రాజాలాంటి జలపాతం-గ్రేట్ వాటర్ ఫాల్స్-జోగ్ జలపాతం


జోగ్ ఫాల్స్... ఇది ప్రపంచ ప్రసిద్ధి చెందిన జలపాతం. ఇక్కడ నీరు రాజా, రాణి, రాకెట్, రోరర్... అని నాలుగు పాయలుగా నేలను తాకుతుంది. కొండ మీద నుంచి లోయలోకి జారుతున్న ప్రవాహంలో దేనికది ప్రత్యేకంగా ఉంటుంది. రాజా పాయ చాలా హుందాగా నేలను తాకుతున్న నీటి ప్రవాహం అయితే రాణి పాయ జాలువారుతున్న తీరు సుతిమెత్తగా, వయ్యారంగా అడుగులు వేస్తున్న నాట్యకారిణిని తలపిస్తుంది. రాకెట్ పాయలో నీరు ఎక్కువ మోతాదులో భూమిని చేరుతుంది కానీ పాయ చాలా సన్నగా ఉంటుంది. ప్రవాహ వేగం నింగిలోకి వెళుతున్న రాకెట్‌ను గుర్తుచేస్తుంది. ఇక నాలుగో పాయ రోరర్... ఇది కూడా చిన్న పాయ అయినా ఇది చేసే శబ్దం చిన్నది కాదు. ఈ చప్పుడు పులి గర్జనను పోలి ఉంటుందని ఈ పేరు స్థిరపడింది.


జోగ్ జలపాతం కర్నాటక రాష్ట్రం షిమోగా జిల్లా సాగర అనే ప్రదేశానికి 30 కి.మీల దూరంలో ఉంది. బెంగళూరు నుంచి 380 కి.మీల దూరం ఉంటుంది. 253 మీటర్ల ఎత్తు నుంచి నేలకు జాలువారుతోన్న ఈ జలపాతాన్ని చూస్తుంటే మనల్ని ఏదో మాయ కమ్మేసిందా అన్నంత భ్రమలో పడిపోతాం. జలపాతం మాత్రమే కాదు దాని పరిసరాలు కూడా అంతే అందంగా ఉంటాయి. ప్రకృతి ప్రసాదించిన వరం అనే చెప్పాలి. శరావతి నది నీరు ఇక్కడ జలపాతంగా నేలను తాకుతోంది. ఏడాది పొడవునా ఆగని జలపాతం ఇది. వేసవిలో ప్రవాహ వేగం తగ్గుముఖం పట్టి సన్నని పాయలుగా ఉంటుంది. వర్షాకాలంలో మేఘాలు సమూహంగా వచ్చి వర్షిస్తున్నాయా అనిపిస్తుంది. తెల్లని నురగలతో నీటి ప్రవాహం... ప్రవాహ వేగానికి గాల్లోకి లేచే మంచుబిందువులు ప్రదేశాన్ని పొగమంచులా కప్పేస్తాయి. ప్రబంధ కవులు ఇక్కడికి వచ్చారంటే... గంగా మాత ఆకాశం నుంచి భూమాతను పరామర్శించడానికి వచ్చే క్రమంలో ఒలికిన తుషార, తుహీన, నీహారికల సమ్మేళనం... అంటూ బరువైన పదాలతో అందమైన భావాన్ని పద్యాలల్లేస్తారు. అంతటి అందమైన ప్రదేశమే మరి. 

ప్రస్తుతం మనదేశంలో ఎత్తై జలపాతాల జాబితాలో జోగ్‌ది రెండవ స్థానం. ఇటీవల మేఘాలయలోని నోహకాలికాయ్ ఫాల్స్‌ను గుర్తించారు. అప్పటి వరకు మనదేశంలో ఎత్తై జలపాతం హోదా జోగ్‌దే. అప్పుడు ప్రపంచంలో ఎత్తై జలపాతాల్లో ఇది రెండవ స్థానంలో ఉండేది. ఇంతకంటే ఎత్తైవి ఉన్నప్పటికీ అవి ఏడాది పొడవునా నిరంతరాయంగా జాలువారే జలపాతాలు కావు. పైగా దీనికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే... సాధారణంగా జలపాతాలన్నీ ఎక్కడోపుట్టి... ఎక్కడో పెరిగి అన్నట్లు... కొండ కోనల్లో ప్రవహిస్తూ... కొండవాలును ఆధారంగా చేసుకుని భూమి మీదకు దూకుతుంటాయి, కానీ జాగ్‌మాత్రం శరావతి నది ప్రవాహం ఒక్కసారిగా 829 అడుగుల ఎత్తు నుంచి నేలకు తాకుతుంది. 



పశ్చిమ కనుమలలో పుట్టిన శరావతి నది వాయవ్యంగా ప్రవహిస్తూ హోనావర్ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. దీని ప్రవాహ నిడివి 95 కి.మీలు మాత్రమే. ఇక్కడ మరో రికార్డు కూడా ఉంది. నది హోదా సంతరించుకున్న చిన్న నది ఇదే. శరావతిని బారాగంగ, జెరుసొప్ప నది అని కూడా ఉంటారు. ఈ నది నుంచి జాలువారిన జలపాతం కాబట్టి జోగ్ జలపాతాన్ని జెరుసొప్ప జలపాతం అని కూడా వ్యవహరిస్తారు. జలపాతం అందాన్ని ఆసాంతం వీక్షించడానికి అనువుగా జలపాతం ఎదురుగా ప్లాట్‌ఫామ్ కట్టింది కర్నాటక పర్యాటక శాఖ.

ఆగస్టు - డిసెంబరు మధ్యలో జలపాతం ఉద్ధృతి పెరిగి ఎటు చూసినా నీరే అన్నట్లు... ప్రకృతి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. జూన్ - సెప్టెంబరు మధ్యలో వెళ్తే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది, ఫాల్స్ వేగం కూడా మనోల్లాసంగా అనిపిస్తుంది.

జోగ్ వాటర్‌ఫాల్స్ సమీపంలో కర్నాటక రాష్ట్ర పర్యాటక శాఖ హోటల్ మయూర జెరుసొప్ప హోటల్ ఉంది. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top