కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో..అనే మాట మనం తరచు చాలామంది నోటి నుంచి వింటూ ఉంటాం. వారికి ఏ భంగిమలో నిద్రపోతే కంటినిండా నిద్ర వస్తుందో చూద్దాం

కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులైందో..అనే మాట మనం తరచు చాలామంది నోటి నుంచి వింటూ ఉంటాం. నిజానికి కంటికి నిద్ర దూరమైతే అది అనేక రుగ్మతలకు దారి తీస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. రోజుకు కనీసం 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతుంటారు. నిద్రాదేవత కరుణ కోసం చాలామంది చాలారకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

శారీరక శ్రమ ఉన్నవాళ్లకైతే దీని గురించి అంత తాపత్రయ పడాల్సిన పనిలేదు. ఆ శ్రమ లేనివారికే ఇబ్బందంతా.కొందరు పాలు తాగితే నిద్రవస్తుందని, మరి కొందరు పుస్తకాలు చదివితే నిద్రవస్తుందని ప్రయత్నిస్తుంటారు. అవేవీ పనిచేయని వారికి ఏ భంగిమలో నిద్రపోతే కంటినిండా నిద్ర ఉంటుందో కొందరు నిపుణులు చెబుతున్నారు.

కాళ్లు ముడుచుకుని: 

ఒక ప్రక్కకు తిరిగి పడుకుని మోకాళ్లను గడ్డం దాకా ముడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల శ్వాస పీల్చుకోవడంలో, వదలడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. జీర్ణక్రియ కూడా సాఫీగా సాగుతుంది. దీన్నే గర్భస్థ శిశువు భంగిమ అని కూడా అంటారు.

బోర్లా:
 రెండు కాళ్లను అటు ఇటు వేయకుండా నేరుగా ఉంచుకుని తలగడకు అభిముఖంగా ఒక వైపునకు తలవాల్చి నిద్రపోవడం. వెన్నును నిటారుగా ఉంచడం వల్ల వెన్నునొప్పి సమస్యలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి. అయితే ఎత్తైన తలగడ మాత్రం ఉంచుకోకూడదు. ఇలా పడుకోవడం వల్ల హాయిగా నిద్రపడుతుంది.

వెల్లకిలా:

 రెండు చేతులను పక్కన ఉంచుకుని రెండు కాళ్లు నిటారుగా ఉంచుకుని కవాతు చేస్తున్న సైనికుని భంగిమలో నిద్రకు ఉపక్రమిస్తే మంచి ఫలితం ఉంటుంది. అయితే ఈ భంగిమలో గురక వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది.

శవాసనం: 

వెల్లకిలా పడుకుని రెండు కాళ్లు, రెండు చేతులను స్వేచ్ఛగా అటు ఇటు పడేసి నిద్రపోతే మధ్యలో మెలకువ రావడం దాదాపు ఉండదంటున్నారు నిపుణులు. ఇది యోగాలో శవాసనానికి దగ్గర దగ్గరగా ఉంటుంది. శరీరం సాగతీసి ఉండడం వల్ల శ్వాస తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ భంగిమలో కూడా గురక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.

ఈ భంగిమలను అటుంచితే మంచి నిద్ర రావడానికి అర్థరాత్రి వరకు మేలుకోకుండా వేళకు నిద్రపోవడం, ఉదయం పెందరాలే నిద్రలేవడం మంచిది. రాత్రుళ్లు నిద్రపోవడానికి ముందు మానసిక ఒత్తిళ్లు ఏర్పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎదుటివారితో వాగ్వివాదాల జోలికిపోరాదు. టీవీలో వచ్చే కార్యక్రమాలు చూసి బుర్రకు పనిచెప్పకూడదు. సాధ్యమైనంత వరకు మనసును, ఆలోచనలను ప్రశాంతంగా ఉంచుకోవాలి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్‌లో చాటింగ్ వంటి కార్యక్రమాలు రాత్రుళ్లు నిద్రపోయే ముందు పెట్టుకోకూడదు. దానికన్నా పుస్తక పఠనం మంచిది.

పగలు నిద్రపోయి రాత్రుళ్లు నిద్రరమ్మంటే కష్టమే! అందుకే పగలు పడుకున్నా మధ్యాహ్నం 3 గంటల లోపు ఓ పావు గంట, అరగంట కునుకుతీయాలే తప్ప గంటల తరబడి నిద్రపోకూడదు. అన్నిటికన్నా ముఖ్యమైనది రాత్రుళ్లు ఆల్కహాల్ వంటి మత్తుపదార్థాలు తీసుకోకూడదు. దీని వల్ల అప్పటికి నిద్రపట్టినా మత్తు దిగిన వెంటనే మళ్లీ నిద్రపట్టడం కష్టం. దీంతో నిద్రలేమి ఏర్పడుతుంది. అలాగే రాత్రుళ్లు ధూమపానం కూడా చేయరాదు. నికోటిన్ ప్రభావం వల్ల నిద్ర దూరంగా పారిపోతుందంటున్నారు వైద్య నిపుణులు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top