హిమాలయ పర్వతాలలోని అద్భుతమైన క్షేత్రం అమరనాథ్. ఈ హిమలింగ క్షేత్రం కాశ్మీర్ రాజధాని శ్రీనగర్‌కి 141 కి.మీల దూరంలో ఉంది. అమర్‌నాథ్ యాత్ర శ్రమతో కూడుకున్నది. అయినప్పటికీ సుందర ప్రకృతి దృశ్యాలు శ్రమను మరిపిస్తాయి. సముద్రమట్టానికి 14, 500 అడుగుల ఎత్తులో ఉన్న అమర్‌నాథ్ గుహలో ఏటా మంచుతో లింగం ఏర్పడుతుంది. భక్తులు శ్రావణపౌర్ణమి నాడు ఈ లింగాన్ని దర్శించుకుంటారు. ఏటా ఈ యాత్రను జమ్ముకాశ్మీర్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. యాత్రలో ఊహించని వాతావరణ పరిస్థితులు ఎదురవుతుంటాయి. శ్రీనగర్‌కి 90కి.మీల దూరంలో పహల్‌గావ్ ఉంది. అక్కడి నుంచి చందన్ వాడీ, పిస్నటాప్, శేషనాగ్, పంచతరణి మీదుగా అమర్‌నాథ్ గుహకు చేరాలి. ఈ గుహ 150 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు ఉంటుంది. అమర్‌నాథ్ మంచులింగానికి ఇరువైపులా రెండు చిన్న మంచులింగాలు ఏర్పడతాయి. వాటిని పార్వతి, విఘ్నేశ్వరుల ప్రతిమలుగా భావిస్తారు. సాహసోపేతమైన ఈ యాత్ర అద్భుతమైన అనుభూతిని మిగులుస్తుంది.

