సమ్మర్ వచ్చిందంటే ఈత మీద ఆసక్తి పెరుగుతుంది.స్విమ్మింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.

- స్విమ్మింగ్‌కు వెళ్లేవారు చెవుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు చెవులలోకి ప్రవేశించి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్‌ప్లగ్స్ పెట్టుకోవాలి. ఈత పూర్తయ్యాక పొడిబట్టతో చెవులు శుభ్రం చేసుకోవాలి.

- గడ్డం గీసుకోకుండా ఈదేవారు గరుకుగా ఉండే గడ్డం... భుజాలకు రాసుకోకుండా జాగ్రత్తపడాలి. ఒక్కోసారి అలా మాటిమాటికీ రాసుకుంటూ ఉండటం వల్ల నీళ్లలో తడిసి మృదువుగా మారిన భుజాల చర్మం గడ్డం వల్ల ఒరుసుకుపోయి చర్మం ఎర్రబడి భుజం మీద ర్యాష్ రావచ్చు. దీన్నే ‘స్విమ్మర్స్ షోల్డర్’ అంటారు.


- చాలామంది ఈత పూర్తయ్యాక వెంటనే లోదుస్తులు మార్చరు. అనుకోకుండా ఈతకు రావడంవల్లనో లేదా మరే కారణాల వల్లనో ఇలా లోదుస్తులు మార్చకపోవడం వల్ల పిరుదుల కిందిభాగంలో గడ్డలు రావచ్చు. ఒక్కోసారి రోమాల మూలాల వద్ద పొక్కుల వంటివి కూడా రావచ్చు. అందువల్ల ఈత పూర్తికాగానే లోదుస్తులు మార్చుకుని వెంటనే పొడిబట్టతో శుభ్రం చేసుకోవాలి.


స్విమ్మింగ్‌పూల్ వల్ల వచ్చే ఇతర సమస్యలు : 

ఫంగల్ ఇన్ఫెక్షన్స్:
 బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రత వల్ల కూడా పాదాలకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

వెంట్రుకలు రంగు కోల్పోవడం:

 నిత్యం స్విమ్మింగ్‌పూల్‌లో ఈదులాడేవారి వెంట్రుకలు సహజరంగును కోల్పోయి పేలవంగా అయ్యే అవకాశాలు ఎక్కువ. క్లోరిన్ రసాయనం బ్లీచ్ చేయడం వల్ల, ఎండ వల్ల వెంట్రుకలు ఇలా మారే అవకాశాలు ఎక్కువ.

మొటిమలు రావడం : 

ఈతకొట్టే వారిలో చాలామందికి మొటిమలు కూడా రావచ్చు. ఈ మొటిమలను ఆక్వాజెనిక్ యాక్నె అంటారు.

కురుపులు రావడం :

 కొన్నిసార్లు ఈత తర్వాత చర్మంపై చిన్నచిన్న గుల్లలు, కురుపులు రావడం మామూలే. కొన్ని సందర్భాల్లో అవి ముదిరి, చీము పట్టే అవకాశాలు కూడా ఎక్కువే. సూడోమొనాస్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గుల్లలు, కురుపులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, క్లోరిన్ ఎక్కువగా వేసినప్పటికీ ఈరకం బ్యాక్టీరియాను నిర్మూలించడం సాధ్యం కాదు. ఈ సమస్య వల్ల గుల్లలు, కురుపులు వస్తే డాక్టర్‌ను సంప్రదించి తగిన యాంటీబయాటిక్స్‌తో చికిత్స తీసుకోవాలి.
  

శ్వాసకోశ సమస్యలు : 
ఈతకొలను వల్ల అలర్జీ రావడం చాలామందిలో సాధారణంగా కనిపించే అంశం. అలాంటివారు డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.

జాగ్రత్తలు...

ఈతకు వెళ్లే సమయంలో కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. అవి...
స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లకముందు, స్విమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయాలి.
ఈతకొలను నీటిలో సరైన పాళ్లలో క్లోరిన్ ఉందో, లేదో గమనించుకోవాలి.
ఈత సమయంలో నేరుగా సూర్యకాంతికి ఎక్స్‌పోజ్ అవ్వకూడదు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top