మహిళలూ... ఒకవేళ మీకు అలవాటు లేకపోతే... రెండు ఆపిల్స్ తినటం అలవాటు చేసుకోండి

‘యాన్ ఆపిల్ ఎ డే... కీప్స్ ద డాక్టర్ అవే...’ అన్న ఇంగ్లిష్ సామెత చాలామందికి తెలిసిందే. ప్రతిరోజూ ఒక ఆపిల్ తింటే అది వైద్యుడి అవసరం రాకుండా చేస్తుందన్నది ఆ సామెత సారాంశం. అయితే దీనికి మరింత శాస్త్రీయతను జోడిస్తూ... కాస్త సవరిస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. వారు కేవలం ఒకటికి బదులు రెండు తినమంటూ ఆ సంఖ్యను చక్కదిద్దుతున్నారంతే. 

ప్రతి రోజూ రెండు ఆపిల్స్ తినే మహిళల్లో రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గి వారిలో గుండెజబ్బులు నివారితమవుతాయని ఇటీవలే పరిశోధకులు తెలుసుకున్నారు అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. మెనోపాజ్ దశ దాటిన మహిళల్లో ఆపిల్స్ కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడంతో పాటు, రక్తంలో కొవ్వు పాళ్లు తగ్గిస్తాయి. ఫలితంగా గుండెపోటు నివారణ సాధ్యమవుతుంది. రోజూ రెండు ఆపిల్స్ తినే మహిళల్లో గుండెజబ్బులకు, పక్షవాతానికి కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌లోని ఒక రకం అయిన లైపోప్రోటీన్ పాళ్లు బాగా తగ్గాయని తేలింది.

ఫ్లోరిడా స్టేట్ వర్సిటీకి చెందిన పరిశోధకులు 160 మంది మహిళలను ఎంపిక చేసుకున్నారు. వారికి ఏడాది పాటు రోజూ రెండు ఆపిల్స్ తినిపించారు. మూడు నెలల తర్వాత పరిశీలిస్తే... మొత్తం కొలెస్ట్రాల్ పాళ్లు గతంలో కంటే 9 శాతం, చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డిఎల్) పాళ్లు 16 శాతం తగ్గాయి. ఆరు నెలలు గడిచాక మళ్లీ పరిశీలిస్తే మొత్తం కొలెస్ట్రాల్ పాళ్లు గతంలో కంటే 13 శాతం, చెడు కొలెస్ట్రాల్ పాళ్లు 24 శాతం తగ్గాయని తేలింది. ఈ వివరాలు ‘జర్నల్ ఆఫ్ ది అకాడమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డెటైటిక్స్’లోనూ చోటు సంపాదించుకున్నాయి. కాబట్టి మహిళలూ... ఒకవేళ మీకు అలవాటు లేకపోతే... మీకు మెనోపాజ్ దశ దాటితే రోజూ తప్పనిసరిగా రెండు ఆపిల్స్ తినండి.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top