుంది.

మందాకిని నది కేదార్‌నాథ్ నుంచి ముందుకు సాగి వచ్చి రుద్రప్రయాగ అనే చోట బదరీనాథ్ నుంచి వచ్చిన అలకనందలో కలిసిపోతుంది. అక్కడి నుంచి అది అలకనంద అనే పేరుతోనే ముందుకు ప్రవహిస్తుంది. తిహారి నుంచి వచ్చిన భాగీరథిలో దేవప్రయాగ అనే చోట అలకనంద కలిసి పోతుంది. దేవప్రయాగ తర్వాతనే అది గంగానది అనే పేరుతో ముందుకు సాగిపోతుంది. అయితే బయలుదేరిన అలకనంద నదిలో రుద్రప్రయాగ దగ్గర మందాకిని నది కలిసేలోపు మూడు నదులు వచ్చి కలుస్తాయి. బదరీనాథ్ నుంచి 38 కి.మీ దూరంలో విష్ణు ప్రయాగ అనే వూరి దగ్గర ధవళగంగ అనే చిన్ననది. అక్కడి నుంచి మరొక 68 కి.మీ దూరంలో నందప్రయాగ అనే వూరి దగ్గర నందాకిని అనే నది, అక్కడి నుంచి మరొక 22కి.మీ దూరంలో కర్ణప్రయాగ అనే వూరి దగ్గర ‘పిండ గంగ’ అనే నది వచ్చి కలుస్తాయి. 

కర్ణప్రయాగ నుంచి రుద్రప్రయాగకు 31 కి.మీ అక్కడ నుంచి దేవప్రయాగ 69 కి.మీ. అక్కడ నుంచి హరిద్వార్ 94 కి.మీ. కనుక విష్ణుప్రయాగ, నందప్రయాగ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవ ప్రయాగ అనే అయిదు సంగమ స్థానములు అలకనంద నది ఒడ్డున ఉన్నాయి. ఈ అయిదు సంగమ స్థానములను కలిపి ‘పంచప్రయాగ’ లు అంటారు. బదరీనాథ్‌కు 5 కి.మీ ఎగువన ‘మానా’ అనే చోట సరస్వతినది అలకనంద నదిలో కలుస్తుంది. దీనిని ‘కేశవప్రయాగ’ అంటారు. అలాగే గౌరికుండ్‌కు ఇవతల 5 కి.మీ దూరంలో ‘సోన్’ నే చిన్న నది వచ్చి, కేదార్‌నాథ్ వైపు నుంచి వచ్చిన మందాకిని నదిలో కలిసిపోతుంది.

ఈ ప్రదేశాన్ని ‘సోన్‌ప్రయాగ’ అంటారు. అయితే ఈ చివర రెండు ప్రయాగలు ‘పంచప్రయాగలు అనే లెక్కలోకి రావు. హరిద్వార్ నుంచి బదరీనాథ్ వైపు వెళ్లేటప్పుడు అలకనంద నది ఒడ్డునే పంచప్రయాగలు కాక, శ్రీనగర్, గరుడగంగ, జూషిమఠ్, గోవిందఘాట్, పాండుకేశ్వర్, దేవదర్శిని అనే క్షేత్రాలు, చివరగా బదరీనాథ్ వున్నాయి. ఇదిగాక ‘పంచబదరీలు అని చెప్పబడే, బదరీనాథ్ కాక మరొక నాలుగు బదరీ క్షేత్రాలు ఉన్నాయి. అయితే వాటిని చేరటానికి అలకనంద నది ఒడ్డునుంచే బయలుదేరి దూరంగా వెళ్లాలి. 
Share on Google Plus