దక్షిణాది భాషల్లో ‘కౌన్ బనేగా కరోడ్‌పతీ.....’......?



‘కౌన్ బనేగా కరోడ్‌పతీ..’ ప్రేరణతో అనేకానేక గేమ్‌షోలు భారతీయ ఛానల్స్‌లో దర్శనమిచ్చినా మొదటి కార్యక్రమం పట్ల ఉన్న మక్కువ అటు టీవీ పరిశ్రమ వర్గాలకీ, ఇటు ఆడియన్స్‌కీ ఇంకా తగ్గినట్లు కన్పడ్డంలేదు. అందుకు నిదర్శనంగానే ‘కౌన్‌బనేగా...’ గేమ్ షోని తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రవేశపెట్టే ఆలోచనలు రావడాన్ని చెప్పుకోవచ్చు. విషయమేమిటంటే అమితాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ ‘కౌన్‌బనేగా...’ సిరీస్‌ని స్థానిక ట్రెండ్‌కి తగ్గట్టు స్టార్ విజయ్ టీవీ తమిళంలోనూ, ‘సువర్ణ’ టీవీ కన్నడంలోనూ, ఏషియా నెట్ మలయాళంలోనూ రూపుదిద్దడానికి ప్రయత్నాల్ని చేస్తోంది. మరి అమితాబ్ నిర్వహించిన ‘లాక్‌కియా జాయ్..’ పాత్ర పోషణకి దీటుగా ప్రాంతీయ భాషల్లో నిలబడగలిగేదెవరు? అన్న ప్రశ్నకు ఆన్సర్‌గా తమిళంలో కమలహాసన్, సూర్య, విజయ్‌ల పేర్లు వినవస్తున్నాయి. అలాగే మలయాళంలో అక్కడి అత్యున్నత తారలు మమ్ముట్టి, మోహన్‌లాల్‌లలో ఎవరో అన్నది తేలాల్సి ఉంది. ఇక కన్నడం విషయానికి వస్తే పునీత్ రాజ్‌కుమార్ (నటుడు రాజ్‌కుమార్ తనయుడు) కానీ సుదీప్ కానీ పగ్గాలు చేపట్ట వచ్చునంటున్నారు. చూద్దాం. ‘కౌన్ బనేగా...’ వరమాల ఎవరి కంఠాన్ని అలంకరించనుందో. అది సరేగానీ మరి తెలుగు మాటేమిటి? అన్న భావం మనకీ కలగొచ్చు. అమితాబ్ చేసిన ఈ సందడి వచ్చిన తొలి సిరీస్ రోజుల్లో దానికి పేరడీ తెలుగు ఛానల్స్‌లో వచ్చినా సీరియస్‌గా ఈ దిశగా చేసిన ప్రయత్నాలు కన్పడలేదు. మరి ఇప్పుడు తెలుగు మినహా మిగతా భాషల్లో ఈ తరహా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. కనుక మన భాషలోనూ ఆ మాదిరి ఆలోచిస్తే బావుంటుందేమో ఆలోచించాలి. అది కొత్త సంవత్సరంలో మొగ్గ తొడుగుతుందేమో.. వేచి చూద్దాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top