వర్షాకాలం వచ్చిందంటే తరచుగా జలుబు, దగ్గు వస్తాయి . వీటిని నివారించాలంటే ఏం చేయాలి?

వర్షాకాలంలో వచ్చే ఈ సమస్యలకు ప్రధాన కారణం అపరిశుభ్రమైన పరిసరాలు, నీరు. జలుబు, అలర్జీ, గొంతు ఇన్‌ఫెక్షన్, కంటివ్యాధులు, చర్మవ్యాధులు కూడా వస్తుంటాయి. వీటి నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే...

వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుస్తులు వేయాలి. స్కూలుకెళ్లే పిల్లలకు రెయిన్‌కోట్, గొడుగు పంపించాలి. అపరిశుభ్రమైన నీటిలో తడవరాదు, వర్షంలో ఎక్కువసేపు తడవకుండా చూడాలి.

తడిసి ఇంటికి వచ్చిన పిల్లలకు యాంటీ బ్యాక్టీరియల్ సబ్బుతో స్నానం చేయించాలి. వేడిగా పాలు లేదా సూప్ వంటివి తాగించాలి.

ఆహారం తీసుకునే ముందు, తర్వాత చేతులను శుభ్రంగా కడిగించాలి. 

టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత మెడికేటెడ్ సబ్బు లేదా హ్యాండ్ వాష్ లిక్విడ్‌తో శుభ్రం చేయించాలి.

ఈ కాలంలో తరచూ గొంతు ఇన్‌ఫెక్షన్‌లు వస్తుంటాయి. ఇందుకు కారణం అపరిశుభ్రమైన నీటిని తాగడమే. అందుకే కాచి చల్లార్చిన నీటిని లేదా ప్యూరిఫయర్‌లో శుద్ధిచేసిన నీటిని తాగాలి.

హోటల్ వంటి చోట్ల తినేటప్పుడు తాగేనీటి విషయంలో జాగ్రత్త వహించాలి. శుద్ధి చేసిన నీటిని సప్లయ్ చేయని హోటల్‌లో బాటిల్ తీసుకోవడమే మంచిది.

తాజా పండ్లను మాత్రమే తినాలి. నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోకూడదు. 

జలుబు, దగ్గు వచ్చినప్పుడు వైద్యుని సలహా మేరకు ఆహారం, మందులు తీసుకుంటూ మిగిలిన పిల్లలతో కలవకుండా చూడాలి. 



అపరిశుభ్రమైన నీటిలో చేతులు ముంచిన తర్వాత పిల్లలు అంతటితో ఊరుకోరు,కాసేపటి తర్వాత ఆ చేతులతో కళ్లను తుడుచుకోవడం, ముఖాన్ని రుద్దుకోవడం... ఇలా ఏదో ఒకటి చేస్తుంటారు. దీనివల్ల చర్మ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. కాబట్టి చేతులు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలి.

చెవులలోకి నీరు వెళ్లనివ్వకూడదు. వెళ్లినా వెంటనే కాటన్ లేదా మెత్తటి క్లాత్‌తో సున్నితంగా తుడవాలి. ఈ కాలంలో దోమలు ఎక్కువవుతుంటాయి కాబట్టి దోమతెరలు, మస్కిటో కాయిల్స్, క్రీమ్‌లను వాడడం మంచిది.

పై జాగ్రత్తలతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచవచ్చు. ఇన్‌ఫెక్షన్లు, వైరస్ సంబంధిత వ్యాధుల నుంచి పిల్లలను కాపాడుకోవచ్చు. అలాగే ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే చాలావరకు వ్యాధులను నివారించవచ్చు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top