డిస్కౌంట్లతో జాగ్రత్త!

ఈ మధ్య ఎక్కడ చూసినా ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్ల ప్రకటనలు ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితం. ఒక ప్యాంట్ కొంటే మరో ప్యాంట్ ఉచితం. ఒక షర్టుకు రెండు షర్టులు ఫ్రీ. వేసవి బంపర్ ఆఫర్. ఒక కూలింగ్ గ్లాసెస్‌కు మరొకటి ఫ్రీ. ఈ ప్రకటనలు చూసి టెంప్ట్ అయ్యామంటే మన జేబులు ఖాళీ! ఎందుకంటారా? కాస్త నిదానంగా ఆలోచిస్తే ఈ బంపర్ ఆఫర్‌లోని మర్మం మీకే తెలుస్తుంది. మీరు మామూలుగా ఒక రెడీమేడ్ బట్టల షాపులోకి వెళ్లి ఒక బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్ ధర ఎంతో కనుక్కోండి. ఇంకో షాపులోకి వెళ్లి అదే జీన్స్ రేటెంతో చూడండి.

ఆ ధరలో తేడాలేమైనా ఉన్నాయేమో గమనించండి. సాధారణంగా బ్రాండెడ్ కంపెనీల ధరలలో తేడాలు ఉండవు. వాటి మీద స్టిక్కర్‌లో ధర కంపెనీ ముద్రించిందే ఉంటుంది. సరే..ఇక్కడి నుంచి భారీ డిస్కౌంట్ ఇస్తున్న షోరూమ్‌కు వెళ్లండి. అక్కడ మీకు కావలసిన బ్రాండెడ్ జీన్స్ ప్యాంట్ ఉందేమో చూసి దాని ధర తెలుసుకోండి. సాధారణంగా ఒన్ ప్లస్ ఒన్ ఆఫర్లు ఇచ్చే షాపులు బ్రాండెడ్ కంపెనీల డ్రస్సులను అమ్మవు. లోకల్ మాల్‌నే బ్రాండెడ్‌గా చెలామణి చేయడానికే వీరు మొగ్గు చూపుతుంటారు. మీ అదృష్టం బాగుండి మీక్కావలసిన బ్రాండెడ్ కంపెనీ ప్యాంటే ఉందనుకోండి..దాని ధరను చూసి మీకు కరెంట్ షాక్ కొట్టడం ఖాయం.



ఎందుకంటే దానిమీద ధర అసలు కన్నా రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటే ఇలానే ఉంటుంది. మనకు ముఖ్యంగా రెడీమేడ్ గార్మెంట్స్‌కు సంబంధించే ఇలాంటి ఆఫర్లు కనిపిస్తుంటాయి. దుస్తులు అమ్మితే నిజంగానే అంత లాభం ఉంటుందా? ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తున్న ఈ దుస్తులనే మనం ఇంతకు ముందు పూర్తి డబ్బులు చెల్లించి కొనుగోలు చేసి ఉంటాం. అంటే అప్పుడు మనం మోసపోయినట్లా? షాపు యజమాని లాభపడినట్లా? ఇప్పుడు అతగాడు నష్టపోతున్నట్లా? ఇందులో ఏది నిజం? ఇందులో తికమకపడడానికి ఏమీ లేదు.

ఏ వ్యాపారి నష్టానికి వ్యాపారం చేయడు. బ్రాండెడ్ కంపెనీలకు డిస్కౌంట్ ఇవ్వాలంటే కంపెనీ షోరూములే వాటిని ఇస్తుంటాయి. అక్కడ మోసానికి తావు ఉండదు. కంపెనీ షోరూమ్ కాబట్టి ప్రైజ్ ట్యాగ్‌లో జిమ్మిక్కులు చేయలేవు. ఉదాహరణకు బంగారాన్నే తీసుకోండి. బంగారం షాపు వాళ్లెవరూ డిస్కౌంట్లకు బంగారాన్ని అమ్మరు. దాని ధర ఏరోజుకారోజు నిర్ణయించబడుతుంది. బంగారం షాపు యజమానులు చేసేదల్లా తరుగు, మేకింగ్ చార్జెస్, ట్యాక్సులు వేసి బంగారు నగలను అమ్ముతారు. మనం చూడాల్సిందల్లా మనం కొనేది ఏమేరకు ఒరిజినల్ బంగారమని..అదే దుస్తుల విషయానికి వస్తే.. బ్రాండెడ్ కాని దుస్తులు ఏ ధరకు అమ్మినా ఎవరూ గుర్తు పట్టలేరు.


అందుకే ఎక్కువ ధర వేసి దానికి డిస్కౌంట్ అనే పేరు పెట్టి అంటగట్టడానికి వ్యాపారులు ప్రయత్నిస్తుంటారు. ఓల్డ్ స్టాక్‌ను వదిలించుకోవడానికి కొన్నిసార్లు బ్రాండెడ్ కంపెనీలు ఇటువంటి డిస్కౌంట్‌లను ప్రకటిస్తుంటాయి. కొన్ని బ్రాండెడ్ షూలు అలా డిస్కౌంట్‌లో లభిస్తుంటాయి. 

అయితే మనకు కనిపించని చిన్న లోపాలు అందులో ఉంటాయన్నది చిదంబర రహస్యం. చెప్పులు, షూలు, దుస్తులు ఎక్కువ కాలం స్టాక్ ఉండిపోతే పాడైపోతాయి. అందుకే వాటిని త్వరగా వదిలించుకోవడానికి దుకాణదారులు ప్రయత్నిస్తుంటారు. 10, 20 శాతం డిస్కౌంట్‌తో లభించే వస్తువులైతే ఆలోచించవచ్చు కాని మరీ ఒన్ ప్లస్ ఒన్, 50 శాతం డిస్కౌంట్ వంటి ఆఫర్లకు మాత్రం లొంగిపోయారో...మీరు కొనే వస్తువు నాణ్యతను సందేహించాల్సిందే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top