పిల్లల ఎత్తు పెరగటం మీ చేతుల్లోనే ఉంది ఎలాగో తెలుసుకుందాము

పిల్లలు చూస్తుండగానే పెరుగుతుంటారు. అలా పెరుగుతుంటే తల్లిదండ్రుల సంతోషం చెప్పనలవి కాదు. కానీ వయస్సు పెరుగుతున్నా పిల్లలు తగినంత ఎత్తు పెరగకపోతే ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. పిల్లాడు సరైౖన ఎత్తు పెరగకపోతే ఏ తల్లిదండ్రులకైనా బాధ ఉంటుంది. అయితే పిల్లలు ఎత్తు పెరగకపోవడానికి అనేక కారణాలుంటాయి. పిల్లలు సరిగ్గా ఎత్తు పెరగడం లేదని గుర్తించినట్లయితే వెంటనే వైద్యులకు చూపించడం ద్వారా పిల్లలు సరైౖన ఎత్తు పెరిగేలా చేయవచ్చు. 


"మా బాబు చాలా పొట్టిగా ఉన్నాడు. వీడి తోటి పిల్లలు అందరూ బాగా ఎత్తు పెరుగుతున్నారు. వీడు మాత్రం పెరగడం లేదు'' అని కంగారుపడిపోయే తల్లిదండ్రులను చూస్తుంటాం. అందరు పిల్లలూ ఎత్తు ఎదుగుతూ ఉండి, తమ పిల్లాడు మాత్రం ఎదగకుండా ఆగిపోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అయితే పిల్లలు ఎత్తు పెరగడంలో అనేక అంశాల ప్రభావం ఉంటుంది. ప్రతి పిల్లాడి మ«ధ్యా వ్యత్యాసం ఉంటుంది. పోషకాహారం, వ్యాయామం, జన్యుపరమైన అంశాలు వంటివి పిల్లలు ఎత్తు పెరగడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పిల్లలు తగినంత ఎత్తు పెరగడంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. పిల్లలను జాగ్రత్తగా గమనించడం, ఎత్తు పెరగడంలో ఏమైనా సమస్య ఉన్నట్లుగా భావిస్తే వైద్యులను సంప్రదించడం చేయాలి. త్వరగా గుర్తిస్తే తగిన మందులు ఇవ్వడం ద్వారా పిల్లలు ఆరోగ్యకరమైన ఎత్తు పెరిగేలా చేయవచ్చు. పిల్లలు పొట్టిగా ఉన్నారని తల్లిదండ్రులను చూడకుండా నిర్ధారణకు రాలేము. అయితే కొందరు పిల్లలు హార్మోన్ల సమస్య వల్ల తగినంత ఎత్తు పెరగలేకపోతారు. గ్రోత్ హార్మోన్ లోపం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య వల్ల పిల్లలు ఎత్తుతక్కువగా ఉండటాన్ని షార్ట్ స్టేచర్ అంటారు.

కొన్ని ముఖ్యమైన కారణాలు
పిల్లలు ఎదుగుదలపై అనేక అంశాల ప్రభావం ఉంటుంది. వాటిని మూడు కేటగిరీలుగా విభజించుకోవచ్చు. అవి పర్యావరణ కారకాలు, హార్మోనల్ ఫ్యాక్టర్స్, వంశపారంపర్యంగా వచ్చే అంశాలు. సామాజిక, ఆర్థిక అంశాలు, శారీరక శ్రమ, పోషకాహారం, సైకలాజికల్ స్ట్రెస్ వంటివి పర్యావరణ కారకాల కోవలోకి వస్తాయి. గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్, ఇన్సులిన్, కార్టిసాల్ వంటి వాటిని హార్మోనల్ ఫ్యాక్టర్స్‌గా చెప్పుకోవచ్చు.

లింగ బేధం, జన్యుపరమైన అంశాలు, తల్లిదండ్రుల ఎత్తు వంటివి వంశపారంపర్యంగా వచ్చే అంశాల కిందకు వస్తాయి. వీటిలో ఏ కారణం చేతనైనా పిల్లలు ఎత్తు పెరగలేకపోవడం జరుగుతుండవచ్చు. మాల్‌న్యూట్రిషన్, మాల్అబ్జార్బ్షన్, సిస్టిక్ ఫైబ్రోసిస్, క్రానిక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్, గుండె జబ్బులు ఉండటం, కాలేయ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, హైపోథైరాయిడిజం, టర్నర్ సిండ్రోమ్ వంటి కారణాల వల్ల పెరుగుదల లోపించే అవకాశం ఉంటుంది. చిన్నతనంలో గ్రోత్ హార్మోన్, థైరాయిడ్ హార్మోన్ ముఖ్య పాత్ర పోషిస్తే, యవ్వన దశలో గ్రోత్ హార్మోన్, సెక్స్ స్టెరాయిడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. రజస్వల అయిన తరువాత అమ్మాయిలు గరిష్టంగా 7 సెంమీల వరకు పెరుగుతారు. సాధారణంగా అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు 13 సెంమీలు ఎత్తు తక్కువగా ఉంటారు.

ఏడాదికి ఎంత?
మొదటి ఏడాది 25 సెంమీ
రెండవ సంవత్సరం 10 సెంమీ
మూడవ సంవత్సరం 7.5 సెంమీ
నాలుగో సంవత్సరం నుంచి యవ్వన దశ వరకు కనీసం 5 సెంమీ
యవ్వన దశలో ఏడాదికి 15 నుంచి 20 సెంమీల వరకు పెరుగుతారు.

అవసర పరీక్షలు
బోన్ ఏజ్, సీబీసీ, ఈఎస్ఆర్, ఎల్ఎఫ్‌టీ, కాల్షియం, పాస్ఫరస్, సోడియం, థైరాయిడ్ ప్రొఫైల్, కిడ్నీ ప్రొఫైల్, యూరిన్ ఎగ్జామినేషన్ వంటి పరీక్షలు చేయించాలి. క్లొనిడిన్ టెస్ట్ అనే మరొక పరీక్ష కూడా కారణాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

తగిన చికిత్స
హార్మోన్లను శరీరంలో కెమికల్ మెసెంజర్‌లుగా పిలుస్తుంటారు. అవి గ్రంధుల నుంచి విడుదలై రక్తంలో కలుస్తుంటాయి. దాదాపుగా అన్ని హార్మోన్లు పెరుగుదలపై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి. అయితే వంశపారంపర్యంగా వచ్చే కారకాలను మార్చడం కుదరదు. హార్మోన్ల లోపాన్ని సరిదిద్దడం ద్వారా ఎత్తు తగినంత పెరిగేలా చేయవచ్చు. గ్రోత్ హార్మోన్ లోపం ఉంటే గ్రోత్ హార్మోన్ థెరపీ ఇవ్వడం, థైరాయిడ్ సమస్య ఉంటే థైరాయిడ్ సప్లిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. తల్లిదండ్రులు పొట్టిగా ఉన్నట్లయితే పిల్లలు పొట్టిగానే ఉంటారు. అలాంటప్పుడు ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరమవుతుంది. గోత్ర్ హార్మోన్ ఇంజెక్షన్లు చికిత్సలో బాగా ఉపయోగపడతాయి. పిల్లలు అవసరమైన ఎత్తు పెరిగేందుకు ఈ చికిత్స బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను గమనిస్తూ ఎదుగుదలలో లోపం కనిపిస్తే వెంటనే వైద్యులకు చూపించడం మరువద్దు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top