ఎన్నో వ్యాధులను తగ్గించే శక్తి, మరెన్నో దీర్ఘరోగాలను నివారించే సామర్థ్యం మన వంటగది కి ఉంది అది ఎలాంటే .....

  లవంగాలు (దేవకుసుమ): వీటిని వేయించి, చూర్ణించి (పొడి చేసి) తేనెతో కలిసి తాగితే దగ్గు, కఫం తగ్గుతాయి. లవంగాలను చల్లని నీళ్లతో నూరి, వడగట్టి, పటికబెల్లంతో సేవిస్తే కడుపులో మంట తగ్గుతుంది. గర్భిణీలకు వాంతులు తగ్గుతాయి. లవంగతైలాన్ని పైపూతగా రాస్తే పిప్పిపన్ను నొప్పి తగ్గుతుంది. నీటితో ముద్దగా చేసి పట్టువేస్తే తలనొప్పి తగ్గుతుంది. 

దాల్చిన చెక్క (త్వక్): దీన్ని చాలా స్వల్పప్రమాణంలోనే ఉపయోగించాలి. చూర్ణాన్ని సేవిస్తే ఆకలిపుట్టి అజీర్తిని పోగొడుతుంది. వాయువును హరిస్తుంది. శుక్రాన్ని పెంచుతుంది. రక్తంలో కొవ్వును కరిగిస్తుంది. 

ఆవాలు (సర్షప): చాలా పుష్టికరం. ఐరన్, జింక్, క్యాల్షియం, ప్రొటీన్లు, మాంగనీస్ వంటి పోషకాలకు నిధి. చెంచాడు ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఉబ్బసం (ఆస్తమా) నుంచి ఉపశమనం కలుగుతుంది. ప్లీహవృద్ధి (స్ప్లీన్ వ్యాకోచం) తగ్గుతుంది. ఆవచూర్ణంతో ఒంటికి నలుగుపెడితే చర్మానికి కాంతి వస్తుంది. ఆవనూనె పూస్తే తలమీద వెంట్రుకలు ఒత్తుగా పెరిగి, చుండ్రు, పేలు పోతాయి. చూర్ణాన్ని బెల్లంతో కలిపి సరైన మోతాదులో వాడితే పిల్లల్లో పక్కతడిపే అలవాటు (శయ్యామూత్రం-బెడ్‌వెట్టింగ్) తగ్గుతుంది. 

మిరియాలు (మరిచ): ఈ పొడిని పాలు చక్కెరతో సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. కంఠశుద్ధి జరుగుతుంది. మిరియాలు, జీలకర్ర చూర్ణాలను తేనెతో సేవిస్తే పైల్స్ (అర్మోవ్యాధి) తగ్గుతాయి. తేలు, జెర్రి వంటి విషకీటకాలు కుడితే మిరియాలను ఉల్లిపాయ రసంతో అరగదీసి చర్మంపై (కుట్టినచోట) పట్టువేయాలి. మిరియాలతో చేసిన తైలం చర్మరోగాలను తగ్గిస్తుంది. (ఈ తైలాన్ని పైపూతగా వాడాలి). 

వాము (అజామోద): దీన్ని పొడిచేసి, సైంధవ లవణంతో కలిపి, నిమ్మరసంతో సేవిస్తే కడుపునొప్పి తగ్గి, జీర్ణక్రియ పెరుగుతుంది. వాము నమిలితే నోటి దుర్గంధం పోతుంది. వాముకషాయం తాగితే అజీర్తి విరేచనాలు, నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. 

నువ్వులు (తిల): ఆయుర్వేదంలో ‘తైలం’ అంటే నువ్వులనూనె అని అర్థం. దీన్ని శరీర మర్దనానికి (మసాజ్) వాడవచ్చు. చర్మకాంతి పెరిగి, బరువు తగ్గుతారు. వాతనొప్పులు తగ్గుతాయి. కడుపులోకి తీసుకోవడం వల్ల మేదోరోగం (స్థౌల్యం) తగ్గుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. వృద్ధాప్యంలో వచ్చే ముడుకుల నొప్పుల నివారణకు ఉపయోగపడుతుంది. రెండు చెంచాల నువ్వుల నూనెలో కొంచెం వేడిచేసిన ఇంగువ కలిపి గ్లాసుడు పాలతో బహిష్టు సమయంలో తాగితే ముట్టుశూల (నొప్పి) తగ్గుతుంది. నువ్వుల పప్పును బెల్లంతో కలిపి రోజూ తింటే శరీరానికి చక్కటి శక్తి వస్తుంది. దీంట్లో క్యాల్షియమ్ అధికంగా ఉంటుంది. 

కుంకుమపువ్వు (కుంకుమమ్): ఇది చాలా ఖరీదైన ద్రవ్యం. 200 మి.గ్రా. ద్రవ్యాన్ని పాలు, చక్కెరతో సేవిస్తే చర్మకాంతి పెరుగుతుంది. రక్తశుద్ధి చేస్తుంది. వాపులను తగ్గిస్తుంది. కడుపులో క్రిములు నాశనమవుతాయి. కంటిచూపు వృద్ధికి ఉపయోగపడుతుంది. శిరోరోగాలను నివారిస్తుంది. మహిళలలో నెలసరిని చక్కదిద్దుతుంది. పురుషత్వాన్ని పెంచుతుంది. దీనితో తయారుచేసిన కుంకుమాదిలేపం ఆయింట్‌మెంట్ ఆయుర్వేద దుకాణాలతో లభిస్తుంది. దీన్ని వాడితే మొటిమలు, చర్మం మీద రకరకాల మచ్చలు తగ్గి చర్మం నిగనిగలాడుతుంది. 

బెల్లం (గుడం): దీంట్లో ఐరన్, క్యాల్షియమ్ మెండుగా ఉంటాయి. బెల్లాన్ని మిరియాన్ని కలిపి చేసిన పానకం తాగితే ఆకలి పుడుతుంది. పెరుగుతో కలిపి సేవిస్తే బలం కలుగుతుంది. కొన్నిసార్లు దెబ్బలు తగిలినప్పుడు గాయం కాకుండా కేవలం వాపు, నొప్పి కలుగుతుంటాయి (స్ప్రెయిన్). ఇలాంటప్పుడు బెల్లం, శుంఠి చూర్ణం కలిపి తింటే వాతనొప్పులు తగ్గుతాయి. బెల్లం, పసుపు, కొద్దిగా కరక్కాయ చూర్ణం కలిపి దంచి రెండు గ్రాముల మోతాదులో తియ్యటి మజ్జిగతో పాటు నిత్యం సేవిస్తే మొలలు (పైల్స్) తగ్గుతాయి. 

తేనె (మధు): దీనికే మాక్షిక, క్షాద్ర, సారఘు వంటి పర్యాయపదాలెన్నో ఉన్నాయి. ఇది రకరకాలైన పుష్పాల మకరందాన్ని తేనెటీగలు సేకరించి ఒక చోట పొందుపరచడం వల్ల లభించే ద్రవ్యం. కాబట్టి వ్యాధి క్షమత్వక శక్తిని అమోఘంగా వృద్ధి చేస్తుంది. నవజాత శిశువులకు తేనెను నాకించడంలోని ఆంతర్యమిదే. ఇది చాలా తేలికగా, శీఘ్రంగా జీర్ణమై, శక్తిని ప్రసాదిస్తుంది. 

సమస్త స్రోతస్సులలోకి అత్యంత వేగంగా చొచ్చుకుపోతుంది. స్థౌల్యాన్ని పోగొడుతుంది. పరగడుపున నిమ్మరసం, వేడినీళ్లతో కలిపి తాగితే మంచిది. వీర్యాన్ని, మేధస్సును వృద్ధి చేస్తుంది. కంటిచూపు, శరీరకాంతి మెరుగుపడతాయి. నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. ఆకలి పుడుతుంది. మొలలు, దగ్గు, ఆయాసం, కఫం, ఎక్కిళ్లు, తృష్ణ (దప్పిక), కడుపులోని క్రిములు వంటి వికారాలను తగ్గిస్తుంది. తేనె, సున్నం, కలిపి పట్టువేస్తే వాపులు, సెగగడ్డలు తగ్గుతాయి. ఆయుర్వేదంలో ఇంచుమించు అన్ని మందులకు తేనెను అనుపానంగాగాని, సహపానంగా గాని వాడుతారు. 

పెరుగు (దధి) / మజ్జిగ (తక్రం): ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి శ్రేష్ఠం. పెరుగు, మజ్జిగ చాలా బలకరం. పెరుగును మజ్జిగగా చిలికి వాడటం వల్లనే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మజ్జిగ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. సూర్యోదయం కాకుండా తెల్లవారుఝామున పెరుగన్నం తింటే మైగ్రేన్ తలనొప్పికి మంచి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ, సైంధవ లవణం, వాముచూర్ణం కలిపి తాగితే ఆర్శమొలల రక్తస్రావం తగ్గుతుంది. మజ్జిగను బార్లీ నీటితో కలిపి తాగితే మూత్రం సాఫీగా అయి, మంటను తగ్గిస్తుంది. 

గసగసాలు (అహిఫేన బీజాలు): దీన్ని చాలా జాగ్రత్తగా, అతి తక్కువ మోతాదులో సేవిస్తే అతిసారం తగ్గుతుంది. వీర్యవృద్ధి జరుగుతుంది. ఈ చూర్ణాన్ని కొబ్బరినూనెలో కలిపి మరిగించి, వడబోసి... ఆ మిశ్రమాన్ని తలకి రాసుకుంటే చుండ్రు తగ్గుతుంది. శిరోభారం తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. 

పుదీనా ( పూతిశాక): ఇది స్వల్ప ప్రమాణంలో వాడితే ఆకలి పెరుగుతుంది. అజీర్తి తగ్గుతుంది. కడుపులో క్రిములు, కడుపునొప్పి, గ్యాస్ తగ్గుతాయి. దీని నుంచి తీసిన నూనెను పూతగా పూస్తే కండరాల నొప్పులు 
తగ్గుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top