పరీక్షల కాలం వచ్చేసింది. విద్యార్థులు పరీక్షల సన్నాహాల్లో తలమునకలయ్యే
తరుణమిది. చివరి నిమిషంలో పూర్తి కాని సిలబస్‌ను కంప్లీట్ చేసుకునే వారు
కొందరైతే పూర్తయిన సిలబస్‌ను రివిజన్ చేసుకునే విద్యార్థులు మరి కొందరు.
ఏదేమైనా విజయానికి దగ్గరి దారులు ఉండవు. ఇది విద్యార్థులు నేర్చుకోవలసిన
తొలిపాఠం. అందుకోసం బాగా చదవడం ఒక్కటే మార్గం. విద్యార్థులు పరీక్షలకు
ప్రిపేర్ కావడానికి ఉపయోగపడే కొన్ని సూచనలు :
- పరీక్షలంటే భయపడకూడదు. అలాగే ద్వేషించకూడదు. ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. పరీక్షలను బాగా రాయగలమన్న ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
- పరీక్షలకు ముందు ఎలా చదువుకోవాలో ఒక టైమ్ టేబుల్ తయారుచేసుకోవాలి. అన్ని సబ్జెక్టులను అందులో పొందుపరుచుకోవాలి. క్లిష్టమైన సబ్జెక్టులకు ఎక్కువ సమయం కేటాయించి తేలికగా ఉండే సబ్జెక్టులకు కొంత సమయాన్ని తగ్గించుకోవాలి.
- ప్రశాంతంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే గదిని చదువు కోసం ఎంచుకోవాలి. ఆ గదిలో టివి, ఆడియో సిస్టమ్స్ లాంటివి ఉండకూడదు. అలాగే రోడ్డు కనిపించే విధంగా కిటికీలు ఉండకుండా చూసుకోవాలి.
- చదివేటప్పుడు నిటారుగా కూర్చోవాలి. మంచం మీద పడుకునో, కుర్చీలో వాలిపోయో చదవకూడదు. కుర్చీలో వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. రెండు కాళ్లను నేరుగా నేలమీద ఉంచాలి. కాళ్లను టేబుల్ మీద పెట్టుకుని చదవడం వంటివి చేయకూడదు.
- చదివే సమయంలో ముఖ్యమైన పాయింట్లను నోట్స్ రాసుకోవాలి. అది సుదీర్ఘంగా కాక క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల ఆ పాయింట్స్‌ను గుర్తు పెట్టుకోవడం సులభమవుతుంది.
- రాత్రంతా మేల్కొని, పగలు జోగుతూ చదవడం వల్ల ప్రయోజనం ఉండదు. రాత్రి కనీసం 6 నుండి 8 గంటల గాఢ నిద్ర ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా పరీక్ష ముందు రోజు రాత్రి కనీసం 6 గంటలు నిద్రించాలి. అలాగే పరీక్షల సమయంలో భోజనం మానేయడం లాంటివి చేయకూడదు. రాత్రి పడుకునే ముందు గ్లాసుడు మంచినీళ్లు తాగడం మంచిది.
- చేతిరాత బాగుండేలా చూసుకోండి. అలాగే ప్రశ్నలకు ఎలా సమాధానమిస్తున్నారో కూడా ముఖ్యం. మీ సమాధానాలలో అన్ని పాయింట్లు కవర్ అయ్యేలా చూసుకోండి. అలాగే మీకు బాగా తెలిసిన ప్రశ్నలకు ముందు జవాబులు రాయండి.