హోమియో పద్ధతిలో కాన్‌స్టిట్యూషన్ థెరపీ అంటే ఏమిటి? ఈ పద్ధతి ద్వారా వ్యాధి ఎలా నయమవుతుంది?

కాన్‌స్టిట్యూషన్ విధానం ద్వారా మందులు ఇవ్వడం అంటే ఒక వ్యక్తి మానసిక, శారీరక పరిస్థితులే కాకుండా వారి భావోద్వేగాల పరిధిని కూడా పూర్తిగా అర్థం చేసుకుని మందులు ఇవ్వడం అన్నమాట. మెటీరియా మెడికా పుస్తకంలో ఏ వ్యాధికి ఏ మందు అని చదివి మందులు ఇవ్వడం అంటే కేవలం శారీరక అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం. మానసిక, భావోద్వేగాల పరిస్థితిని సరిగ్గా అవగాహన చేసుకోవడానికి మనస్తత్వశాస్త్రం తెలిసి ఉండాలి. శారీరకస్థితిని అర్థం చేసుకోవాలంటే వ్యాధులకు సంబంధించిన పూర్తి అవగాహన అవసరం. ఒకసారి మానసిక, భావోద్వేగ, శారీరక స్థితులను తెలుసుకున్న తర్వాత వాటిని బట్టి కాన్‌స్టిట్యూషన్ మెడిసిన్‌ను నిర్ణయించాలి. తర్వాత ఏయే పొటెన్సీలో ఎంత డోస్ ఇవ్వాలో నిర్ణయించడమనేది ముఖ్యం. కాబట్టి హోమియో ఫిలాసఫీ, హోమియో ఫార్మసీ తెలిసి ఉండాలి. మయాజమ్ (సోరిక్, సైకోటిక్, సిఫలిటిక్)ను బట్టి పొటెన్సీని నిర్ణయించి మందు ఇచ్చిన తర్వాత వ్యక్తిలో కనబడే లక్షణాలను బట్టి, ఇచ్చిన మందు సరైనదా కాదా అని నిర్ణయించుకుని రెండోసారి మందు ఇవ్వడం కీలకమైన అంశం. 

పూర్తిగా వ్యాధి తగ్గుతుందని ఎలా తెలుస్తుంది... 
కాన్‌స్టిట్యూషన్ విధానం ద్వారా సరైన మందులు, పొటెన్సీ డోస్ ఇచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు తగ్గుదల తప్పకుండా హెరింగ్స్ నియమాలను పాటించాలి. 

హెరింగ్స్ నియమాలు : డాక్టర్ హెరింగ్స్ అనే అమెరికన్ శాస్త్రవేత్త ఈ నియమాలను రూపొందించారు. కాన్‌స్టిట్యూషన్ మందు ఇచ్చినప్పుడు వ్యాధి లక్షణాలు శరీర భాగాల్లో పైనుంచి కిందికి తగ్గుతాయి. అంటే తల నుంచి కాళ్ల వరకు. శరీర మధ్యభాగం నుంచి చివరి వరకు. అతి ముఖ్యమైన భాగాల నుంచి స్వల్ప, ముఖ్య భాగాల వరకు అంటే ఉదాహరణకు మెదడు నుంచి చర్మం వరకు. వ్యాధి సోకినప్పుడు కనిపించిన మొదటి లక్షణం... చికిత్స ఇస్తున్నప్పుడు అది ఆఖరున తగ్గుతుంది. 


అలాగే ఫిలాసఫీ ప్రకారం చెప్పాలంటే సిఫిలిటిక్ మయాజమ్ నుంచి సోరిక్ మయాజమ్‌లోకి లక్షణాలు తగ్గాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కాన్‌స్టిట్యూటషన్ విధానంలో మందులు ఇస్తే ముందుగా తలపై ఉన్న పొలుసులు తగ్గాలి. మానసిక స్థితి బాగుపడాలి. అంటే రోజువారీ పనులు... ఆకలి, నిద్ర, కాలకృత్యాలు సరికావాలి. ఆ తర్వాత చేతులు, కాళ్లపై ఉన్న పొలుసులు తగ్గిపోవాలి. అలాగే సోరియాసిస్‌లో వచ్చే కత్తికోసినట్టుగా పడే గాట్లు, రక్తం కారడం ముందుగా తగ్గాలి. తర్వాత పొలుసులు తగ్గి దురద తగ్గాలి (అంటే సిఫిలిటిక్ మయాజమ్ నుంచి సోరిక్ మయాజమ్ వైపు లక్షణాలు తగ్గడం). 

పై విధంగా హెరింగ్స్ నియమాలను పాటిస్తే, లక్షణాలు తగ్గడంతో పాటు శరీరానికి హాని కలిగించే వ్యర్థ పదార్థాలు, అంటే... విరేచనాలు, దగ్గు, తుమ్ములు, చెమట, ముక్కు నుంచి కారే నీటి ద్వారా ఇలా ఏదో ఒక రూపంలో బయటకు వచ్చేయడం గమనిస్తాం. ఇలాంటి లక్షణాలను బట్టి వ్యాధి పూర్తిగా నయమయ్యిందని నిర్ణయిస్తాం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top