ఎల్‌ఐసీ-ఆర్‌డీ-పీపీఎఫ్... ఏది మేలు?

మీరు ప్రతి నెలా వెయ్యి రూపాయలు పొదుపు చేయాలనుకోండి. మొదట మీరు ఆలోచించేది ఎందులో దాస్తే ఎక్కువ డబ్బు వస్తుందని! ఎవరైనా అదే ఆలోచిస్తారు. చిన్న మొత్తాల పొదుపుదారులకు ఉన్న ప్రధాన అవకాశాలు రికరింగ్ డిపాజిట్, పీపీఎఫ్, ఎల్‌ఐసీ. పీపీఎఫ్, ఆర్డీ అకౌంట్లను పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఓపెన్ చేయొచ్చు. ఇది కాకుండా ఎల్‌ఐసీ ఎండోమెంట్ పాలసీలో ప్రతి నెలా కొంత మదుపు చేయవచ్చు. ఈ మూడింటిలో అసలుకు గ్యారెంటీ ఉంటుంది. అయితే, వీటిలో ఎందులో మదుపు చేస్తే ఎక్కువ లాభమొస్తుందో చూద్దాం. సొమ్ము: రూ.1,000, కాలం : 20 ఏళ్లు. 

జీవన్ సరళ్ (ఎల్‌ఐసీ): నెలనెలా రూ.వెయ్యి పొదుపు చేస్తే 20 ఏళ్లకు మీ సొమ్ము 2,40,000 అవుతుంది. మెచ్యూరిటీ అయిన సొమ్ము, లాయల్టీ బోనస్ రెండూ కలిపితే మీకు సుమారుగా రూ.3,50,000 వస్తుంది. దీనిపై ఏ పన్నూ ఉండదు. పాలసీ కాలంలో అనుకోనిది జరిగితే రెండున్నర లక్షల జీవిత బీమా ఉంటుంది.

రికరింగ్ డిపాజిట్ (పోస్టాఫీసులు, బ్యాంకులు): ఒక ఆర్డీ అకౌంట్‌ను పదేళ్లకు మించి మదుపు చేసే అవకాశం లేదు. ఉంది అనుకుని మనం లెక్కవేస్తే ఎంతొస్తుందో చూద్దాం. ప్రస్తుతం బ్యాంకులు దీర్ఘకాలపు ఆర్డీకి సుమారు 8 శాతం వడ్డీని ఇస్తున్నాయి. ఆ లెక్కన మొత్తం అటు ఇటుగా ఆరు లక్షలు వస్తుంది. వీటిలో ఆర్జించే వడ్డీ మీద పన్ను కట్టాలి. అది సుమారుగా ఓ లక్ష రూపాయలు అనుకున్నా ఇంకా ఐదు లక్షలు ఉంటుంది. అంటే మీ సొమ్ము రెట్టింపయింది.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) : ప్రతి నెలా వెయ్యి పొదుపు చేస్తే మీరు కట్టిన సొమ్ము, వడ్డీ కలిపి మొత్తం సుమారు ఆరు లక్షలు అవుతుంది. ఇందులో ఉన్న వెసులు బాటు ఏంటంటే మీకొచ్చే వడ్డీపై పన్ను ఉండదు. కాబట్టి మీకొచ్చిన మూడున్నర లక్షల రూపాయల వడ్డీపై ఏ పన్నూ ఉండదు. పైగా పీఎఫ్ అకౌంటున్న వ్యక్తి అప్పుల్లో కూరుకుపోయి ఎవరైనా అతడి ఆస్తులు జప్తు చేయాల్సి వస్తే అది పీపీఎఫ్‌లో పెట్టిన సొమ్ముకు వర్తించకుండా చట్టం ఉంది. కాబట్టి మీ ఆస్తులన్నీ జప్తు అయినా ఈ సొమ్ము మిగిలి ఉంటుంది. మూడింటి వివరాలు కళ్ల ముందున్నాయి కదా... ఇందులో ఏది ఎక్కువ లాభమో మీరే నిర్ణయించుకోండి.


నోట్: మెచ్యూరిటీ సొమ్ములో స్వల్ప తేడాలు ఉండొచ్చు. వెసులు బాటు కోసం రౌండ్ ఫిగర్ చేశాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top