మధురై అంటే మీనాక్షి ఆలయం ఎప్పుడు కట్టారు? ఎలా కట్టారు?


మధురై అంటే మీనాక్షి ఆలయం, మీనాక్షి ఆలయం అంటే మధురై గుర్తొస్తాయి. విశాలమైన ప్రాంగణం, ఎత్తై గోపురాలు, రంగురంగుల శిల్పాలు కళ్లముందు మెదలుతాయి. ఇంత గొప్ప నిర్మాణాన్ని చేపట్టింది ఎవరో అన్న సందేహమూ కలుగుతుంది. రాజు తలుచుకుంటే తప్ప ఇంత భారీ నిర్మాణం సామాన్యులకు అసాధ్యం అని చెప్పగలం. ఇంతకీ ఆ రాజు ఎవరంటే... కులశేఖర పాండ్యుడు. ఇతడు వైగై నది ఒడ్డున ఈ ఆలయాన్ని, పద్మం ఆకారంలో నగరాన్ని నిర్మించాడు. మధురై రాజధానిగా పాలన సాగించాడు.

ఎప్పుడు కట్టారు? ఎలా కట్టారు?
మధురై రెండున్నర వేల ఏళ్ల నాటి నగరం. ఇందులో ఉన్న ఆలయం ఏడవ శతాబ్దానికి చెందినదని, సంగమ్ సాహిత్యంలో ఈ ఆలయం ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇప్పుడున్న రూపం 17వ శతాబ్దంలో నిర్మాణమైనది. అనేక కాలాల్లో అనేకమంది రాజవంశీయులు దీనిని అభివృద్ధి చేశారనవచ్చు. 45 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఆలయం ఇది. నిర్మాణాల విస్తీర్ణం 258 మీటర్ల పొడవు, 237 మీటర్ల వెడల్పు ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ పన్నెండు గోపురాలు ఉన్నాయి. దక్షిణ గోపురం అన్నింటికంటే పెద్దది(170 అడుగులు). తూర్పు గోపురం పురాతనమైనది. దీనిని మారవర్మన్ సుందరపాండ్యన్ కట్టించాడు. ప్రధాన దైవాలు మీనాక్షీ అమ్మవారు, సుందరేశ్వరుడి గోపురాలకు బంగారు శిల్పాలు ఉన్నాయి. ఇందులో వేయిస్తంభాల మండపం మరింత ఆశ్చరకరం. వేయిస్తంభాల మండపంగా వ్యవహారంలోకి వచ్చిన ఈ మండపంలో నిజానికి 985 స్తంభాలు ఉన్నాయి. ప్రతి స్తంభం ఒక మాన్యుమెంట్ అనాలి. ద్రవిడ శిల్పరీతిలోచెక్కిన శిల్పాలను, పనితనంలో నైపుణ్యాన్ని వర్ణించడం కష్టం. దీనిని మ్యూజియంగా మార్చారు. ఇందులో 12 వందల ఏళ్ల నాటి చారిత్రక వివరాలు, ఫొటోలు, పెయింటింగులు ఉన్నాయి. దీనికి పశ్చిమంగా ‘సరిగమపదని’ పలికే ఏడు సంగీతస్తంభాలు ఉన్నాయి. ఒక్కో పిల్లర్ ఒక్కో స్వరం పలుకుతుంది. వసంతమండపం, ఊంజల్ మండపం, కిల్లికట్టి (చిలుక పంజరం) పుష్కరిణికి పశ్చిమాన ఉంటాయి. అష్టశక్తి మండపం, పుష్కరిణి, చిత్రమండపం, ముక్కురిణి పిల్లియార్ (గణేశుడు) విగ్రహం ప్రతిదీ నిర్మాణ నైపుణ్యానికి ఒక చిహ్నం. ఆలయంలో 33 వేల శిల్పాలు ఉంటాయని లంచనా. ఎటు తల తిప్పినా  అద్భుతమైన శిల్పాలు, అత్యంతనైపుణ్యమైన పనితనమే. నిర్మాణనైపుణ్యపరంగా ఇది ప్రపంచ అద్భుతాల ఎన్నికకు నామినేట్ అయింది. 30 నిర్మాణాల తుది జాబితాలో ఆగిపోయింది.
వాడని పూలగంధం!
ఈ ఆలయానికి చెందిన చారిత్రక సంఘనకు అనుబంధంగా ఆసక్తికరమైన అంశం ఒకటి వ్యవహారంలో ఉంది. 14వ శతాబ్దంలో మాలిక్ కాఫర్ మధుర మీద దాడి చేసి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆ సమయంలో ఆలయ నిర్వహకులు గర్భాలయాన్ని మూసివేశారు. నగరంలో పరిస్థితులు చక్కబడిన తర్వాత తెరిచి చూస్తే మూసివేసిన రోజు శివలింగానికి చేసిన చందనపు అలంకరణ, పూలదండ తాజాగా కనిపించాయని, నూనె దీపాలు వెలుగుతూనే ఉన్నాయని చెబుతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top