దంతాలపై పసుపురంగు చారలు... తగ్గేదెలా?

నవ్వగానే తళుక్కున మెరిసే ముత్యాల్లాంటి పలువరుస కావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. కానీ ఎన్నో కారణాల చేత పళ్లను తెల్లగా లేకుండా పసుపురంగులోనో, చారలుగానో ఉండడాన్ని చూస్తూ ఉంటాం. మనరాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తాగేనీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండడం కూడా పళ్లరంగు తెల్లగా లేకపోవడానికి ఒక కారణం. పంటికి దెబ్బ తగలడం వల్ల కూడా కొందరి పళ్లు నల్లగా మారిపోతుంటాయి. కారణం ఏదైనా దంతాలు రంగు మారడంపై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరం. దంతాలు రంగుమారడానికి ఆహారపు అలవాట్లు ప్రధాన కారణమే.

మనం తినే ఆహారపదార్థాలలోని కృత్రిమరంగులు దంతాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ రంగులు పంటిపై ఉన్న ఎనామిల్ పొరలోకి ఇంకిపోవడం వల్ల తెల్లగా ఉన్న దంతాలు కాలం గడిచేకొద్దీ మెరుపును కోల్పోతాయి. కాఫీ, టీలు ఎక్కువగా తాగడం, పాన్ గుట్కాలు నమలడం, రంగు ఉన్న కూల్‌డ్రింకులు తాగడం... వంటివి మెరిసే దంతాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఫ్లోరోసిస్, మరికొన్ని ఇతర జబ్బులు పళ్ల రంగు మారిపోవడానికి కారణం అవుతాయి.

చాలామంది పంటి పైపొరను అరగదీస్తే లోపలి పొరలు తెల్లగా ఉంటాయని అపోహ పడుతుంటారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉప్పు, బొగ్గుపొడి, ఇటుకపొడి వంటి వాటితో పళ్లను రుద్దుతుంటారు. ఇది ఏదీ శాస్త్రీయమైన పద్ధతి కాదు. ఆధునిక దంత వైద్యంలో పంటిపై చారలు, మచ్చలు వంటి వాటిని తొలగించుకోవడానికి సరియైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. కాంపోజిట్ కోటింగ్, ల్యామినేటింగ్, క్రౌన్స్ చేసుకోవడం ద్వారా పళ్లను తెల్లగా చేయవచ్చు. ఆహారపు అలవాట్ల కారణంగా రంగు మారిన దంతాలను క్లీనింగ్, పాలిషింగ్ చేయడం ద్వారా తెల్లగా చేయవచ్చు. ఆధునిక పద్ధతిలో బ్లీచింగ్ టెక్నాలజీ ద్వారా పంటికి ఎటువంటి హానీ కలగకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పళ్లను అందంగా చేయవచ్చు. ఈ ప్రక్రియల ద్వారా పళ్లు దెబ్బతింటాయని, ఎక్కువకాలం పనిచేయవని చాలామంది అపోహపడుతుంటారు. ఇది నిజం కాదు. అలాగే కేవలం చికిత్స చేయించుకుంటే సరిపోదు. ఆహారపు అలవాట్లలో మార్పులు, ఘాటైన రంగు ఉన్న ఆహారపదార్థాలను తక్కువగా తీసుకోవడం, సిగరెట్, పాన్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, రోజుకు రెండుపూటలా బ్రష్ చేయడం, ప్రతి ఆరునెలలకోసారి డెంటిస్ట్‌చే దంతాలను క్లీన్ చేయించుకోవడం ద్వారా దంతాల మెరుపును కలకాలం నిలుపుకోవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top