మొగలిపువ్వును, ఆవును శివుడు శపించాడా?

పూర్వం బ్రహ్మవిష్ణువులు తమలో తాము ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అని వాదించుకున్నారు. ఈ వాదులాట కాస్తా వివాదంగా మారింది. అది మరింతగా పెరిగి యుద్ధానికి దారితీసింది. ఆ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి. దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు. ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మవిష్ణువుల మధ్య వెలసింది. బ్రహ్మ, విష్ణువులిరువురూ లింగాన్ని సమీపించారు. అప్పటివరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది. ఆ మహాలింగం మొదలు, తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది. బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడటానికి, విష్ణువు వరాహరూపంలో ఆదిని కనుక్కోవడానికీ బయల్దేరారు. బ్రహ్మకు ఎంతకూ లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు. ఇంతలో లింగం పక్కనుంచి ఒక కేతకపుష్పం (మొగలిపువ్వు) జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి తనకు, విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి, సహాయం చేయమని అడిగాడు. 

ఆవు కనపడితే అదేవిధంగా చెప్పి, ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధేయపడ్డాడు. సాక్షాత్తూ సృష్టికర్తయే తనని బతిమాలేసరికి కాదనలేక సరేనంటాయా రెండూ. కిందికి దిగి వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు. బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని, కావాలంటే ఆవును, మొగలిపువ్వును అడగమని చెప్పాడు. ‘నిజమే’ అంది మొగలిపువ్వు. బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం ఆగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కానీ, అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది. బ్రహ్మదేవుడి అసత్యప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలిపువ్వుతో భక్తులెవ్వరూ తనను పూజించరాదని, తెల్లవారి లేచి ఆవు ముఖం చూడటం కూడా పాపకారణమని శపించాడు. ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పృష్ఠభాగం పవిత్రమైనదని, తోకభాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరమనుగ్రహించాడు మహేశ్వరుడు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top