ఒకసారి చప్పట్లు చరిస్తే... ఏడుసార్లు ప్రతిధ్వనించే సమాధి మందిరం... గోల్‌గుంబజ్...


గోల్‌గుంబజ్... అంటే గోళాకారపు గుమ్మటం అని అర్థం. ఇది కర్నాటక రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఉంది. ఇది 17వ శతాబ్దానికి చెందిన నిర్మాణం. అప్పటి బీజాపూర్ సుల్తాన్ మహమ్మద్ అదిల్ షా నిర్మించాడు. ఇది అతడి సమాధి మందిరం. దీని నిర్మాణం 1659లో పూర్తయింది. సమాధి మందిరాన్ని తానే నిర్మించుకున్న రాజు ఇతడు. అదిల్‌షాి జీవించి ఉన్నప్పుడే మొదలైన నిర్మాణం అతడు మరణించిన తర్వాత కూడా కొనసాగింది. గోల్‌గుంబజ్ నిర్మించేనాటికి ప్రపంచంలో అతి పెద్ద గుమ్మటంగా రికార్డుకెక్కింది. వ్యాసం పరిమాణంలో ఈ గుమ్మటానిది రెండవస్థానం. మొదటిస్థానం రోమ్‌లోని సెయింట్ పీటర్స్ బాసిలికా డోమ్‌ది. వైశాల్యంలో గోల్ గుంబజ్ పెద్దది. సెయింట్ పీటర్స్ బాసిలికా డోమ్ విస్తీర్ణం దాదాపు 15 వేల చదరపు అడుగులు, కాగా దీని వైశాల్యం 18వేల చదరపు అడుగులకు పైనే. రెండవ పెద్ద గుమ్మటం రికార్డు 1937 వరకు కొనసాగింది. తర్వాత ఇంకా పెద్ద నిర్మాణాలు జరిగాయి. 

గోల్‌గుంబజ్ గుమ్మటం ఎత్తు 90 అడుగులు, వ్యాసం దాదాపు 43.3 మీటర్లు. ఇది తాజ్ మహల్ గుమ్మటం (17.7 మీటర్లు)కంటే పెద్దది. గోడల మందం పది అడుగులు. గోల్ గుంబజ్ ఇండో- పర్షియన్ వాస్తుశైలిని అనుసరించి నిర్మించిన కట్టడం. చూడడానికి ఇది చాలా సాధారణమైన కట్టడం అనిపిస్తుంది. కానీ విశాలమైన హాలు, నాలుగు వైపులా ఏడు అంతస్తుల సౌధాల నిర్మాణం అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానానికి సూచికలు. మందిరం లోపల గుండుసూది కింద పడినా... అది ఏడుసార్లు ప్రతిధ్వనిస్తుంది. దీనిని విష్పరింగ్ గ్యాలరీ అంటారు.

ఈ గుమ్మటంలో ముహమ్మద్ అదిల్‌షాి సమాధితోపాటు ఆయన ముగ్గురు భార్యలు, కూతురు, మనుమడి సమాధులు కూడా ఉన్నాయి. దీని నిర్మాణంలో అద్భుతమైన విషయం అప్పటి సాంకేతిక పరిజ్ఞానమే. ఇంత పెద్ద గుమ్మటానికి ఆధారంగా ఎక్కడా స్తంభాలు ఉండవు. దీనిని రూపకర్త యాకుత్ దాబుల్. నిర్మాణంలో నాలుగు దిక్కుల్లో ఉన్న సౌధాల ఎత్తు 50 మీటర్లు. ఇవి చైనా పగోడాలను పోలి ఉంటాయి. అసలు సమాధులు భూమికి లోపల ఉంటాయి. వాటిని చేరడానికి హాలులో ఒకవైపు నుంచి మెట్లు ఉన్నాయి. గోల్‌గుంబజ్ ప్రాంగణంలో మసీదు, మ్యూజియం ఉన్నాయి. చారిత్రక కట్టడాల పరిశోధన, అధ్యయనం, చారిత్ర పర్యాటకంలో ఇది అత్యంత ప్రాధాన్యమైనది.



ముహమ్మద్ అదిల్ షా గురించి...
బీజాపూర్ రాజ్యాన్ని మహమ్మద్ అదిల్‌షా క్రీ.శ 1626 నుంచి 1656 వరకు పాలించాడు. ఇతడు పదహారేళ్ల వయసులో సింహాసనాన్ని అధిష్ఠించాడు. మొఘలులతో మంచి సంబంధాలను కొనసాగించి పరిమితులతో కూడిన సార్వభౌమత్వాన్ని సాధించాడు. మొఘలులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం రాజ్యాన్ని ఉత్తరాది ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నం చేయకుండా అరేబియా సముద్రం వరకు విస్తరించాడు. అతడి కట్టడాలలో గోల్‌గుంబజ్ ప్రముఖమైనది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top