కృత్రిమ శ్వాస కల్పించడం కోసం డాక్టర్లు వెంటిలేటర్ పెడతారు. అది పెట్టాల్సిన పరిస్థితులు, ఏయే సందర్భాల్లో అవసరం, అపోహలు, వాస్తవాలు

మనం ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు ఉండవచ్చు. కానీ... శ్వాస తీసుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. శరీరంలోని అన్ని జీవక్రియల నిర్వహణ కోసం ప్రతి క్షణం ఆక్సిజన్ అవసరం అన్న విషయం తెలిసిందే. మనం శ్వాస క్రియ ద్వారా ఎప్పటికప్పుడు ఆక్సిజన్ తీసుకోవడం, కార్బన్‌డైఆక్సైడ్ వదిలివేయడం సాధ్యమవుతుంది. అయితే ఏవైనా కారణాల స్వాభావికంగా శ్వాస తీసుకోలేకపోతుంటే కృత్రిమ శ్వాస కల్పించడం కోసం డాక్టర్లు వెంటిలేటర్ పెడతారు. అది పెట్టాల్సిన పరిస్థితులు, ఏయే సందర్భాల్లో అవసరం, అపోహలు, వాస్తవాలు లాంటి అంశాల గురించి తెలుసుకోండి. 


ఏయే సందర్భాల్లో...
రక్తంలో ఆక్సిజన్ పాళ్లు తగ్గడం, కార్బన్ డై ఆక్సైడ్ పాళ్లు పెరగడం.

సొంతంగా ఊపిరి అందక ఎక్కువగా ఆయాసపడటం.

ఊపిరి తీసుకోడానికి అవసరమైన కండరాలు పనిచేయకపోవడం.

మిగతా శారీరక వ్యవస్థలు (సిస్టమ్స్) సరిగా పనిచేయలేకపోవడం వల్ల ఆ ప్రభావం శ్వాస వ్యవస్థపై పడటం.

ఊపిరితిత్తులకు నిమోనియా ఇన్ఫెక్షన్ సోకడం లేదా క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ వంటి శ్వాసకోశ వ్యాధులతో శ్వాస తీసుకోలేకపోవడం.

ఉబ్బసం (ఆస్తమా) తీవ్రంగా ఉండటం.

శరీరమంతటా ఇన్ఫెక్షన్ వేగంగా పాకిపోతున్న పరిస్థితుల్లో (సెప్సిస్)

పక్షవాతం వచ్చినప్పుడు.

వెంటిలేటర్ పెట్టే ప్రక్రియ ఇలా... 

కృత్రిమ శ్వాస పెట్టడానికి ముందుగా శ్వాసనాళంలోకి ఒక గొట్టాన్ని ప్రవేశపెడతారు. దాన్ని వెంటిలేటర్ ట్యూబ్స్‌కు కలుపుతారు. రోగి తనంతట తాను శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో వెంటిలేటర్ ఆ ట్యూబ్స్ ద్వారా ఆక్సిజన్‌ను ఊపిరితిత్తుల్లోకి పంపుతుంటుంది. ఆక్సిజన్ పెట్టడంలో రోగులు ఒక విషయంలో పొరబడుతుంటారు. సాధారణంగా రోగికి ఆక్సిజన్ అందడానికి వీలుగా ఒక్కోసారి ఆక్సిజన్ మాస్క్ పెడతారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టినప్పుడు రోగి తనంతట తానే శ్వాస తీసుకోగలడు. అయితే రోగి తనంతట తానే శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో మాత్రమే వెంటిలేటర్‌ను అమర్చుతారు.

ఎంతకాలం ఉంచాలి...
ఒకసారి రోగిని వెంటిలేటర్‌పై పెట్టాక... ఏ పరిస్థితిని మెరుగు చేయడానికి రోగిని వెంటిలేటర్‌పై పెట్టారో అది మెరుగయ్యే వరకు ఉంచాల్సి వస్తుంది. కొంతమంది రోగుల్లో వెంటిలేటర్ తీయడం ఒక పట్టాన సాధ్యపడకపోవచ్చు. (ఉదాహరణకు క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీవోపీడీ) వంటి వ్యాధులు); స్థూలకాయం కారణంగా కండరాలు బలహీనంగా ఉండటం.

సాధారణంగా ఐదు కంటే ఎక్కువ రోజులు వెంటిలేటర్‌పై ఉంచాల్సిన పరిస్థితుల్లో రోగికి ట్రకియాస్టమి అనే ప్రొసిజర్ అవసరం కావచ్చు. దీనివల్ల స్వరపేటికకు నష్టం వాటిల్లదు. పైగా వెంటిలేటర్‌ను త్వరగా తీసే అవకాశం ఉంటుంది. లేదా మళ్లీ అవసరమైతే తేలిగ్గానూ, ప్రమాదం లేకుండా వెంటనే వెంటిలేటర ట్యూబ్స్‌కు కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 


అపోహ... వాస్తవం...
ఒకసారి వెంటిలేటర్‌పై పెట్టాక మళ్లీ కోలుకోవడం కష్టమని చాలామంది రోగుల్లో, రోగి బంధువుల్లో ఒక అపోహ ఉంది. కోలుకోవడం అన్నది రోగికి ఉన్న జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ కండిషన్ చాలా సీరియస్‌గా ఉన్నప్పుడు చివరి ప్రయత్నంగా వెంటిలేటర్‌పై ఉంచుతారు. అలాంటి పేషెంట్స్‌లో తప్ప... చాలా సందర్భాల్లో రోగి వెంటిలేటర్‌పై పెట్టాక కూడా కోలుకొని బయటకు వస్తాడు. కాబట్టి వెంటిలేటర్‌పై పెట్టిన రోగులంతా కోలుకోరని భావించడం సరికాదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top