మహిళల కోసం ప్రత్యేక బ్యాంక్ ‘వసుంధర’ బ్యాంక్.

మీరెప్పుడైనా హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ చెక్‌పోస్ట్ దగ్గర ‘వసుంధర’ బ్యాంక్ అని బోర్డు చూశారా? ఒకవేళ చూసినా ఇది ఏదో ప్రైవేటు బ్యాంకో... సహకార బ్యాంకో అని పట్టించుకోలేదా.. అయితే మరొక్కసారి మరింత పరీక్షగా చూడండి. కాదు..కాదు.. ఒకసారి లోపలికెళ్ళి చూడండి. తలుపుతెరుచుకొని లోపలికి అడుగుపెట్టగానే తొలిసారిగా మీకు సరికొత్త వాతావారణం అక్కడ కనిపిస్తుంది. లోపలికి రాగానే అక్కడి మహిళా సిబ్బంది మీకు నవ్వుతూ స్వాగతం చెపుతూ ఏదో షాపింగ్ మాల్స్‌కి లేదా హోటల్స్‌కు వెళ్ళిన అనుభూతిని కల్పిస్తారు. 

మీతో పాటు మీ పిల్లలు వస్తే వారిని రా రమ్మంటూ వివిధ రకాల ఆట వస్తువులు పిలుస్తుంటాయి. మీరు ఇలా తలతిప్పి పక్కకి చూస్తే విశాలమైన అహ్లాదకరమైన డ్రెస్సింగ్ రూమ్ కనిపిస్తుంది. ఏంటి... ఏదో వసుంధర బ్యాంకు అన్నారు... తీరా చేస్తే ఇక్కడ ఎక్కెడా బ్యాంకు గురించి మాట్లాడటం లేదు అనుకుంటున్నారా? నిజమే మరి అక్కడి వాతావరణం మహిళలను కట్టి పడేసే విధంగా ఉంటుంది. ఇది అచ్చంగా బ్యాంకే.. అందులోను ప్రభుత్వ బ్యాంకే. బ్యాంకింగ్ కార్యకలాపాలాకు దూరంగా ఉండే మహిళా ఖాతాదారులను ఆకర్షిచండానికి ఎస్‌బీఐ ‘వసుంధర’ పేరుతో ఒక ప్రత్యేక ఈ శాఖను ఏర్పాటు చేసింది. జూబ్లిహిల్స్ రోడ్‌నెంబర్ 36లో చెక్‌పోస్ట్ సిగ్నల్‌కు చేరువలో ఉంది ఈ బ్యాంకు.



ఇక్కడ మేనేజర్ మినహా సిబ్బంది అంతా మహిళలే. నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి ఏటీఎంలు, ఉచిత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయాలు, అలాగే సొంతంగా బ్యాంకు లావాదేవీలు నిర్వహించుకోవడానికి సెల్ఫ్ కియోస్క్‌లు ఉంటాయి. అసలు మీకు బ్యాంకింగ్ కార్యకలాపాలకే కొత్త అయితే ప్రతీ ఖాతాదారునికి వ్యక్తిగతంగా సేవలను అందించడానికి సిబ్బంది అందుబాటులో ఉంటారు. వాళ్ళు మహిళలే కాబట్టి ఎటువంటి మోహమాటం, భయం లేకుండా వారితో కలివిడిగా చర్చించుకుంటూ మన పనులు పూర్తి చేసుకోవచ్చు. అలాగే నగలు, ఆభరణాలు, ఇతర విలువైన కాగితాలను భధ్రపర్చుకోవడానికి లాకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు బ్యాంకు పని పూర్తి చేసుకొని ఏదైనా ఫంక్షన్‌కి వెళ్ళాలనుకుంటే తయారు కావడానికి డ్రెస్సింగ్ రూమ్ కూడా ఉంది. 

ఇన్ని అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నారు కదా చార్జీలు, రుసుములు ఎక్కువగా ఉంటాయనుకుంటన్నారా... అటువంటి భయమేమి అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఉచితంగా అందిస్తున్న సేవలే. కాని ఇక్కడ ఖాతా ప్రారంభించాలంటే మాత్రం మహిళ అయ్యి ఉండాలన్నదే నిబంధన. కాని భర్త, తండ్రి, సోదరులతో కలిసి ఉమ్మడి ఖాతా ప్రారంభించుకోవడానికి అనుమతిస్తోంది కాని, ఇక్కడ కూడా ఒక చిన్న నిబంధన పెట్టింది ఎస్‌బీఐ. మొదటి అప్లికెంట్ పేరు తప్పనిసరిగా మహిైళె ఉండాలన్నది ఆ నిబంధన. ప్రస్తుతం వసుంధర శాఖలో కంప్యూటర్ రంగంలో పనిచేస్తున్న వారు, వ్యాపార వేత్తలు, సినిమా పరిశ్రమ, డాక్టర్లు ఖాతాలను కలిగివున్నారని, ఈ ప్రయోగం విజయవంతంగా కావడంతో దీన్ని మరిన్ని పట్టణాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు ఆ బ్యాంకు ప్రతినిధి ఒకరు తెలిపారు. మరి ఇంకెందుకు ఆలస్యం... వెళ్ళి మీరు కూడా ఒక ఖాతా తెరిచి రండి...
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top