కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి.......ఆర్థరైటిస్ అంటే...?

ఆర్థరైటిస్ అంటే...?
మన సొంతకాళ్ల మీద నిలబడాలంటే ముందుగా సొంత కీళ్ల మీద నిలబడాలి. మన శరీరాన్ని మోకాళ్ల మీద మోయడానికి, ముందుకీ వెనక్కీ వంచడానికి, కాళ్లు చేతులు బారా చాచడానికి, దగ్గరికి ముడుచుకుని కూర్చోడానికి అన్నింటికీ ఉపకరించేవి కీళ్లే. మెడ, గూడలు, మోచేతులు, తుంటి ఎముక, మోకాలు, పాదం, మణికట్టు, వేళ్లు... ఇలా అన్నిచోట్ల కీళ్లు ఉంటాయి.
 

రెండు ఎముకలను కలిపే చోటును కీలు అంటారు. ప్రతి కీలు చుట్టూ ఎముక చిగురు అని చెప్పే ఒక కార్టిలేజ్ పొర ఉంటుంది. ఎముక చుట్టూ ఉండే ఈ కార్టిలేజ్ పొర అరిగాక మళ్లీ ఈ కణాలు పుట్టవు. అందుకే గతంలో కీళ్లనొప్పి వస్తే దాన్ని పాత నొప్పిగా వర్ణించి ఎప్పటికీ తగ్గని నొప్పిగా భావించేవారు. ఇలా వయసుతో పాటు కీళ్లు అరిగే సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు.

కీళ్ల నొప్పులు ఎందుకు వస్తాయి...

సాధారణంగా ఎముకలు కలిసే అన్నిచోట్ల కీళ్లు ఉన్నా మనల్ని నిలబెట్టేది, మన కదలికలకు సహాయపడేది మోకాలు. కాబట్టి కీళ్ల నొప్పులు అనగానే ముందుగా మోకాలినొప్పులు గుర్తొస్తాయి. కాబట్టి దీని నిర్మాణాన్ని తెలుసుకుందాం. తొడ ఎముకను ఫీమర్ అంటారు. కాలి ఎముకను ‘టిబియా’ అంటారు. ఈ రెండు ఎముకలు కలిసే చోట ఎముకల చివరిభాగంలో పచ్చికొబ్బరిలా ఉండే మెత్తటి ‘కార్టిలేజ్’ ఉంటుంది. రెండు ఎముకలు కలిసే చోట రాపిడిని తట్టుకునేలా ప్రకృతి ఈ ‘కార్టిలేజ్’ను డిజైన్ చేసింది. నడిచేటప్పుడు, వంగే సమయంలో, పరుగెత్తేటప్పుడు ఎముకపై ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ కార్టిలేజ్ పొర చూసుకుంటుంది. ఈ కార్టిలేజ్ అరగడం వల్ల ఎముకలు పరస్పరం రాసుకుపోయి నొప్పి వస్తుంది. ఇలా వచ్చే నొప్పులను ఆస్టియో ఆర్ధరైటిస్ అంటారు. ఇలా వయసుతో పాటు వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్‌లోనూ మూడు దశలు ఉంటాయి. ఈ మూడో దశ చాలా బాధాకరంగా ఉంటుంది. 

మోకాలి నొప్పి ఇలా... 
మోకాలిలోని రెండు ఎముకల చివరన ఉండే కార్టిలేజ్ మోకాలి చిప్ప వెనక ఉంటుంది. అలాగే ఎముకలను దగ్గరగా ఉంచడంలో ‘లిగమెంట్’ అనే మరో పొర సైతం కీలకంగా ఉంటుంది. తొడను, కాలి ఎముకలను దగ్గరగా కలిపి ఉంచేందుకు ఈ పొర తోడ్పడుతుంది. అలాగే కండరాలు ఎముకలను పట్టి ఉంచేందుకు టెండన్స్ అనేవి తోడ్పడతాయి. తొడ ఎముక, కాలి ఎముక మధ్యన ఉండే కీళ్లు (జాయింట్స్) వంగేటప్పుడు లోపలివైపునకు ఒంగితే దాన్ని ‘వాల్గస్’ అంటారు. బయటి వైపునకు వంగితే దాన్ని ‘వారస్’ అంటారు. ఇలా వంగిపోతూ ఉండటం వల్ల కార్టిలేజ్ త్వరగా అరుగుదలకు లోనవుతుంది. దాంతో రెండు ఎముకలు ఒరుసుకుపోయి భరించలేనంత నొప్పి వస్తుంది.

చికిత్స ప్రక్రియలు
కొన్ని రకాల కీళ్ల అరుగుదలలో వచ్చే నొప్పిని ఎన్‌ఎస్‌ఏఐడి అనే మందులతో వైద్యులు తగ్గిస్తారు. అయితే కీళ్లు అరగడం వల్ల వచ్చే నొప్పికి మందులతోనే శాశ్వత ప్రయోజనం ఉండదు. ఇన్ఫెక్షన్ సోకడం వల్ల వచ్చే ‘పోస్ట్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్’ మినహా మిగతా అన్ని రకాల ఆర్థరైటిస్‌లకు కీళ్ల మార్పిడి ఒక్కటే సమర్థమైన చికిత్స. ప్రధానంగా మోకాళ్లకు ఈ ఆపరేషన్ ఎక్కువగా చేస్తుంటారు. మోకాలికి చేసే చికిత్సను ‘నీ జాయింట్ రీప్లేస్‌మెంట్’ అంటారు. 


కీలెరిగి కోత...
వాత పెట్టడం అశాస్త్రీయం. వైద్యశాస్త్రం అభివృద్ధి చెందాక మన డాక్టర్లు ‘కీలెరిగి కోత’ పెట్టి చికిత్స చేస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అతి కొద్దిదేశాలకే అందుబాటులో ఉన్న ఈ వైద్య సదుపాయం ఇప్పుడు మన రాష్ట్రంలోని పెద్ద ఆసుపత్రుల్లోనూ లభిస్తోంది. దాంతో ఎన్నో దేశాల వాళ్లు మన దేశానికి వచ్చి చికిత్స తీసుకుంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర లభించే ఈ చికిత్స విషయంలో నైపుణ్యంలో మనం వారికి ఏమాత్రమూ తీసిపోం. అక్కడితో పోలిస్తే మన దగ్గర లభ్యమయ్యే ఈ చికిత్స చాలా చవక కూడా. ఇందులో తొలగించాల్సిన కాలి ఎముకలోని భాగాన్ని గుర్తించి, ఒక పక్క స్టీలుతో, మరో పక్క ప్లాస్టిక్‌తో తయారు చేసిన కృత్రిమ కీలును అక్కడ అమరుస్తారు. అయితే అంతమాత్రాన దాని గట్టిదనంపై సందేహాలు అక్కర్లేదు.

ఆర్థరైటిస్ లక్షణాలు : 

తొలి దశ : 
ఆర్థరైటిస్ తొలి దశలో కాళ్లు బరువెక్కినట్లుగా బిగుసుకుపోయినట్లుగా ఉంటాయి. కట్టెలా అయిపోయి ముడుచుకోడానికి వీల్లేనట్లుగా అనిపిస్తాయి. ఆర్థరైటిస్‌కు ఇది మొదటి సంకేతం. సాధారణంగా ఈ బాధలు యాభై దాటాకే ఎక్కువగా కనిపిస్తాయి.

రెండోదశలో:
 

మెట్లెక్కి దిగేటప్పుడు తట్టుకోలేనంత బాధ ఉంటుంది. కీళ్ల దగ్గర వాపు వస్తుంది. కింద కూర్చుని లేచేటప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంది.

మూడోదశలో:
 

ఎముకలు రాసుకుంటున్నట్లుగా శబ్దం వస్తుంది. ఎముకల చివరన అసాధారణ వృద్ధి వల్ల ‘ఆస్టియోఫైట్స్’ ఏర్పడతాయి. దీనివల్ల లిగమెంట్స్ దెబ్బతింటాయి. దాంతో మోకాలు దెబ్బతింటుంది. సమస్య మొదటిదశలో మందులు ఇచ్చినా, రెండు, మూడు దశల్లో ఉన్నప్పుడు ‘నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ’యే తప్పనిసరి.

ఆర్థరైటిస్ నివారణకు జాగ్రత్తలివి...


  • స్థూలకాయం లేకుండా చూసుకోవాలి.
  • మఠం వేసుకుని నేల మీద కూర్చోకుండా చూసుకోవాలి.
  •   టాయిలెట్లలో కాలుముడుచుకుని కూర్చునే ఇండియన్ టైప్ టాయిలెట్స్‌ను ఉపయోగించకూడదు. కూర్చునేందుకు వీలుగా ఉండే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించాలి.

  •  బీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజ్‌ల వల్ల్ల ఎముక చివరన ఉండే కార్టిలేజ్ ఆరోగ్యం బాగుంటుంది. 

మూవ్... ఇంప్రూవ్...
కీళ్లనొప్పులు దుర్భరమైన సమస్యే. నడక, వ్యాయామం వంటి వాటితో ఈ సమస్య మరింత పెచ్చుమీరుతుందని గతంలో భావించేవాళ్లు. అది అపోహ మాత్రమేనని తేలింది. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్ లేదా సైక్లింగ్ మంచిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 27.9 కోట్ల మంది ఆర్థరైటిస్ బాధితులకు ఈ సమాచారాన్ని తెలిపేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ‘మూవ్ టు ఇంప్రూవ్’ అనే నినాదం ఇచ్చింది. ఆర్థరైటిస్ రోగులతో పాటు, దాన్ని నివారించుకోవాలని భావించే వారంతా ఎంతోకొంత నడుస్తూ తాము నడచిన దూరాన్ని డబ్యూహెచ్‌ఓకు తెలపాలని కోరింది డబ్ల్యూహెచ్‌ఓ. అందరూ కలిసి తాము వ్యాయామంలో భాగంగా అధిగమించాల్సిన దూరం 24,900 మైళ్లుగా నిర్ణయించింది. అంతా కలిసి ఆ దూరాన్ని అధిగమిస్తే అది ఒకసారి ప్రపంచాన్ని చుట్టినంత అనీ, ఇలా చేయడం వల్ల ఆర్థరైటిస్ నివారణ సందేశాన్ని ప్రపంచమంతా చాటినట్లు అవుతుందన్నది డబ్ల్యూహెచ్‌ఓ ఉద్దేశం.  
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top