ప్రెగ్నెన్సీ టైమ్‌లో లావెక్కుతుంటే...?

కొందరు గర్భవతిగా ఉన్న సమయంలో మరింత బరువు పెరుగుతారు. మరింతగా లావెక్కుతారు. దాని వల్ల తల్లికీ, కడుపులోని బిడ్డకూ ప్రమాదం. ఇరువురికీ ఆరోగ్య సంబంధమైన సమస్యలు వస్తాయి. అంతేకాదు... గర్భవతి కాకముందు లావెక్కడం సైతం భవిష్యత్తులో కొన్ని సమస్యలు కలిగించవచ్చు. మహిళల్లో స్రవించే కొన్ని హార్మోన్లు బిడ్డ పుట్టుక అనే అంశంపై ప్రభావం కలిగించవచ్చు.

గర్భవతుల్లో స్థూలకాయం అంటే... 

మనం ఉండాల్సిన ఎత్తుకు తగినట్లుగా ఉండాల్సిన బరువు కంటే 30 శాతం అదనంగా ఉంటే దాన్ని స్థూలకాయంగా పరిగణించవచ్చు గర్భవతులు బరువు పెరగడం సహజమే. అయితే పెరుగుతున్న కడుపుకు అనుగుణంగా గాక మరింత ఎక్కువగా బరువు పెరుగుతూ ఉంటే దాన్ని స్థూలకాయంగా పరిగణించాలి పిల్లలు పుట్టే వయసు (ఛైల్డ్ బేరింగ్ ఏజ్)లో ఉండే మహిళల్లో దాదాపు 10 శాతం మంది స్థూలకాయం కలిగి ఉంటారు ప్రసవం అయ్యాక వారు ఏడాది వ్యవధిలో క్రమంగా బరువు తగ్గుతుంటారు.

బరువు పెరుగుతున్న గర్భిణిల్లో కనిపించే దుష్ర్పభావాలు:

సాధారణ సమస్యలు:

 ఇతర మహిళల్లో కంటే బరువు పెరుగుతున్న గర్భవతుల్లో సాధారణ ఆరోగ్య సమస్యలైన తలనొప్పి, గుండెమంట, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటివి రావడం పది రెట్లు ఎక్కువ.

ప్రొక్లాంప్సియా: 

మహిళల్లో అధిక రక్తపోటు (హైబీపీ) కలిగించే పరిస్థితిని ప్రొక్లాంప్సియా అంటారు. ఈ పరిస్థితి ఉన్నప్పుడు శరీరంలో ద్రవాలు బయటకు వెళ్లలేకపోవడం, ఒంట్లో వాపు వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ప్రొక్లాంప్సియా అనే సమస్యతో పిండానికి రక్తప్రసరణ తగ్గడం వంటి సమస్యలు వచ్చి ప్రమాదకరంగా పరిణమించవచ్చు.  


జెస్టేషనల్ డయాబెటిస్:
 గర్భవతిగా ఉన్న సమయంలో ఒంట్లో చక్కెర పాళ్లు పెరిగే పరిస్థితిని జెస్టెషనల్ డయాబెటిస్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు కడుపులోని పిండం ఉండాల్సినదానికంటే విపరీతమైన బరువు ఉండవచ్చు.

సిజేరియన్ అవకాశాలు:

 గర్భవతిగా ఉన్నప్పుడు విపరీతంగా బరువు పెరిగిన మహిళల్లో సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ప్రసవం నొప్పులు తక్కువగానూ, దీర్ఘకాలంపాటు వస్తాయి. దాంతో సిజేరియన్ చేయాల్సిన అవసరం కలగవచ్చు.

పోస్ట్‌పార్టమ్ ఇన్ఫెక్షన్స్: 

ప్రసూతి తర్వాత మామూలుగా అయ్యేందుకు పట్టే వ్యవధి కూడా ఎక్కువ. ఇదే సమయంలో ఇక సిజేరియన్ అయితే ఇది మరింతగా పెరుగుతుంది.

బిడ్డకు ఉండే ప్రమాదాలు:

 గర్భవతిగా ఉన్న మహిళకేగాక కడుపులోని బిడ్డకు కూడా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. అవి...

మ్యాక్రోసోమా:

 కడుపులో బిడ్డ అనూహ్యంగా బరువు పెరగడంతో ప్రసవమార్గం (బర్త్ కెనాల్) నుంచి ప్రసవం తేలిగ్గా అయ్యే అవకాశం తగ్గుతుంది. దాంతో ప్రసవ సమయంలో బిడ్డ భుజాలకు గాయం కావచ్చు. ఈ గాయాలను షోల్డర్ డిస్టోనియా అంటారు. 

న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్: 
బిడ్డలో తెలివితేటలు, వికాసానికి అడ్డంకిగా పరిణమించే న్యూరల్ ట్యూబ్ సమస్యలు కావచ్చు. బిడ్డలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అన్నవి సాధారణంగా గర్భధారణ సమయంలోని మొదటి మూడు నెలల పాటు ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఎక్కువగా వస్తాయి. ఈ సమస్యను మొదటి మూడు నెలల్లో అల్ట్రాసౌండ్ పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.

అయితే స్థూలకాయం ఉన్న మహిళల్లో అల్ట్రాసౌండ్ పరీక్షలో కొన్ని సమస్యలు స్పష్టంగా కనిపించకపోవచ్చు. ఫలితంగా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ వంటివి వచ్చినప్పుడు గుర్తించడం కష్టమవుతుంది.


పిల్లల్లో స్థూలకాయం: 

తల్లికి స్థూలకాయం ఉన్నప్పుడు బిడ్డల్లోనూ అది కనిపించే అవకాశాలు చాలా ఎక్కువ.
దీనికి తోడుగా పిల్లల్లో గుండెకు సంబంధించిన సమస్యలు, తలకు నీరు పట్టడం, గ్రహణం మొర్రి వంటి సమస్యలు కూడా ఎక్కువ.

నివారణకు ఏం చేయాలి

గర్భవతిగా ఉన్నవారు మరీ ఎక్కువ బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలి. డాక్టర్ దగ్గర తరచూ బరువు పరీక్షింపజేసుకుంటూ, ఆ టైమ్‌లో తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామంపై అవగాహన కలిగి ఉండాలి. కొద్దిపాటి బరువు తగ్గినా అది ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్‌ను గణనీయంగా తగ్గిస్తుందని తెలుసుకోండి.
  

ముందునుంచీ ఎక్కువ బరువు ఉండేవారు గర్భధారణ జరిగాక అకస్మాత్తుగా బరువు తగ్గకూడదు. అలా ఒక్కసారిగా బరువు తగ్గితే దాని వల్ల బిడ్డకు అందాల్సిన క్యాలరీలు, పోషకాలు తగినట్లుగా అందకపోవచ్చు. అందుకే ఆ టైమ్‌లో పిండం ఎదుగుదలకు కావాల్సిన ఆహారం తీసుకుంటూ ఉండాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top