పాలపళ్లూ పుచ్చుతాయా...?

పిల్లల్లో పాలపళ్లు చాలా ప్రధానమైనవి. వాళ్లు తీసుకునే ఆహారం నమలడానికి, మాట్లాడటానికి, ఆకర్షణీయంగా ఉండటానికి ఈ దంతాలు చాలా దోహదపడతాయి. పాలపళ్లు సరిగా ఉంటే భవిష్యత్తుల్లో శాశ్వత దంతాలు సక్రమంగా రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలపళ్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే... ఆ తర్వాత వచ్చే శాశ్వతదంతాలూ ఆరోగ్యంగా ఉంటాయి.
 

సాధారణంగా ఆర్నెల్ల వయసులో వచ్చే పాల పళ్లకు అవి వచ్చిన నాటి నుంచి కొన్ని రిస్క్‌లు ఉంటాయి. సీసాతో పాలు పట్టే పిల్లలకు కొన్నిసార్లు చాలా చిన్న వయసులోనే పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ‘బేబీబాటిల్ సిండ్రోమ్’ అంటారు. పళ్లన్నీ పిప్పిపళ్లుగా మారితే - పాడైన వాటినన్నింటినీ తొలగించాల్సి రావచ్చు.  
పాలపళ్లు పాడయ్యేందుకు కారణాలు: 
బాటిల్‌తో పాలుతాగే చిన్నారుల్లో చక్కెర కలిపిన పాలు లేదా చక్కెర కలిపిన ఇతర ద్రవపదార్థాలను ఇస్తుండటంతో పళ్లు దీర్ఘకాలం పాటు ఆ ద్రవాలతో తడిసినందువల్ల అవి దెబ్బతినే అవకాశం ఉంది. సాధారణంగా పాపాయిలను పడుకోబెట్టడానికి నోట్లో పాలపీక పెట్టే పిల్లల్లో ఇలా పాల పళ్లు పాడయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే ఆ పీకను చక్కెరలో లేదా తేనెలో ముంచి శిశువుల నోట్లో పెట్టడం వల్ల పళ్లు పాడయ్యే ప్రమాదం మరింత పెరుగుతుంది. పాలపీక నోట్లో పెట్టాక 20 నిమిషాలకంటే ఎక్కువగా ఉన్న ప్రతిసారీ పళ్లపై ఎంతోకొంత దుష్ర్పభావం పడుతుంది. ఈ ప్రక్రియ అదేపనిగా కొనసాగుతూ ఉంటే పళ్లు దుష్ర్పభావానికి లోనై క్రమంగా దెబ్బతింటాయి.

నివారణ ఇలా...
అదృష్టవశాత్తూ కొన్ని జాగ్రత్తలతో పిల్లల పళ్లు పాడయ్యే ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం సాధ్యమే. అవి...
మొదట తల్లులు తమ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. చాలా సందర్భాల్లో తల్లులు, పిల్లలు ఒకే చెంచాను ఉపయోగించడం వల్ల - తల్లుల నోట్లోని బ్యాక్టీరియా పిల్లల లాలాజలంలోకి ప్రవేశించే అవకాశాలు ఎక్కువ. అందుకే తల్లులు జాగ్రత్తగా ఉండాలి.
 

పతిసారీ పిల్లలకు పాలుపట్టాక పిల్లల నోటిని తడి గుడ్డతో గానీ, మామూలు నీళ్లలో ముంచిన దూదితో గానీ శుభ్రం చేయాలి. పాలపళ్లు వచ్చాక టూత్‌బ్రష్‌తో పళ్లు శుభ్రం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలి.
పిల్లలు ఊయగలరు అనీ, టూత్‌పేస్ట్‌ను మింగరు అని నిర్ధారణ అయ్యాక వాళ్ల టూత్‌బ్రష్‌పై బఠాణీ గింజంత టూత్‌పేస్ట్ వేసి వాళ్లు పళ్లు తోముకునేలా చేయాలి.  


చిన్నారులకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు తల్లిదండ్రులే బ్రష్ చేయడం మంచిది.
సాధ్యమైనంతవరకు పాలు, ఫార్ములా లేదా తల్లిపాలు మాత్రమే బాటిల్‌తో పట్టండి. చక్కెర కలిపిన నీళ్లు, జ్యూస్‌లు బాటిల్‌తో పట్టకండి.
 

పిల్లలు నిద్రపోవడానికి ముందే పాలుపట్టడం పూర్తిచేయండి. వాళ్లు నిద్రపోయాక బాటిల్‌ను అలాగే నోట్లో ఉంచవద్దు.
పిల్లల మొదటి పుట్టినరోజు నాటి నుంచే వాళ్లు కప్స్ సహాయంతో ఆహారాన్ని చప్పరించి తీసుకునేలా ప్రోత్సహించండి.

మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి. ఆహారంలో ఆకుకూరలు, పళ్లు, కాయధాన్యాలు ఎక్కువగా తినేలా, ఆహారం తీసుకునేప్పుడు చక్కెర పదార్థాలు తక్కువగా తినేలా చూడండి.


పిల్లల్లో పాలపళ్లు కనిపించగానే డెంటిస్ట్‌ను కలవండి. ఆ తర్వాత నుంచి ప్రతి ఆర్నెల్లకోమారు డెంటిస్ట్‌ను సంప్రదిస్తూ అవసరమైన చికిత్స తీసుకుంటూ ఉంటే శాశ్వత దంతాలు కూడా దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా ఉంటాయి. 



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top