మీ గుండె సామర్థ్యం గురించి తెలుసుకోండి

గుండె పని చేసే సామర్థ్యం అంచనా వేయడానికి హృద్రోగ చికిత్సలో ప్రధాన భూమిక పోషిస్తుంది. గుండె రక్తాన్ని పంప్ చేయగల సామర్థ్యాన్ని ‘ఎజెక్షన్ ఫ్రాక్షన్ (ఈఎఫ్) అంటారు. హృద్రోగం వచ్చిన చాలా మందికి ‘ఈఎఫ్’ అనే మాట సుపరిచితమే. అంతేకాదు... కొంతమందికి ఎలాంటి గుండెజబ్బు లేకపోయినా ఎకో పరీక్షలో ఈఎఫ్ విలువ తక్కువ అని నిర్ధారణ జరుగుతుంది. అందువల్ల కొందరు ఈఎఫ్ విషయంలో ఆందోళన చెందడం పరిపాటి. అయితే నిజానికి ఈఎఫ్ అంటే ఏమిటి? దాని విలువ ఎంత ఉండాలి... వంటి అనేక అంశాల గురించి అవగాహన కోసం ఈ కథనం. 

మన గుండె కొట్టుకునే ప్రతిసారీ ఊపిరితిత్తుల నుంచి రక్తం అందినప్పుడు అది వ్యాకోచిస్తుంది. ఇలా గుండె వ్యాకోచించడాన్ని ‘డయస్టోల్’ అంటారు. గుండెలోని రక్తం పరిమాణం ఒక మోతాదుకు చేరగానే అది రక్తనాళాల్లోకి పంప్ అయ్యేందుకు వీలుగా సంకోచిస్తుంది. దీన్నే ‘సిస్టోల్’ అంటారు. వ్యాకోచ స్థితిలో రక్తంతో నిండిన గుండె సంకోచించగానే ఆ రక్తం శరీరమంతటికీ సరఫరా అవుతుంది. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. కొట్టుకునే ప్రతిసారీ ఈ సంకోచ వ్యాకోచాల వల్ల మన రక్తనాళాల ద్వారా ప్రతి అవయవానికి రక్తసరఫరా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. 


ఈ సంకోచ వ్యాకోచాల వల్ల గుండె రక్తసరఫరా జరిగే నిర్ణీత సామర్థ్యానికి ఒక సంఖ్యాత్మక రూపమే ఎజెక్షన్ ఫ్రాక్షన్ (ఈఎఫ్). ఒక వ్యాకోచ సమయంలో గుండెకు అందిన రక్తంలో ఎంత మొత్తాన్ని తన సంకోచ సమయంలో పంపుతుందో ఆ మొత్తాన్ని ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. ఈ సామర్థ్యాన్ని శాతంలో చెప్పడం అన్నది శాస్త్రపరమైన రివాజు. 


ఈఎఫ్ అసలు విలువ ఎంత... 


గుండె వ్యాకోచ స్థితిలో అందుకు న్న రక్తంలోని కొంత భాగాన్ని మాత్రమే సంకోచించగానే గుండె రక్తనాళాల్లోకి సరఫరా చేస్తుంది. గుండె కొట్టుకునే ప్రతిసారీ దానికి అందిన రక్తంలో సగభాగం కంటే కాస్త ఎక్కువగానే రక్తనాళాల్లోకి పంపుతుంది. అంటే ఆరోగ్యకరమైన వ్యక్తిలో గుండె ఒకసారి సంకోచించగానే తన వ్యాకోచ సమయంలో అందిన మొత్తంలో సగానికి కాస్తపైనే రక్తాన్ని పంప్ చేస్తుంది కాబట్టి ఈ విలువ 55 శాతం నుంచి 70 శాతం వరకు ఉంటుందన్నమాట. ఆరోగ్యకరమైన వ్యక్తిలో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అన్నది 65 శాతం ఉండాలి. అంటే... గుండెకు వ్యాకోచ సమయంలో అందిన మొత్తంలో 65 శాతాన్ని గుండె సంకోచించగానే రక్తనాళాల్లోకి పంప్ చేస్తుందన్నమాట. ఈ విలువ 40 శాతం కంటే తక్కుగా ఉంటే వారిలో హృదయ స్పందనల వైఫల్యం ఉందని గుర్తించవచ్చు. అంటే అలాంటి వారి కేసులను హార్ట్ ఫెయిల్యూర్‌గా పరిగణించవచ్చు. 


ఈఎఫ్ విలువ 35 శాతం కంటే తక్కువ ఉంటే అలాంటి వ్యక్తుల్లో గుండె స్పందనలు క్రమబద్ధంగా గాక అస్తవ్యస్తంగా ఉండవచ్చు. ఇలాంటి కండిషన్‌ను రిథమ్ ప్రాబ్లమ్స్‌గా గుర్తించవచ్చు. గుండె స్పందనలు అనియంత్రితంగా ఉండి, అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ప్రాణాపాయం కలిగే అవకాశం ఉంది. 


గుండె సామర్థ్యాన్ని అంచనా వేసే పద్ధతులు: 

ఎకో పరీక్ష: ఈ పరీక్ష ద్వారా సాధారణంగా ఈఎఫ్‌ను నిర్ధారణ చేస్తారు. ఈ పరీక్షను అల్ట్రా సౌండ్ వెలువరించే యంత్రం సహాయంతో నిర్వహిస్తారు. ఈ పరీక్షలో కనుగొనే విలువల ఖచ్చితత్వం దాన్ని నిర్వహించే డాక్టర్ లేదా టెక్నీషియన్ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎకో పరీక్ష నిర్వహించే పరికరాలు దాదాపు ఓ మోస్తరు నుంచి కాస్త పెద్ద పట్టణాల్లో కూడా అందుబాటులో ఉన్నాయి.


ఎమ్మారై పరీక్ష: ఈ పరీక్షతో గుండె శక్తిని అంచనా వేసే ప్రక్రియను ఇటీవలే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేస్తున్నారు. గుండె కండరం పటుత్వం కోల్పోయినప్పుడు అది ఏ మేరకు స్వస్థత పొందే అవకాశం ఉందో కూడా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షకు చేయాల్సిన వ్యయం ఎక్కువ. పైగా ఈ పరీక్ష అన్ని చోట్లా అందుబాటులో లేకపోవడం దీని ప్రతికూల అంశంగా చెప్పవచ్చు. 

కార్డియాక్ క్యాథ్: ఈ పరీక్ష ద్వారా కూడా గుండె కండరం సామర్థ్యాన్ని అంచనా వేయడం అన్నది కొన్ని దశాబ్దాలుగా అందుబాటులో ఉన్న ప్రక్రియ. అయితే గత కొన్నేళ్ల నుంచి ఎమ్మారై పరీక్ష అందుబాటులోకి వచ్చాక ఈ కార్డియాక్ క్యాథ్ పరీక్షకు ఆదరణ తగ్గింది. ఈ పరీక్షలో సూదులు, గొట్టాలు ఉపయోగించి గుండె వద్దకు పంపే క్రమంలో అదే ఒక్కోసారి అపాయకరంగా పరిణమించే అవకాశం ఉంది. దానితో పోలిస్తే మరికొన్ని సురక్షితమైన ప్రక్రియలు అందుబాటులోకి వచ్చినందుకు ప్రస్తుతం దీనికి మునపటి అంత ఆదరణ లేదు. కొన్ని న్యూక్లియర్ పద్ధతుల ద్వారా కూడా ఈఎఫ్‌ను అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చినందున ప్రస్తుతం ఈ ప్రక్రియలు కూడా ఆదరణ కోల్పోతున్నాయి. 


సంకోచ లోపం హానికరమా లేక వ్యాకోచలోపమా...? 
హృదయ స్పందన సామర్థ్య లోపం (హార్ట్ ఫెయిల్యూర్) అంటే గుండె కండరం పనిచేయాల్సిన మేరకు పనిచేయలేకపోవడం అనుకోవచ్చు. గుండె సామర్థ్యం అన్నది కేవలం సంకోచ శక్తి మీదే ఆధారపడదు. వ్యాకోచ లోపం వల్ల కూడా హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు. 


వ్యాకోచ లోపం వల్ల వచ్చే హార్ట్ ఫెయిల్యూర్‌లో ఈఎఫ్ విలువ సాధారణంగానే ఉంటుంది. కానీ గుండె సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అంటే ఈఎఫ్ నార్మల్‌గా ఉండి కూడా హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా స్థూలకాయం సమస్య పెరగడం, అనేక మందిలో మధుమేహ వ్యాధి ఉండటం, ఆయుఃప్రమాణాలు పెరగడంతో చాలా మంది వృద్ధుల్లో హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్ ఇప్పుడు సర్వసాధారణమైంది. 


పైగా చాలా కేసుల్లో ఈఎఫ్ విలువ నార్మల్‌గా ఉండటంతో హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం లేదనే ఒక తప్పుడు భరోసా ప్రజలకు, డాక్టర్లకు కలుగుతోంది. ఒక వ్యక్తికి హార్ట్ ఫెయిల్యూర్ పరిస్థితి వస్తే దానికి సంకోచ లోపం లేదా వ్యాకోచ లోపం... ఈ రెండింటిలో ఏదైనా కారణం కావచ్చు. రెండు పరిస్థితుల్లోనూ ప్రమాదం తీవ్రత ఒకేలా ఉంటుంది. రెండూ ప్రాణాపాయం కలిగించవచ్చు. అయితే దురదృష్టవశాత్తు గుండె వ్యాకోచ లోపం వల్ల కలిగే వ్యాధుల విషయంలో చేయాల్సిన చికిత్స పద్ధతులు ఇంకా పరిశోధన స్థాయిలోనే ఉన్నాయి. 

ఈఎఫ్ విలువ లేదా లక్షణాలు... ఈ రెండింటిలో ఏది ముఖ్యం? 


గుండె సామర్థ్యం, లోపాలు తెలుసుకునేందుకు ఈఎఫ్ విలువ ఎంత ముఖ్యమో, బయటకు కనిపించే లక్షణాలు కూడా అంతే ముఖ్యం. కేవలం ఈఎఫ్ విలువ తక్కువైనంత మాత్రాన హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పేందుకు కుదరదు. ఆ విలువ తక్కువగా ఉండి, లక్షణాలు కూడా కనిపిస్తుంటేనే అప్పుడు ఆ రెండు అంశాల ఆధారంగా హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్‌ను నిర్ధారణ చేస్తారు. (కొన్నిసార్లు బీఎన్‌పీ వంటి రక్త పరీక్షలతో హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్‌ను మరింత బాగా అవగాహన చేసుకోవచ్చు). 


ఈఎఫ్ తగ్గుతుంటే చేయాల్సిన చికిత్స... 
ఈఎఫ్ విలువ తగ్గుతూ ఉన్నప్పుడు వెంటనే దగ్గరలోని హృద్రోగ నిపుణుడిని వీలైనంత త్వరగా సంప్రదించాలి ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త మందులతో ఈ కండిషన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ఏసీఈ ఇన్హిబిటార్స్ అనే మందులు ఉపయోగించవచ్చు ఈఎఫ్ విలువ తక్కువ అయినప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రోగులు క్రమం తప్పకుండా హృద్రోగ నిపుణులను సంప్రదిస్తూ దీర్ఘకాలం జీవించే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. 

ఈఎఫ్ విలువ ఫలితం 
55 % నుంచి 70 % సాధారణ స్థితి 
40% నుంచి 55% సాధారణ స్థితి కంటే తక్కువ. 
40% కంటే తక్కువ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం 
35% కంటే తక్కువ గుండె అస్తవ్యస్తంగా కొట్టుకునే అవకాశం (అరిథ్మియాస్) 


ఈఎఫ్ ప్రాధాన్యం... 
వైద్య చికిత్సలో ఈఎఫ్‌ను తెలుసుకోవడం అన్నది చాలా ప్రాధాన్య అంశం. అయితే కొన్ని సందర్భాల్లో ఈఎఫ్ తెలుసుకోవడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈఎఫ్ తెలుసుకున్న సందర్భంలోనూ దాని ఆధారంగా చేయాల్సిన చికిత్స విషయంలోనూ కొన్ని పరిమితులు ఉండవచ్చు. ఈఎఫ్ తక్కువగా ఉన్న ప్రతివారిలోనూ హార్ట్ ఫెయిల్యూర్ రావాలన్న నియమం లేదు. 

అయితే ఈఎఫ్ తక్కువగా ఉండి, వారిలో పాదాల వాపు, ఆయాసం, ముఖం ఉబ్బడం, మెడనరాలు ఉబ్బడం వంటి కొన్ని లక్షణాలు ఉంటే హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న దానికి సూచనగా భావించాల్సి ఉంటుంది. ఇది సంకోచ లోపం లేదా వ్యాకోచ లోపం... ఈ రెండింటిలో దేనివల్లనైనా రావచ్చు. ఇలాంటి హార్ట్ ఫెయిల్యూర్ కనిపించిన వారిలో మందులు ఇస్తున్నా... అవి తాత్కాలికంగానే పనిచేస్తుంటే అలాంటి వారికి ప్రాణహాని జరిగే అవకాశాలు ఎక్కువ అని తెలుసుకోవాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top