ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వార దర్శనం సర్వ పాపనాశనం - దీనికి సంబంధించి ఓ పురాణ గాథ


మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశిని మనం ‘వైకుంఠ ఏకాదశి’గా జరుపుకుంటాం. దీనినే ‘ముక్కోటి ఏకాదశి’అనీ అంటారు. ఆషాడ మాసం శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. ఆరోజు శ్రీహరి పాల కడలిలో శయనించిన రోజు. ఆ జగన్నాటక సూత్రధారి యోగ నిద్రలో గడిపి ముక్కోటినాడు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది.
 

పురాణ గాథ: 
లోక కంఠకుడైన రావణాసురుడు దేవతలను నానావిధాల హింసించాడు. అతని బాధలకు తాళలేని దేవతలు, బ్రహ్మదేవుడ్ని ఆశ్రయించగా, వారందరితో కలసి ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున వైకుంఠాన్ని చేరుకున్నాడు. బ్రహ్మదేవునితోపాటు సమస్త దేవతలూ, ఆ వైకుంఠాన్ని చేరుకుని, శ్రీహరిని శతవిధాల స్తుతించారట. దేవతల స్తుతిని సంతోషించిన శ్రీహరి, వారికి తన దర్శన భాగ్యం కల్గించాడు. సాక్షాత్తు శ్రీహరి, దేవతలను అనుగ్రహించి, తన దర్శనభాగ్యం కల్పించిన రోజు కనుక ఇది ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అయ్యింది.
 

వైకుంఠ ఏకాదశి పర్వదినానికి సంబంధించి మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. మధుకైటభులనే రాక్షసులు శ్రీహరి చేతిలో హతమయ్యారు. తత్ ఫలితంగా వారు దివ్యరూపధారులై దివ్యజ్ఞానాన్ని పొంది స్వామిని స్తుతించారు. దానికి సంతుష్టుడైన శ్రీహరి వారిని వరం కోరుకోమన్నాడట. దాంతో ఆ రాక్షసులిద్దరూ, ‘బ్రహ్మాదులెవరైనా శ్రీహరి లోకం లాంటి మందిరాన్ని నిర్మించి, ఏకాదశి పండుగ చేసుకుని, ఉత్తర ద్వార మార్గాన శ్రీహరిని చేరుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కల్గించమని వేడుకున్నారట. లోక కళ్యాణంకోసం కోరిన వారి కోరికను శ్రీహరి మన్నించి, అనుగ్రహించాడు. ఆ కారణంగా ముక్కోటి దేవతల బాధలను నివారించిన ఏకాదశి దినం కావున, ముక్కోటి ఏకాదశిగాను, భగవంతుని దివ్యదర్శనం కల్గిన పుణ్యదినం కనుక భగవదవలోకన దినంగా మార్గశిర మాస శుక్లపక్ష ఏకాదశి ప్రఖ్యాతి చెందింది. శుభకరమైనది. సర్వజన రక్షకుడైన శ్రీమన్నారాయణుడిని భక్తితో పూజించిన వారికి అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అత్యంత పుణ్యప్రదమైన వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఉపవాస వ్రతంపాటిస్తుంటారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారు ప్రాతఃకాలమే లేచి శుచియై, విష్ణుమందిరానికి వెళ్ళి, తాము ఆచరించే వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేయమని శ్రీహరిని ప్రార్థిస్తారు. ఆరోజు శ్రీహరిని భక్తితో పూజించి, ఉపవాస దీక్షతో జాగరణ చేస్తారు. భక్తులు జాగరణ చేస్తూఇహలోకాన్ని మరిచిపోతారు. శ్రీహరి ధ్యానంలో నిమగ్నవౌతారు. ద్వాదశి ఘడియలు వచ్చిన తర్వాత నారాయణుడిని మరలా పూజించి, నైవేద్యం పెట్టి దీక్షవిరమించి ఉపవాసపారణ చేస్తారు. భార్యాభర్తలు కలసి ఈ వ్రతాన్ని పాటిస్తే సౌభాగ్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. ద్వాదశినాడు స్వామిని అర్చించి, అన్నదానం చేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసంతోపాటు, చేసే దానాలవల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితంకంటే అధిక ఫలితం లభిస్తుందని పద్మపురాణం అంటుంది.
 

వైకుంఠ ఏకాదశినాడు నారాయణుని ఉత్తర ద్వార దర్శనం ప్రధానం. ఆళ్వారులలో ఒకరైన నమ్మాళ్వారు ఈ పర్వదినం స్వామి సన్నిధానికి వెళ్లారు. ఆ ఆళ్వారుని స్మరించుకొంటూ కూడా శ్రీవైష్ణువులు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుతారు. ఇలా భూలోకం అంతా వైకుంఠ నాథుని స్మరణలతో దర్శనాలతో వైకుంఠమే భువికి దిగివచ్చిందా అనిపించేంతగా ఈ ఏకాదశి పర్వదినం మహోన్నతంగా కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top