వైట్ హెయిర్, బట్టతల ఎందుకు వస్తాయి?

‘ఏదైనా మనకు లేనిదానిపై మక్కువ ఎక్కువ’ అన్నది సూక్తి. మిగతా విషయాల్లో ఏమోగానీ... అవాంఛిత రోమాలను ఎంతగా అసహ్యించుకుంటామో, అవసరమైన చోట కురులు లేకపోయినా అంతే బాధపడుతుంటాం. తలపై జుట్టు లేకపోతే ఆ బాధ అంతా ఇంతా కాదు. సంపద కంటే కేశసంపదకే చాలా మంది ప్రాధాన్యం ఇస్తారు. 

కొందరిలో జుట్టు ఉండి కూడా నెరిసిపోతుంటే అది కూడా బాధే. కానీ ఈ పరిస్థితి ఒకింత మేలు. ఎందుకంటే... జుట్టు ఉండి అది తెల్లబడుతుంటే కనీసం రంగైనా వేసుకోవచ్చు అన్నది చాలా మంది అభిప్రాయం. ఒక వయసు రాకముందే జుట్టు తెల్లబడటాన్ని బాలనెరుపు అంటారు. వెంట్రుకలు ఎందుకు నెరుస్తాయో తెలుసుకుందాం. 

సాధారణంగా మన వెంట్రుకల మూలాన్ని హెయిర్ ఫాలికిల్ అంటారు. ఇక్కడ మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనే కణాలు మెలనిన్ అనే రంగునిచ్చే పిగ్మెంట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ పిగ్మెంట్ వల్లనే వెంట్రుకకు నల్లటి రంగు వస్తుంది. కొన్ని వెంట్రుకల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఫలితంగా ఆ వెంట్రుక నల్లరంగును కోల్పోయి తెల్లగా మారుతుంది. 

నిజానికి వెంట్రుక తెల్లగా మారదు. మెలనిన్ ఇచ్చే నలుపు రంగును కోల్పోవడం వల్ల అది పూర్తిగా కాకుండా, ఒక మేరకు పారదర్శకం (ట్రాన్స్‌లుసెంట్)గా మారుతుంది. అదే నల్లటి వెంట్రుకల నేపథ్యంలో తెల్లగా అనిపిస్తుంది. 

కారణాలు: వెంట్రుకలు తెల్లబడటానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనవి జన్యుపరమైన కారణాలు. తల్లిదండ్రుల్లో ఎవరికైనా వెంట్రుకలు త్వరగా నెరిస్తే పిల్లల్లోనూ అవి త్వరగా తెల్లబడటానికి ఆస్కారం ఉంది. వయసు పెరుగుతున్న కొద్దీ వెంట్రుకలు తెల్లబడటం జరగాలి. కానీ కొందరిలో చాలా త్వరగా వెంట్రుకలు తెల్లగా కావచ్చు. మరికొన్ని కారణాలు... 

విటమిన్ బి-12 లోపం థైరాయిడ్ లోపం రక్తహీనత (అనీమియా) పొగతాగే అలవాటు మితిమీరిన ఒత్తిడి 

వీటికి తోడు కాలుష్యం, పోషకాహార లోపం కూడా కొంతమేరకు తెల్లవెంట్రుకలకు కారణాలే. 
వెంట్రుకలు నల్లబడాలంటే... విటమిన్ బి-12 పుష్కలంగా అందేలా తగినంత మాంసాహారం తినడం ఒకవేళ మీరు శాకాహారులైతే రోజూ గ్లాసుడు పాలు తాగడంతో పాటు, వైటమిన్ బి12 ఎక్కువగా లభించే తృణధాన్యాలు తినడం, అప్పటికీ సరైన మోతాదులో విటమిన్ బి12 అందకపోతే డాక్టర్ సలహా మేరకు వైటమిన్ బి12 అందేలా ట్యాబ్లెట్లు వాడటం అవసరం. 

బట్టతల: పురుషుల్లో బట్టతలకు జన్యుపరమైన కారణాలే ప్రధానమైనవి. దానికి తోడు పిల్లవాడికి యుక్తవయసు వచ్చే నాటి నుంచి అతడిలో స్రవించే పురుష హార్మోన్లు వెంట్రుకలను పలచబారుస్తాయి. ఈ కండిషన్‌ను యాండ్రోజెనిక్ అలొపేషియా అంటారు. పురుషుల్లో యుక్తవయసు వచ్చిన నాటి నుంచి తలవెంట్రుకలు మొదలయ్యే హెయిర్ లైన్ క్రమంగా వెనక్కు జరుగుతుంటుంది. అందుకే పురుషుల్లో దాదాపు 25 శాతం మందిలో యుక్త వయసు నుంచి 30 ఏళ్లు వచ్చే వరకు ఎంతోకొంత జుట్టు పలచబారుతుంది. 

కారణం: పురుషుల్లో కండరాలు బలపడటానికి, ఎముకల సాంద్రత పెరగడానికి ఉపయోగపడే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. అది వెంట్రుకల మూలం అయిన హెయిర్ ఫాలికిల్‌ను ఎంతో కొంత బలహీనపరుస్తుంది. దాంతో వెంట్రుకలు రాలడం పెరిగి జుట్టు పలచబారుతుంది. ఒత్తిడి వంటి మరికొన్ని అంశాలు దీనికి తోడైతే జుట్టు రాలడం మరింత పెరుగుతుంది. 

మందులు: వెంట్రుకలు రాలడాన్ని ఆపేందుకు, మరికొందరు అదృష్టవంతుల్లో వెంట్రుకలు మొలవడానికి దోహదపడే పూత మందులు, నోటి ద్వారా తీసుకునే మందులు కొన్ని అందుబాటులో ఉన్నాయి. అయితే వాటివల్ల దుష్ర్పభావాలు ఎక్కువ. ఉదాహరణకు ఇవి వాడేవారిలో తలనొప్పి, చుండ్రు, మాడు చర్మం మందంగా మారడం, రక్తపోటు తగ్గిపోవడం వంటి అనేక సమస్యలు రావచ్చు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top