ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ అనే ప్రకటనను నిజం చేసి, ఇతర టెలికాం కంపెనీలకు చుక్కలు చూపించిన రిలయన్స్ జియో దూకుడుకు ట్రాయ్ బ్రేకులు వేసిందని అందరూ భావించారు. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను జియో ఉపసంహరించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. ట్రాయ్ హెచ్చరికలతో జియో వెనక్కి తగ్గడంతో ఇతర టెలికాం కంపెనీలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇక జియో దూకుడుకు అడ్డుకట్ట పడినట్టేనని భావించాయి. కానీ రిలయన్స్ జియో తాజా ప్రకటనతో మళ్లీ ప్రత్యర్థి కంపెనీల వెన్నులో వణుకు పుడుతోంది.
టారిఫ్ ప్లాన్స్‌ను అప్‌డేట్ చేస్తున్నామని, త్వరలో ప్రవేశపెట్టబోతున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. ఈ ప్రకటన పట్ల వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు. జియో వల్లే డిజిటల్ ఇండియా సాధ్యమవుతుందని సోషల్ మీడియా వేదికగా మెజార్టీ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జియో మళ్లీ ఏ ఆఫర్ ప్రకటించి తమ కొంప ముంచుతుందోనని ఇతర కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జియో ఇంకెంత చౌకైన టారిఫ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెస్తుందోనన్న ఉత్కంఠ అటు టెలికాం రంగంతో పాటు, ఇటు ప్రజల్లో కూడా నెలకొంది.


