అమ్మబోతే అడవి కొనబోతే కొరివి ఏమిటి ?

కొన్ని సార్లు మనం ఉత్పత్తి చేసిన వస్తువును అమ్మడానికి ప్రయత్నించినప్పుడు దానికి మంచి ధర రాదు, తర్వాత ఎప్పుడో ఆ వస్తువునే కొనాల్సి వచ్చినప్పుడు దాని ధర ప్రియంగా ఉంటుంది... అలాంటి సందర్భంలో ఈ సామెతను వాడతారు. 

ఉదాహరణకు రైతు పండించిన ధాన్యానికి మార్కెట్‌లో మంచి ధర పలకదు. మంచి ధర అంటే... ధాన్యం పండించడానికి రైతు పెట్టిన పెట్టుబడి, చేసిన శ్రమతో పోలిస్తే దిగుబడి మీద వచ్చిన రాబడి సంతృప్తికరంగా ఉండదు. అదే రైతు ఎప్పుడైనా తన ధాన్యం వర్షానికి తడిసి లేదా ఏ ఇతర కారణంతోనైనా బియ్యం కాని ధాన్యం కాని కొనాల్సి వస్తే ధర చాలా ఎక్కువగా చుక్కలనంటుతున్నట్లు ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో చెప్పే సామెత ఇది. అడవి అంటే ఏ మాత్రం విలువలేనిది అనే అర్థంలో ఈ నానుడి వచ్చింది. ఇప్పటిలాగ అటవీచట్టాలు లేని రోజుల్లో... అడవిలో కాసిన కాయలు, పండ్లు ఎవరికి కావలసినవి వారు మోసుకెళ్లగలిగినంతగా కోసుకెళ్లే రోజుల్లో వచ్చిన సామెత ఇది. ఇక కొరివి అంటే కాలుతున్న కట్టె. తాకితే చుర్రుమని కాలుతుంది. కొనాల్సిన వస్తువును తాకడానికి కూడా భయపడాల్సిన పరిస్థితిని తెలిపే నానుడి. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top